Covid-19: కరోనా అంతు చూసే మాస్కు!

29 Jul, 2022 01:19 IST|Sakshi
దిబాకర్‌ భట్టాచార్య

కరోనా ఇక కాస్త మందగించిందంటూ మూడో వేవ్‌ దాటిన తర్వాత ప్రజలంతా కొద్దిగా హాయిగా ఊపిరి తీసుకుంటున్న సమయంలో... తన ప్రభావం ఇంకా పూర్తిగా తొలగిపోలేదంటూ అది అడపాదడపా సందడి చేస్తూనే ఉంది. దేశంలో చాలా చోట్ల కేసులు మళ్లీ పెరుగుతున్నాయంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. దాంతో మూలన విసిరేసిన మాస్కుల డబ్బాలు మళ్లీ తెరవాల్సిందేనంటూ ఆరోగ్య నిపుణులూ, ప్రభుత్వ పెద్దలూ హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ తాకిన కొద్దిసేపటికి అది నిర్వీర్యం అయిపోయే కొత్త మాస్కులను శాస్త్రవేత్తలు రూపొందించారు. వైద్యులు వాడే ఎన్‌–95 మాస్కులూ, ప్రజలు ఉపయోగించే మూడు పొరల మాస్కుల తరహాలో కరోనాను అరికట్టే రసాయనంతో మరో పొరను చేర్చుతూ వీటిని రూపొందించామంటున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ కెంటకీకి చెందిన కెమికల్‌ ఇంజనీర్‌ దిబాకర్‌ భట్టాచార్య.

‘కొత్తగా రూపొందించిన ఈ పొర మీదికి ‘సార్స్‌–సీవోవీ–2’వైరస్‌ లేదా దానికి సంబంధించిన అంశాలేవైనా చేరి... అక్కడ దాని మీద కనీసం 30 సెకండ్ల పాటు ఉంటే దాని స్పైక్‌ ప్రోటీన్‌ నిర్వీర్యమవుతుంది. కొమ్ముల్లా ఉండే ఈ స్పైక్‌ ప్రోటీన్‌ను ఓ తాళం చెవిలా ఉపయోగించుకునే వైరస్‌ మన జీవకణాల్లోకి చేరుతుందన్న విషయం తెలిసిందే. ఇది ఎన్‌–95లా పనిచేస్తున్నప్పటికీ దీనిపైని అదనపు పొరపై యాంటీవైరస్‌ ఎంజైమ్‌ పూత ఉంటుంది.

అది కరోనా వైరస్‌ను నిర్వీర్యం చేస్తుంది. తద్వారా ‘సార్స్‌–సీవోవీ–2’వ్యాప్తిని గణనీయంగా అరికడుతుంది’అంటున్నారు దిబాకర్‌ భట్టాచార్య. దీనిని మరింత అభివృద్ధి చేస్తే  మరింత సమర్థంగా వ్యాప్తిని అరికడుతుందనే భరోసా ఇస్తున్నారు. దీన్లో వాడిన ‘స్మార్ట్‌ ఫిల్టరేషన్‌ మెటీరియల్‌’కేవలం గాల్లో వ్యాపించి కరోనాను వ్యాప్తిచేసే ఏరోసాల్స్‌ను మాత్రమే నిర్వీర్యం చేస్తుంది తప్ప శ్వాసప్రక్రియకు ఎలాంటి అవరోధం కల్పిందంటూ పరిశోధకులు భరోసా ఇస్తున్నారు.

ఇవి అటు డ్రాప్‌లెట్స్‌(సన్నటి లాలాజల తుంపర్ల)తో పాటు ఇటు ఏరోసాల్స్‌ (గాల్లో ఉండే అతి సూక్ష్మమైన కణాలు) ద్వారా కలిగే వైరస్‌ వ్యాప్తులను అరికడుతుందంటున్నారు. విశ్వసనీయమైన ఎన్‌–95 కంటే సమర్థమైందని, కరోనా వైరస్‌ సహా, 100 నానోమీటర్ల సైజులో ఉన్న అన్ని పార్టికిల్స్‌నూ 98.9 శాతం సమర్థంగా అడ్డుకుంటుందనేది పరిశోధకుల మాట. ఈ వివరాలన్నీ ‘కమ్యూనికేషన్స్‌ మెటీరియల్స్‌’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

మరిన్ని వార్తలు