రెండు మాస్కులతో రెండింతల రక్షణ!

20 Apr, 2021 10:18 IST|Sakshi

యూనివర్సిటీ ఆఫ్‌ నార్తు కరోలినా పరిశోధనలో వెల్లడి 

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్‌ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే మాస్కు కచ్చితంగా ధరించాలని అందరికీ తెలుసు. రెండు మాస్కులు ధరిస్తే రెండింతల రక్షణ లభిస్తుందని తెలుసా? ఇలా ధరిస్తే వైరస్‌ బారినపడే అవకాశాలే లేవని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ నార్తు కరోలినా(యూఎన్‌సీ) తాజా పరిశోధనలో తేలింది.

ఈ వివరాలను జామా ఇంటర్నల్‌ మెడిసిన్‌ జర్నల్‌ తాజా సంచికలో ప్రచురించారు. రెండు టైట్‌ ఫిట్‌ మాస్కులు సార్స్‌–కోవ్‌–2 సైజ్‌ వైరస్‌ను సమర్థంగా ఫిల్టర్‌ చేస్తాయని, నోరు, ముక్కులోకి వెళ్లకుండా అడ్డుకుంటాయని ఈ పరిశోధన చెబుతోంది. మాస్కుల్లో ఎక్కువ బట్ట పొరలు వాడడం వల్ల వాటి మధ్య ఖాళీ స్థలం తగ్గిపోతుంది.

ఖాళీ లేకపోతే లోపలికి వైరస్‌ ప్రవేశించే అస్కారం లేదని యూఎన్‌సీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఎమిలీ సిక్‌బర్ట్‌–బెన్నెట్‌ చెప్పారు. మాస్కు ముఖానికి సరిగ్గా అమరకపోతే రక్షణ పెద్దగా ఉండదని తెలిపారు. బట్ట పొరలను ఖాళీ లేకుండా బిగువుగా కలిపి కుట్టిన మాస్కు ఉత్తమమైనదని చెప్పారు. సాధారణ క్లాత్‌ మాస్కు 40 శాతం రక్షణ కల్పిస్తుందని అధ్యయనకర్తలు వెల్లడించారు. సర్జికల్‌ మాస్కు అయితే 40–60 శాతం రక్షణ ఇస్తుందన్నారు. సర్జికల్‌ మాస్కుపై క్లాత్‌ మాస్కు ధరిస్తే కరోనా నుంచి రక్షణ మరో 20 శాతం పెరుగుతుందన్నారు.  

సోమవారం అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలు
మహారాష్ట్ర -       58,924 
ఉత్తరప్రదేశ్‌-        30,566
ఢిల్లీ       -          25,462 
కర్ణాటక  -         19,067
కేరళ      -        18,257 
ఛత్తీస్‌గఢ్‌ -        12,345 
మధ్యప్రదేశ్‌  -    12,248 
తమిళనాడు -    10,723 
గుజరాత్‌     -    10,340 
రాజస్తాన్‌    -     10,262   

చదవండి: వామ్మో కరోనా.. గతవారం మనమే

మరిన్ని వార్తలు