Shocking Videos: చైనాను వణికిస్తున్న కరోనా.. వీధుల్లోనే శవాలను కాల్చేస్తున్నారు..

4 Jan, 2023 20:56 IST|Sakshi

కరోనా వైరస్‌ చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.  కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ బీఎఫ్‌7 డ్రాగన్‌ దేశంలో విస్తృతంగా వ్యాప్తిస్తోంది. ప్రతి రోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దేశంలో వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే మహమ్మారి విషయంలో చైనా ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కరోనా లెక్కలు వెల్లడించకుండా దాచేస్తూ వికృత చేష్టలకు పాల్పడుతోంది.  దీంతో చైనా కేసులు, మరణాలు వివరాలు బయటికి రావడం లేదు.

చైనాలో కరోనా పరిస్థితులు ఊహకందని విధంగా భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.  కోవిడ్‌ రోగులతో ఆసుపత్రులు అన్నీ కిక్కిరిపోతున్నాయి. రోగులకు సేవలు అందించేందుకు వైద్యులు సరిపోవడం లేదు. మరోవైపు శవాల కుప్పలతో శ్మశాన వాటికలు నిండిపోతున్నాయి. చాలా మంది మృతదేహాలను మార్చురీలోనే వదిలేస్తున్నారు. ఇక రాబోయే నెలల్లో చైనాలో 2 మిలియన్లకుపైగా కోవిడ్‌ మరణాలు సంభవించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

కరోనాకు సంబంధించి చైనా నుంచి వెలువుడుతున్న దృశ్యాలు కలవరానికి గురిచేస్తున్నాయి. తాజాగా అలాంటి కొన్ని  భయంకర వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అక్కడ కోవిడ్‌ మరణాలు పెరిగిపోవడంతో శ్మశాన వాటికలు నిండిపోయాయి. రిజిస్ట్రేషన్ కోసం ఫ్యూనరల్ హోమ్ వద్ద ప్రజలు ఎగబడుతున్నారు. మరోవైపు అంత్యక్రియలు నిర్వహించే వారు(ఫ్యూనరల్‌ హోమ్స్‌) అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రజలే తమ సొంత ఖర్చులతో మృతదేహాలను వీధుల్లో దహన సంస్కరాలను నిర్వహిస్తున్నారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న ఖాళీ స్థలాల్లో అంత్యక్రియలు జరిపేస్తున్నారు కుటుంబ సభ్యులు.
చదవండి: భారత్‌లో కోవిడ్‌ భయాలు.. స్కూళ్లు, కాలేజీలకు కరోనా సెలవులు! నిజమెంత?

‘ఓ వ్యక్తి వాళ్ల తండ్రి కరోనాతో మృతిచెందాడు. శ్మశానవాటికలో మృతదేహాన్ని దహనం చేయడం ఖరీదుతో కూడుకుంది.దహన సంస్కారాలకు అయ్యే ఖర్చులను భరించలేక అతను తన తండ్రి మృతదేహాన్ని బహిరంగ స్థలాన్ని ఎంచుకొని అంత్యక్రియలు జరిపించాడు. ఇకపై అన్ని ప్రాంతాల్లో ఎవరైనా ఈ విధానాన్ని ఎంచుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు’ అంటూ  స్థానికులు సోషల్‌  మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో చేసిన పోస్టులో పేర్కొన్నారు. ఈ వీడియోలు ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి.

మరిన్ని వార్తలు