పోదామా అమెరికా.. ఆ పొరపాట్లు చేయొద్దు

26 Dec, 2020 09:15 IST|Sakshi

అమెరికా.. భారతీయ విద్యార్థుల కల! ఏటా లక్షల మంది యూఎస్‌ యూనివర్సిటీల్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. కాని ఈ సంవత్సరం కరోనా కారణంగా అమెరికాలో ఉన్నత విద్య స్వప్నం సందిగ్ధంలో పడింది. కొవిడ్‌ నేపథ్యంలో.. అమెరికాలో ఉన్నత విద్యకు వెళ్లడం సరైందేనా.. అక్కడి వర్సిటీలు ఎలాంటి వెసులుబాట్లు కల్పిస్తున్నాయి. ఇప్పటికే చేరిన విద్యార్థులకు తరగతుల నిర్వహణ ఎలా ఉంది? ఫీజులు ఏమైనా తగ్గిస్తున్నారా.. మన విద్యార్థుల  స్పందన ఎలా ఉంది.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు హైదరాబాద్‌లోని యూఎస్‌–ఇండియా ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌  రీజనల్‌ ఆఫీసర్‌  మోనికా సెటియాతోపాటు అమెరికాలోని టాప్‌ యూనివర్సిటీల  అధికారులు స్వయంగా సమాధానాలు ఇస్తున్నారు!!

ఆంధ్రప్రదేశ్‌/తెలంగాణ విద్యార్థుల నుంచి అమెరికాలో ఉన్నత విద్య పరంగా ఎలాంటి కోర్సులకు డిమాండ్‌ ఉంది? 
ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(ఐఐఈ) ఓపెన్‌ డోర్స్‌ వార్షిక నివేదిక ప్రకారం–2018–2019 విద్యాసంవత్సరంలో స్టెమ్,మ్యాథ్స్‌/కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులకు భారతీయ విద్యార్థుల్లో ఎక్కువ ఆదరణ ఉంది. 2018–2019 విద్యా సంవత్సరంలో అమెరికాలో ఉన్నత విద్యకు వెళ్లిన భారత విద్యార్థుల్లో 37శాతం మంది మ్యాథ్స్‌ /కంప్యూటర్‌ సైన్స్, 34.2 శాతం మంది స్టెమ్‌ కోర్సుల్లో చేరారు. ఆ తర్వాత స్థానంలో బిజినెస్‌/మేనేజ్‌మెంట్‌ 10.3 శాతం,ఫిజికల్‌/లైఫ్‌సైన్సెస్‌ 5.6శాతం ఉన్నాయి. రాష్ట్రస్థాయి డేటా అందుబాటులో లేనప్పటికీ.. ఆంధ్రప్రదేశ్, తెలం గాణ, ఒడిషా రాష్ట్రాల విద్యార్థులు ఎక్కువగా కంప్యూ టర్‌సైన్స్, స్టెమ్‌ ప్రోగ్రామ్స్‌లో చేరుతున్నట్లు ట్రెండ్‌ను బట్టి అర్థమవుతోంది. 2009–2010లో19.8 శాతం మంది విద్యా ర్థులు మ్యాథ్స్‌/కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుల్లో చేరగా..అది 2018–2019 నాటికి 37శాతానికి పెరిగింది. అదే సమయంలో బిజినెస్‌/మేనేజ్‌మెంట్, ఫిజికల్‌/లైఫ్‌ సైన్సెస్‌ పట్ల ఆసక్తి కొద్దిగా తగ్గింది. గత దశాబ్ద కాలంగా సోషల్‌ సైన్సెస్, హుమానిటీస్, ఆర్ట్స్, ఎడ్యుకేషన్, హెల్త్‌ కోర్సులకు డిమాండ్‌ స్థిరంగా ఉంది. అలాగే 2018–2019 విద్యా సంవత్సరంలో ఉన్నత విద్యలో చేరిన భారతీయ విద్యా ర్థుల్లో 3.2శాతం మంది హెల్త్‌కేర్‌ కోర్సులను ఎంచు కున్నారు. 2010 నుంచి దాదాపు ఇదే ట్రెండ్‌ కనిపిస్తోంది. 

అమెరికాలో ఉన్నత విద్య కోర్సులకు దరఖాస్తు చేసుకునేటప్పుడు విద్యార్థులు ఎలాంటి పొరపాట్లు చేస్తున్నారు? వాటిని ఎలా అధిగమించవచ్చో తెలపండి?
దరఖాస్తు సందర్భంగా విద్యార్థులు చాలా పరిమిత సంఖ్యలో యూనివర్సిటీలను ఎంచుకుంటున్నారు. వాస్తవానికి అమెరికా ఉన్నత విద్యావ్యవస్థ 4500 కాలేజీలు /యూనివర్సిటీల్లో కోర్సులను ఎంచుకునే అవకాశం విద్యార్థులకు కల్పిస్తోంది. అలాగే కాలేజీకి, కోర్సుకు అక్రిడి టేషన్‌ ఉందో లేదో పరిశీలించకుండానే దరఖాస్తు చేసుకో వడం చాలామంది విద్యార్థుల చేస్తున్న మరో పొర పాటు. అదేవిధంగా యూఎస్‌లో ఉన్నత విద్య కోర్సులో ప్రవేశం పొందడంలో విద్యార్థి ఆర్థిక స్థితి కూడా కీలకంగా నిలుస్తుంది. కాబట్టి దరఖాస్తు చేసుకోవడానికి ముందే చదువుకు అయ్యే ఖర్చు, సదరు నిధులు ఎక్కడ నుంచి సమకూరుతాయి అనే విషయంలో స్పష్టత అవసరం. దరఖాస్తు టైమ్‌లైన్, విద్యార్థి వీసా అప్లికేషన్స్, ఇంటర్వ్యూ కూడా అడ్మిషన్‌ పొందడంలో అత్యంత కీలకమైన అంశాలుగా పేర్కొనవచ్చు. 
► విద్యార్థులు అమెరికాలో చదువులకు పయనమవడానికి ముందే అక్కడి భిన్నమైన అకడెమిక్, సోషల్‌ కల్చర్‌పై అవగాహన పెంచుకోవాలి. లేకుంటే అక్కడ కుదురు కోవడానికి చాలా సమయం పట్టే ఆస్కారం ఉంటుంది. 
► అమెరికా యూనివర్సిటీలోకి దరఖాస్తు ప్రక్రియ, ప్రవేశ విధానం తదితర అన్ని అంశాలపై సలహాలు సూచనల కోసం విద్యార్థులు https://educationusa.org/ను సందర్శించి అవసరమైన సమాచారం పొందొచ్చు. 
► ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా విద్యార్థులకు ఎలాంటి సందేహం ఉన్నా...usiefhyderabad @usief.org.in కు మెయిల్‌ చేయొచ్చు. 
  మోనికా సేటియా, రీజనల్‌ ఆఫీసర్, యునైటెడ్‌ స్టేట్స్‌–ఇండియా ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌–హైదరాబాద్‌

ప్రవేశాలు పెరిగాయి
ప్రస్తుత కొవిడ్‌–19 పరిస్థితుల్లో అమెరికా యూనివర్సిటీల్లో చేరే విషయంలో భారతీయ విద్యార్థుల నుంచి ఎలాంటి స్పందన ఉంది?
మేం 2019 ఆగస్టు, నవంబర్‌ మధ్య భారత్‌లో విస్తృతంగా పర్యటించాం. దేశవ్యాప్తంగా పది పట్టణాల్లో ఎడ్యుకేషన్‌ ఫెయిర్స్‌లో పాల్గొన్నాం. ఫలితంగా 2020 ఫాల్‌లో అండర్‌గ్రాడ్యయేట్‌ ఫ్రెష్‌మెన్‌ ప్రవేశాలు 5.5 శాతం పెరిగాయి. క్యాంపస్‌కు  రాలేని 58 మంది విద్యార్థులు ఇంటర్నేషనల్‌ అడ్వెంచర్‌ లెర్నింగ్‌ కమ్యూనిటీ ప్రోగ్రామ్‌ ద్వారా యూనివర్సిటీలో ప్రవేశం పొందారు. ఈ విద్యార్థులు ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్, బిజినెస్, జనరల్‌ ట్రాక్స్‌ విధానంలో ఆన్‌లైన్‌లో క్లాసులకు హాజరవుతున్నారు. 

విద్యార్థులు ఐవోవా యూనివర్సిటీలో ఎలాంటి కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు? 
ద ఐవోవా స్టేట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ.. స్టెమ్‌/ఇంజనీరింగ్‌/సైన్స్‌ కోర్సుల్లో విద్యార్థులను ఆకర్షించడంలో ముం దుంటోంది. భారతీయ విద్యార్థులు ఎక్కువగా స్టెమ్, కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రికల్‌ అండ్‌ కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు. ఆ తర్వాత మెకానికల్‌ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ అండ్‌ బిజినెస్‌ అనలిటిక్స్, ఇండస్ట్రియల్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ సిస్టమ్స్‌ ఇంజనీరింగ్, ఎయిరోస్పేస్‌ ఇంజనీరింగ్, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్, హుమాన్‌ కంప్యూటర్‌ ఇంటరాక్షన్, స్టాటిస్టిక్స్, అండ్‌ ఆర్కిటెక్చర్‌ వంటి కోర్సులవైపు మొగ్గుచూపుతున్నారు.  

ప్రస్తుత కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో తరగతుల నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?  
ఐవోవా స్టేట్‌ యూనివర్సిటీ తెరిచే ఉంది. క్యాంపస్‌లో విద్యార్థులు ఉన్నారు.  మేం ముఖాముఖి, ఆన్‌లైన్, హైబ్రిడ్, అరేంజ్‌డ్‌ విధానంలో తరగతుల నిర్వహణ విధానం అమలు చేస్తున్నాం. 
కొవిడ్‌ పరిస్థితుల్లో జీఆర్‌ఈ, ప్రామాణిక ఇంగ్లిష్‌ టెస్టింగ్‌ పరీక్షల పరంగా ఏమైనా మినహాయింపు ఉందా?  
యూనివర్సిటీలోని పలు విభాగాలు జీఆర్‌ఈ/జీమ్యాట్‌కు మినహా యింపు ఇస్తున్నాయి. అలాగే డుయోలింగో ఇంగ్లిష్‌ టెస్ట్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నాం. దీనికి విద్యార్థులు తమ ఇంటి నుంచే హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే మేం టోఫెల్‌  స్పెషల్‌ హోం ఎడిషన్‌ను కూడా అంగీకరిస్తున్నాం. 

ఈ సంవత్సరంతోపాటు వచ్చే స్ప్రింగ్‌ సెషన్‌కు కోర్సు ఫీజు ఏమైనా తగ్గిస్తున్నారా?  స్కాలర్‌షిప్స్‌ అందుబాటులో ఉన్నాయా? 
యూనివర్సిటీలో చేరిన అంతర్జాతీయ విద్యార్థులకు మెరిట్‌ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఫాల్‌ 2021 ఎంట్రీ నుంచి మా అంతర్జాతీయ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను విస్తరించనున్నాం. దీనిద్వారా విద్యార్థులకు మద్దతుగా నిల్వనున్నాం. 

ప్రస్తుత  కొవిడ్‌–19 పరిస్థితుల్లో  విద్యార్థులు చదువుతోపాటు క్యాంపస్‌లో పనిచేసే అవకాశం ఉందా? 
యూనివర్సిటీ క్యాంపస్‌లో వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి. డైనింగ్‌ సెంటర్, రెసిడెన్స్‌ హాల్స్, లైబ్రరీ, బుక్‌స్టోర్, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీస్, పెయిడ్‌ అండర్‌గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్‌ రీసెర్చ్‌ ఆపర్చునిటీస్, పెయిడ్‌ స్టూడెంట్‌ కన్సల్టింగ్‌ ప్రోగ్రామ్స్, ఇంటర్న్‌షిప్స్‌ వంటì వి చేసే అవకాశం ఉంది. 

కొవిడ్‌ బారిన పడకుండా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? 
ఐవోవా స్టేట్‌ యూనివర్సిటీలో కొవిడ్‌–19 నివారణ చర్యల్లో భాగంగా టెస్టింగ్, కాంటాక్ట్‌ ట్రేసింగ్, మాస్క్‌లు ధరించడం వంటివి తప్పనిసరి చేశాం. తరగతిలో విద్యార్థుల సంఖ్యను తగ్గించాం. వివిధ విధానాల్లో బోధన అందిస్తున్నాం. ఐసోలేషన్, క్వారంటైన్‌ సౌకర్యం, సమావేశాలపై ఆంక్షలు తదితర చర్యలు తీసుకుంటున్నాం. 
కేథరిన్‌ జాన్సన్‌ సుస్కి,ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ అండ్‌ న్యూ స్టూడెంట్‌ ప్రోగ్రామ్స్‌–ఆఫీస్‌ ఆఫ్‌ అడ్మిషన్స్, ఐవోవా స్టేట్‌ యూనివర్సిటీ.

క్యాంపస్‌ తెరిచే ఉంది

కొవిడ్‌–19 పరిస్థితుల్లో అమెరికా యూనివర్సిటీల్లో ప్రవేశాల పరంగా భారతీయ విద్యార్థుల స్పందన ఎలా ఉంది? 
2020 నవంబర్‌ నాటికి పెన్సెల్వేనియా స్టేట్‌ యూనివర్సిటీలో ఫాల్‌సె మిస్టర్‌ (ఆగస్టు 2021)కు దరఖాస్తు చేసుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య 27 శాతం పెరిగింది. ఈ యూనివర్సిటీ ప్రపంచంలోనే టాప్‌1 శాతం విశ్వవిద్యాల యాల జాబితాలో నిలుస్తుంది. అమెరికాలో ఎక్కువమంది అంతర్జాతీయ విద్యార్థులను కలిగిన యూనివర్సిటీల జాబితాలో 12వ స్థానంలో ఉంది. అలాగే కెరీర్‌ సర్వీస్‌లో 9వ స్థానంలో నిలిచింది. మా విద్యార్థుల ఆరోగ్య భద్రతకు మేం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. ఫాల్‌ సీజన్‌లో యూఎస్‌లోని పలు ఇన్‌స్టిట్యూ ట్స్‌ను మూసేసినా.. మేం మాత్రం మా విద్యార్థులను క్యాంపస్‌కు స్వాగత పలికాం. 

విద్యార్థులు ఎక్కువగా కోరుకుంటున్న కోర్సుల(అండర్‌ గ్రాడ్యుయేట్, గ్రాడ్యు యేట్‌) గురించి చెప్పండి? 
కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌లో 14 అండర్‌గ్రాడ్యుయేట్‌ మేజర్స్, 13 మాస్టర్స్‌ డిగ్రీలకు బాగా ఆదరణ ఉంది. వీటితోపాటు పెన్సెల్వేనియా యూనివ ర్సిటీ ఎయిరోస్పేస్‌ ఇంజనీరింగ్, బయలాజికల్‌ ఇంజనీరింగ్, బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌ వంటి పాపులర్‌ కోర్సులను కూడా అందిస్తోంది. భారతీయ విద్యార్థులు కంప్యూటర్‌ సైన్స్‌లో చేరడానికి బాగా ఆసక్తి చూపుతున్నారు. అలాగే బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్,

బిజినెస్‌ కోర్సులను చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. 
ప్రస్తుత కొవిడ్‌ పరిస్థితుల్లో తరగతుల నిర్వహణకు యూనివర్సిటీ ఎలాంటి ప్రణాళిక రూపొందిస్తోంది. స్టెమ్‌ కోర్సులకు ప్రాక్టికల్స్‌ ఎలా నిర్వహిస్తారు?
మా యూనివర్సిటీ క్యాంపస్‌లు అన్నీ అంతర్జాతీయ విద్యార్థుల కోసం తెరిచే ఉన్నాయి. ఈ సంవత్సరం యూఎస్‌కు రాగలిగే కొత్త విద్యార్థులు క్యాంపస్‌లో ఉండొచ్చు. కొంతమంది విద్యార్థులకు మహమ్మారి సమయంలో తమ కుటుంబాలకు దగ్గరగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అలాంటి విద్యార్థుల కోసం పెన్సెల్వేనియా యూనివర్సిటీలో పూర్తి స్థాయి టెక్నాలజీతో ఆన్‌లైన్‌ క్లాస్‌ వర్క్‌ విధానం ఉంది. 

కొవిడ్‌ పరిస్థితుల్లో జీఆర్‌ఈ, ఇంగ్లిష్‌ టెస్టింగ్‌ పరీక్షల నుంచి సడలింపు కల్పిస్తున్నారా? 
2021 అండర్‌గ్రాడ్యుయేట్‌ అడ్మిషన్లకు ఎస్‌ఏటీ, ఎసీటీ టెస్ట్‌ ఆప్షనల్‌. అంటే.. విద్యార్థి ఈ టెస్ట్‌లకు హాజరుకావాల్సిన పనిలేదు. అలాగే 2022, 2023 లోనూ ఇదే విధానం కొనసాగుతుందని భావిస్తున్నాం. ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ టెస్టుకు సంబంధించి టోఫెల్, ఐఈఎల్‌టీఎస్‌తోపాటు డుయోలింగో, ద టోఫెల్‌ ఎట్‌ హోం ఎడిషన్, ఐఈఎల్‌టీఎస్‌ ఇండికేటర్‌లను పరిగణనలోకి తీసుకుం టున్నాం. కొన్ని ప్రోగ్రామ్‌లకు జీఆర్‌ఈ,

జీమ్యాట్‌ అవసరం లేదు. 
ఈ సంవత్సరంతోపాటు వచ్చే స్ప్రింగ్‌ సెషన్‌లో  ఫీజులు తగ్గించే అవకాశం ఉందా? విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌ అందుబాటులో ఉన్నాయా?
ఈ సంవత్సరం మేం ట్యూషన్‌ ఫీజు పెంచలేదు. వచ్చే ఏడాదికి సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. యూనివర్సిటీ విద్యార్థుల అవసరా లను సదా దృష్టిలో పెట్టుకుంటుంది. మాస్టర్స్, డాక్టోరల్‌ స్థాయిలో గ్రాడ్యుయేట్‌ స్టూడెంట్‌ అసిస్టెంట్‌షిప్స్, ఫెలోషిప్స్‌ను పెద్ద సంఖ్యలో కొనసాగిస్తున్నాం. మా ఓపీటీ ప్లేస్‌మెంట్స్‌ ప్రక్రియ అద్భుతంగా ఉంది. అలాగే గ్రాడ్యుయేట్‌ స్థాయిలో విద్యార్థులకు ఆర్థికంగా మద్దతు అందిస్తున్నాం. 

ప్రస్తుత కొవిడ్‌–19 పరిస్థితుల్లో విద్యార్థులు చదువుతోపాటు యూనివర్సిటీ క్యాంపస్‌లో పనిచేసేందుకు అవకాశం ఉందా? 
చదువుతోపాటు యూనివర్సిటీ క్యాంపస్‌లో గ్రాడ్యుయేట్‌ అసిస్టెంట్‌గా పని చేసేందుకు అవకాశం ఉంది. అండర్‌గ్రాడ్యుయేట్‌ స్థాయిలో ప్రతి అంతర్జాతీయ విద్యార్థి వారానికి  20 గంటలు పనిచేసేందుకు అనుమతి ఉంది.  

కొవిడ్‌–19 బారిన పడకుండా క్యాంపస్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
పెన్సెల్వేనియా యూనివర్సిటీలో అద్భుతమైన మెడికల్‌ స్కూల్, నర్సింగ్, పబ్లిక్‌ హెల్త్‌ కాలేజీ ఉన్నాయి. మా ఫ్యాకల్టీలో అంతర్జాతీయ స్థాయి అంటువ్యాధుల నిపుణులు ఉన్నారు. ఆగస్టు 2020 నుంచి క్యాంపస్‌లో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించేలా నిబంధనలు అమలు చేస్తున్నాం. కొవిడ్‌ టెస్టులు నిర్వహిస్తున్నాం. అలాగే కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ విధానం,  ఐసోలేషన్, క్వారంటైన్‌ కోసం అవసరమైన సౌకర్యాలు ఉన్నాయి. ఫలితంగా  ఫాల్‌ సెమిస్టర్‌ మొత్తం యూనివర్సిటీ తెరిచే ఉంది. స్ప్రింగ్‌ సెషనల్‌లో కూడా తెరిచే ఉంచాలని భావిస్తున్నాం. 
డాక్టర్‌ రోజర్‌ బ్రిండ్లీ, వైస్‌ ప్రోవోస్ట్‌ ఫర్‌ గ్లోబల్‌ ప్రోగ్రామ్స్, ద పెన్సెల్వేనియా స్టేట్‌ యూనివర్సిటీ.

స్టెమ్, ఎంబీఏవైపు మొగ్గు
కొవిడ్‌–19 పరిస్థితుల్లో యూఎస్‌ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం చూస్తున్న భారతీయ విద్యార్థుల నుంచి స్పందన ఎలా ఉంది?
గతంలో భారతదేశంలో ఎడ్యుకేషన్‌ ఫెయిర్స్‌ నిర్వహించినప్పటితో పోలిస్తే ప్రస్తుత పరిస్థితులు కొంత మందకొడిగా ఉందనే చెప్పొచ్చు. యూఎస్‌ విద్యా సంస్థల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య మాత్రం స్థిరంగా ఉంది. హూస్టన్‌ ప్రాంతంలో ఇండియా నుంచి వచ్చిన హెచ్‌–1బీ వీసాదారులతోపాటు వారిపై ఆధారపడిన హెచ్‌4 వీసాదారులు కూడా తమ విద్యార్హతలను పెంచుకునేందుకు కోర్సుల్లో చేరుతున్నారు. యూఎస్‌లో చదువు పూర్తిచేసుకొని భారత్‌కు తెరిగి వెళ్లిన విద్యార్థులు సైతం అమెరికాలో కొత్త కోర్సులు పూర్తిచేసేందుకు తిరిగి దరఖాస్తు చేసుకుంటున్నారు.  ముఖ్యంగా ఎంబీఏ చేసేందుకు వస్తున్న ఇంజనీరింగ్‌ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది.  

అండర్‌ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్‌ స్థాయిలో ఏ కోర్సుల్లో విద్యార్థులు ఎక్కువగా చేరుతున్నారు? 
ఎక్కువగా స్టెమ్, ఎంబీఏ ప్రోగ్రామ్స్‌ను ఎంచుకుంటున్నారు. ఇండియా నుంచి వచ్చే విద్యార్థులు ముఖ్యంగా కంప్యూటర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ డిజిటల్‌ గేమింగ్‌లో డిగ్రీ చేసేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు.  దీంతోపాటు సైకాలజీలో అండర్‌ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్‌ కోర్సులు చేసేందుకు వచ్చే విద్యార్థినుల సంఖ్య కూడా పెరుగుతోంది. 

కొవిడ్‌ మహమ్మారి పరిస్థితిలో క్లాస్‌వర్క్‌ కోసం వర్సిటీ ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తోంది? 
మహమ్మారి ప్రారంభమైన మార్చిలో మా విశ్వవిద్యాలయాన్ని మూసివేశాం.  క్యాంపస్‌లో ఉండి ముఖాముఖి బోధన కావాలనుకునే విద్యార్థులకు అనువుగా ఫాల్‌ సెషన్‌లో క్యాంపస్‌ను తెరిచాం. కొత్త అంతర్జాతీయ విద్యార్థులందరూ యూఎస్‌ వీసాలు పొందగానే క్యాంపస్‌కు వచ్చారు. కోర్సులను ముఖాముఖి, హైబ్రిడ్‌ అండ్‌ ఆన్‌లైన్‌లో అందించేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. మా వర్సిటీ కొవిడ్‌–19 టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసింది. 

కొవిడ్‌ –19 దృష్ట్యా మీ వర్సిటీ జీఆర్‌ఈ స్కోరు లేదా ప్రామాణిక ఇంగ్లిష్‌ టెస్టింగ్‌ నిబంధనల్లో  సడలింపు ఇస్తోందా
ఇంగ్లిష్‌ స్కిల్స్‌ కోసం డుయోలింగోను అమలు చేశాం. డుయోలింగో ఒక కొత్త ఇంగ్లిష్‌ స్కిల్‌ టెస్ట్, దీనిద్వారా విద్యార్థులు తమ ఇంటి నుంచే పరీక్ష రాసేందుకు వీలుంది. ఇక, విదేశీ విద్యార్థుల కోసం హూస్టన్‌ యూనివర్సిటీ శాట్‌/ఆక్ట్‌ స్కోర్స్‌ను గతంలోనే రద్దు చేసింది. మేము విద్యార్థుల ప్రతిభను వారి జాతీయ పరీక్షల్లోను, లేదా వారి హైస్కూల్, మాధ్యమిక, పోస్ట్‌–సెకండరీ స్కూలింగ్‌ తీరును ఆయా సంస్థల నుంచి తెలుసుకుంటాం.  

ప్రస్తుత కొవిడ్‌ సంక్షోభ సమయంలో విద్యార్థులు చదువుతోపాటు క్యాంపస్‌లో పనిచేసే అవకాశం ఉందా? 
మా విద్యార్థులు ఆన్‌ క్యాంపస్‌గాను, రిమోట్‌గాను పనిచేస్తున్నారు. మా గ్రాడ్యుయేట్‌ కోర్సుల విద్యార్థులు..స్టెమ్‌లోనే కాకుండా.. బిజినెస్‌ కోర్సుల్లో కూడా గ్రాడ్యుయేట్‌ అసిస్టెంట్‌షిప్స్‌ పొందారు. 

కొవిడ్‌ నివారణకు వర్సిటీ క్యాంపస్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
క్యాంపస్‌లో సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌(సిడిసి) మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి భవనం ప్రవేశద్వారం వద్ద శానిటైజింగ్‌ అండ్‌ టెంపరేచర్‌ స్టేషన్లు ఉన్నాయి. స్టడీ డెస్క్‌ల చుట్టూ

ప్లెక్సీ షీల్డ్స్‌ను ఏర్పాటు చేశాం. భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు వర్సిటీ ఏమైనా ప్రత్యేక ఆఫర్లు ఇస్తోందా?
భారతీయ విద్యార్థులు యూనివర్సిటీ ఆఫ్‌ హూస్టన్‌ను ఎంచుకోవడానికి కారణం.. ఇక్కడి స్టెమ్‌(సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్‌) కోర్సులు. అలాగే మేము విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను కల్పిస్తున్నాం. 
లుడ్మి హెరాత్‌ డైరెక్టర్, ఇంటర్నేషనల్‌ ప్రోగ్రామ్స్, సీనియర్‌ ఇంటర్నేషనల్‌ ఆఫీసర్‌(ఎస్‌ఐఓ),యూనివర్సిటీ ఆఫ్‌ హుస్టన్‌. 

మరిన్ని వార్తలు