జంతువుల నుంచే కరోనా!

30 Mar, 2021 04:52 IST|Sakshi

వూహాన్‌లోని ల్యాబ్‌ నుంచి కరోనా వైరస్‌ లీకేజీ అసాధ్యం

కోవిడ్‌ మూలాలపై డబ్ల్యూహెచ్‌వో–చైనా బృందం ముసాయిదా నివేదిక స్పష్టీకరణ

బీజింగ్‌: కరోనా వైరస్‌ చైనాలోని ఓ ల్యాబొరేటరీ నుంచి బయటకు వచ్చిందన్న వాదనలను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో), చైనా పరిశోధకుల ఉమ్మడి బృందం కొట్టిపారేసింది. ల్యాబ్‌ నుంచి లీకేజీకి అవకాశం లేదంది. ఈ వైరస్‌ గబ్బిలాల నుంచి మనుషులకు మరో జంతువు ద్వారా సోకి ఉండేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని తెలిపింది. కోవిడ్‌ తొలిసారిగా బయటపడిన చైనా నగరం వూహాన్‌ను జనవరి–ఫిబ్రవరి నెలల్లో ఈ పరిశోధకుల బృందం సందర్శించి తయారుచేసిన ముసాయిదా నివేదిక మంగళవారం విడుదల కానుండగా ఆ ప్రతి ముందుగానే తమకు లభ్యమైందని అసోసియేటెడ్‌ ప్రెస్‌ తెలిపింది.

వైరస్‌ మొట్టమొదటగా ఎక్కడి నుంచి వచ్చిందనే కీలక విషయంతోపాటు పలు ప్రశ్నలకు నిపుణుల బృందం సమాధానాలను చూపలేకపోయింది. మున్ముందు సంభవించే ఇలాంటి మహమ్మారులను నివారించేందుకు ఈ నివేదికలోని వివరాలు ఉపయోగపడతాయని పరిశోధకులు భావిస్తున్నారు. వైరస్‌ మొదటగా ఎలా వ్యాపించిందన్న విషయంలో డబ్ల్యూహెచ్‌వో– చైనా నిపుణులు తయారు చేసిన ఈ ముసాయిదా నాలుగు అంశాలను ప్రస్తావించింది. అందులో మొదటిది.. గబ్బిలాల నుంచి ఇతర జంతువుల ద్వారా మనుషులకు సోకింది. ఇలా జరగటానికి చాలా అవకాశాలున్నాయి.

ఒక వేళ గబ్బిలాల నుంచి నేరుగా మనుషులకు సోకిన పక్షంలో ‘కోల్డ్‌–చైన్‌’ఆహారోత్పత్తుల ద్వారా వ్యాపించడం సాధ్యం. కానీ ఇలా జరిగేందుకు అవకాశాలు లేవు. గబ్బిలాలను ఆశ్రయించి ఉండే కరోనా వైరస్‌లు, కోవిడ్‌కు కారణమైన సార్స్‌–కోవ్‌–2కు దగ్గరి సంబంధం ఉంది. అయితే, వీటి మధ్య అంతరం ఉంది. పంగోలిన్‌లలో ఉండే వైరస్‌కు, కరోనా వైరస్‌తో అత్యంత దగ్గర సంబంధం ఉంది. మింక్‌లు, పిల్లుల్లో వైరస్‌లు కోవిడ్‌ వైరస్‌ రకానికి అత్యంత సమీపంగా ఉంటాయి. ఇవి కూడా ఈ వైరస్‌ వాహకాలే’అని పేర్కొంది. చైనాలోని హువానన్‌ మార్కెట్‌లో మొదటిసారిగా వైరస్‌ కేసులు బయటపడటంపై ఈ నివేదిక ప్రస్తావిస్తూ..ఇతర ప్రాంతాల్లో మొదలై అక్కడికి వ్యాపించి ఉంటుందని వివరించింది.

ఈ మార్కెట్‌లో భారీ సంఖ్యలో ఎలుకలు, దుప్పులు, మొసళ్లు వంటి రకరకాల జీవుల విక్రయాలు జరిగిన విషయం ప్రస్తావిస్తూ...వీటి ద్వారానే వూహాన్‌కు కొత్త వైరస్‌ వచ్చి ఉంటుందని అంచనా వేసింది. డిసెంబర్‌ 2019లో వూహాన్‌లోని సముద్ర ఉత్పత్తుల మార్కెట్‌ నుంచే మొదటిసారిగా కోవిడ్‌ మొదలయిందా అనే విషయమై ఈ నివేదిక ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. చైనా నగరం వూహాన్‌లోని ఓ ప్రయోగశాల నుంచి బయటకు వచ్చిన కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి ప్రబలేందుకు కారణమైందంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ తదితరులు∙విమర్శలు చేసిన విషయం తెలిసిందే. హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్‌ వర్సిటీల పరిశోధకులు వూహాన్‌ ల్యాబ్‌ నుంచి వైరస్‌ లీకేజీకి అవకాశాలున్నాయన్న వాదనలను బలపరిచారు. ఈ నివేదిక విడుదల పలుమార్లు వాయిదా పడటంతో చైనా అందులో తన అభిప్రాయాలను రుద్దే ప్రయత్నం చేసిందన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ‘ఈ నివేదిక తయారీపై మాకు తీవ్ర అభ్యంతరాలున్నాయి. ఈ నివేదిక రూపకల్పనలో చైనా ప్రభుత్వ ప్రమేయం ఉంది’అని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం గమనార్హం.

డబ్ల్యూహెచ్‌వో బృందానికి బంధనాలు?
వైరస్‌ మూలాలను కనుగొనేందుకు వచ్చిన డబ్ల్యూహెచ్‌వో బృందానికి చైనా ప్రభుత్వం పలు పరిమితులు విధించింది. విచారణకు కీలకమైన పత్రాలేవీ వారికి అందుబాటులో లేకుండా చేసిందని ఆరోపణలున్నాయి. వూహాన్‌లోని వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో పలువురు చైనా శాస్త్రవేత్తలను ఈ బృందం కలుసుకుంది. ఇక్కడ నాలుగు గంటలపాటు గడిపింది. వైరస్‌ వ్యాప్తికి కేంద్ర స్థానంగా భావించే వూహాన్‌ మార్కెట్‌లో నాలుగు గంటలపాటు గడిపింది. కానీ, చాలా రోజులపాటు ఏ పనీ లేకుండా తమకు కేటాయించిన హోటల్‌లోనే కాలక్షేపం చేసినట్లు బృందం సభ్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు