2080లో కరోనావైరస్‌ కంటే మరో తీవ్రమైన వైరస్‌ ! 

25 Aug, 2021 01:50 IST|Sakshi

60 ఏళ్లకే మరో  ఘోరకలి ! 

కరోనా లాంటి మహమ్మారి మళ్లీ వచ్చే అవకాశం 

అమెరికా, ఇటలీ శాస్త్రవేత్తల హెచ్చరిక 

400 ఏళ్లలో చికిత్స లేని వ్యాధుల గణాంకాలతో సరికొత్తగా అధ్యయనం

కరోనా లాంటి మరో మహమ్మారి రాబోతోందా? మళ్లీ ఎన్నేళ్లకి ప్రపంచ దేశాలపై ఇలాంటి వైరస్‌ కొమ్ములు విసురుతుంది ? పేరు చెబితేనే వెన్నులో వణుకు పుట్టించే కోవిడ్‌–19లాంటి వ్యాధులు వందేళ్లకి ఒకసారి వస్తాయని ఇన్నాళ్లూ భావించాం. కానీ ఆ అంచనాలన్నీ తప్పయ్యే అవకాశాలే ఎక్కువని తాజా అధ్యయనం చెబుతోంది. మరో  60 ఏళ్లలోనే ఇలాంటి మహమ్మారి ప్రజల్ని కాటేసే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇటలీలోని పడువా యూనివర్సిటీ, అమెరికాలోని డ్యూక్‌ యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తల బృందం చేసిన అధ్యయనంలో అత్యంత అరుదుగా సంభవించే ఇలాంటి వైరస్‌లు ఇప్పటివరకు అందరూ భావిస్తున్నట్టుగా వందేళ్లకు ఒక్కసారి కాదని , వచ్చే 60 ఏళ్లలో.. అంటే 2080లో మరో ముప్పు రాబోతోందని హెచ్చరించారు.  ఈ అధ్యయనం వివరాలను ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ది నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ అనే జర్నల్‌లో ప్రచురించారు.

అధ్యయనం ఎలా చేశారు ?: ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ఇటలీ  శాస్త్రవేత్త డాక్టర్‌ మార్కో మరాని, ఆయన బృందం ఈ అధ్యయనాన్ని కొత్త గణాంకాల పద్ధతిలో నిర్వహించారు.  400 ఏళ్లలో చికిత్స లేని మహమ్మారులకు సంబంధించిన గణాంకాలను సేకరించి, వాటి ఆధారంగా భవిష్యత్‌లో వచ్చే ముప్పుపై అధ్యయనం చేశారు. ప్లేగు, స్మాల్‌పాక్స్, కలరా, టైఫస్, స్పానిష్‌ ఫ్లూ, ఇన్‌ఫ్లూయెంజా వంటి వ్యాధులు ఎప్పుడు వచ్చాయి ? ఎన్నేళ్లు మానవజాతిని పీడించాయి ? ఎంత తరచుగా ఇలాంటి మహమ్మారులు వచ్చే అవకాశం ఉంది ? వంటి వివరాలన్నీ సేకరించి దాని ఆధారంగా భవిష్యత్‌లో ఎదురయ్యే ముప్పుపై అంచనాలు వేసినట్టుగా మార్కో మరాని వెల్లడించారు.  

సర్వసన్నద్ధంగా ఉండాలి ! 
భవిష్యత్‌లో పుట్టుకొచ్చే వైరస్‌లను ఎదుర్కోవడానికి అన్ని దేశాలు సర్వసన్నద్ధంగా ఉండాలని అధ్యయనం రచయిత డాక్టర్‌ మార్కో మరాని అన్నారు.  ప్రకృతి విపత్తులు సంభవించిన సందర్భాల్లో.. వందేళ్లలో ఇలాంటి వరదలు చూశామని ఎవరైనా వ్యాఖ్యానిస్తే  మళ్లీ అంతటి ఉధృతిలో వరద రావడానికి మరో 100 సంవత్సరాలు వేచి చూడాలని అర్థం కాదని ఇక అధ్యయనం సహ రచయిత అయిన డ్యూక్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్త గార్బియల్‌ కాటుల్‌ అభిప్రాయపడ్డారు. వందేళ్ల లోపులో ఎప్పుడైనా అంటే వచ్చే సంవత్సరమైనా అలాంటి వరద ముంచెత్తుతుందని అన్వయించుకోవాలన్నారు.   తరచూ ఎందుకు వైరస్‌లు పంజా విసురుతున్నాయో తెలుసుకోవడానికే ఈ గణాంకాలను సేకరించి అధ్యయనం చేశామని ఆయన వివరించారు.

అధ్యయనం ఏం చెప్పిందంటే.. 

  • ప్రపంచ దేశాలపై కోవిడ్‌–19 ఎలాంటి ప్రభావం చూపించిందో అలాంటి మహమ్మారి మళ్లీ ఏ సంవత్సరంలోనైనా రావడానికి 2% అవకాశం ఉంది 
  • అంటే 2000 సంవత్సరంలో పుట్టిన వాళ్లలో కొందరు కరోనా తరహా వైరస్‌ కల్లోలాన్ని తమ జీవిత కాలంలో మరోసారి చూసే అవకాశం 38 శాతంగా ఉంది. మరికొందరికి 60 ఏళ్లు వచ్చేసరికి ఇలాంటి మహమ్మారిని ఎదుర్కోవాల్సి వస్తుంది. 
  • 50 ఏళ్లలో రకరకాల కొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. వచ్చే మరికొన్ని దశాబ్దాల్లో కరోనా వంటి వైరస్‌లు బయల్పడే అవకాశం మూడింతలు ఎక్కువగా ఉంటుంది. దీని ప్రకారం చూస్తే కరోనా లాంటి వైరస్‌ మరో 59 ఏళ్లకే వచ్చే ఛాన్స్‌ ఉంది. 
  • 1918–1920 మధ్య 3 కోట్ల మందిని బలితీసుకున్న స్పానిష్‌ ఫ్లూను మించిన ప్రాణాంతక వ్యాధి మరొకటి లేదు. మళ్లీ అలాంటి వ్యాధి సంభవించే ముప్పు ఏడాదికి 0.3 నుంచి 1.9% వరకు పెరుగుతూ ఉంటుంది. అంటే మళ్లీ 400 ఏళ్ల లోపు ఆ తరహా వ్యాధి బట్టబయలయ్యే అవకాశం ఉంటుంది.  
  • మరో 12 వేల ఏళ్లలో మానవ జాతి యావత్తును నాశనం చేసే వ్యాధి ప్రబలే అవకాశం ఉంది. 
  • ఇలాంటి వ్యా«ధుల ముప్పు అధికం కావడానికి జనాభా పెరుగుదల, ఆహార విధానంలో మార్పులు, పర్యావరణం ధ్వంసం, వ్యాధి కారక జంతువులతో మనుషులు కలిసిమెలిసి తిరగడం వంటి కారణాలెన్నో ఉన్నాయి.   

మరిన్ని వార్తలు