100 కోట్ల టీకాలు ఇచ్చాం: చైనా 

21 Jun, 2021 00:49 IST|Sakshi

బీజింగ్‌: తమ దేశంలో 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ చేసినట్లు చైనా ఆదివారం ప్రకటించింది. మార్చి ఆఖర్లో ప్రారంభించిన వ్యాక్సినేషన్‌ శనివారానికి 100 కోట్లకు చేరుకుందని జాతీయ ఆరోగ్య కమిషన్‌ (ఎన్‌హెచ్‌సీ) తెలిపింది. అయితే ఎంత మందికి వ్యాక్సినేషన్‌ చేశారన్న విషయాన్ని మాత్రం చైనా వెల్లడించలేదు. చైనాలో గతేడాది నుంచి దాదాపు 21 వ్యాక్సిన్లు క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొన్నాయి. నాలుగింటికి అనుమతులు లభించాయి. అందులో సినోఫార్మ్, సినోవ్యాక్‌ అనే రెండు వ్యాక్సిన్లకు మాత్రమే అంతర్జాతీయ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతులు జారీ చేసింది. ఆ రెండు వ్యాక్సిన్లను చైనా పలు దేశాలకు పంపింది.

ప్రస్తుతం 18 ఏళ్లు నిండిన వారికి చైనాలో వ్యాక్సినేషన్‌ జరుగుతోంది. 3 నుంచి 17 ఏళ్ల వారికి కూడా వ్యాక్సినేషన్‌ చేసేందుకు చైనా సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి కొన్ని వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులు కూడా జారీ చేసింది. వీరికి వ్యాక్సినేషన్‌ చేసేందుకు పాలసీలను కూడా తయారు చేసే పనిలో చైనా ఉందని జిన్హువా న్యూస్‌ ఏజన్సీ తెలిపింది. ఈ ఏడాది చివరికల్లా కనీసం 70 శాతం జనాభాకు వ్యాక్సినేషన్‌ చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుందని ఎన్‌హెచ్‌సీ డిప్యూటీ హెడ్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు