వైరల్‌: హాలీవుడ్‌ యాక్షన్‌ సీన్లను తలదన్నే ‘ఆపరేషన్’

8 Apr, 2021 16:19 IST|Sakshi
షిప్‌ మీద ఉన్న సిబ్బందిని ఎయిర్‌లిఫ్ట్‌ చేసి కాపాడిన రెస్క్యూ టీం (ఫోటో కర్టెసీ: ఎన్‌డీటీవీ)

ప్రాణాలకు తెగించి మరి షిప్‌లో ఉన్న వారిని కాపాడిన సహాయక సిబ్బంది

ఆమ్‌స్టర్‌డామ్‌: చాలా సినిమాల్లో చూసే ఉంటాం.. కింద కారులో, సముద్రంలో ప్రయాణిస్తున్న వారు ప్రమాదంలో ఉంటే.. మన హీరో గారు హెలికాప్టర్‌లో వచ్చి.. తాడు నిచ్చెన సాయంతో కిందకు దిగి ప్రమాదంలో ఉన్న వారిని కాపాడతాడు. సినిమాల్లో అంటే ఏం చూపించినా చెల్లుతుంది. పైగా ఇలాంటి రిస్కీ షాట్లలో పని చేసేది.. హీరోలు కాదు.. డూపులే అన్న సంగతి అందరికి తెలిసిందే. కానీ సైన్యంలో రెస్క్యూ టీంలలో ఇలాంటి రియల్‌ హీరోలు ఉంటారు. వారు ప్రాణాలకు తెగించి మరి ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడతారు. తమకు ప్రమాదం అని తెలిసినా.. వారి జీవితాలను పణంగా పెట్టి.. మరి ఇతరులను ఆదుకుంటారు.

తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. సముద్రంలో వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పుల వల్ల కార్గో షిప్‌ భారీ ఆటుపోట్లకు గురవుతుంది. ఈ లోపే సహాయక సిబ్బంది అత్యంత చాకచక్యంగా షిప్‌లో ఉన్న 12 మందిని సురక్షితంగా కాపాడారు. ఆ వివరాలు.. జర్మనీలోని బ్రెమెర్‌హావెన్ నుంచి నార్వేలోని కొల్వరైడ్ వరకు పలు చిన్న నౌకలను తీసుకువెళుతున్న డచ్‌ కార్గో షిప్‌ "ఈమ్స్లిఫ్ట్ హెండ్రికా" సోమవారం సముద్రంలో ప్రయాణిస్తుండగా.. వాతావరణం అనుకూలించకపోవడంతో ఆటుపోట్లకు గురవుతుంది. ప్రమాదం గురించి షిప్‌లో ఉన్న సిబ్బంది ముందే తమ యాజమాన్యానికి సమాచారం అందించడంతో వారు సహాయక సిబ్బందిని పంపిస్తారు. ఇక హెలికాప్టర్‌ ద్వారా రంగంలోకి దిగిన సిబ్బంది షిప్‌లో ఉన్న 12మందిని రెండు విడతల్లో కాపాడారు. 

ఆపరేషన్‌లో భాగంగా సహాయక సిబ్బంది తొలుత షిప్‌ డెక్‌ మీద ఉన్న వారిలో 8 మందిని గాల్లోకి లేపి హెలికాప్టర్‌లోకి చేరవేశారు. ఈలోపు షిప్‌ ప్రమాద తీవ్రత పెరగడంతో మిగిలిన నలుగురిని సముద్రంలోకి దూకమని చెప్పి.. ఆ తర్వాత వారిని కూడా రక్షించారు. ఇక ఈ రెస్క్యూ ఆపరేషన్‌ సాగిన తీరు చూస్తే.. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. డెక్‌ మీద ఉన్న వారిని కాపాడటం కోసం తొలత హెలికాప్టర్‌లో ఉన్న సహాయక సిబ్బంది ఒకరు ఇనుప తాడు సాయంతో షిప్‌ డెక్‌ మీదకు దిగుతాడు. ఆ తర్వాత అతడు ఒక్కొక్కరిని అదే తాడు ద్వారా హెలికాప్టర్‌లోకి పంపిస్తాడు. ఇలా 8 మందిని కాపాడిన తర్వాత షిప్‌ ఆటుపోట్లకు గురవుతూ ప్రమాదకర రీతిలో కదులుతుంది. దాంతో డెక్‌ మీద మిగిలిన నలుగురిని సముద్రంలోకి దూకమని చెప్పి.. ఆ తర్వాత వారిని కాపాడారు. ప్రస్తుతం ఈ రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. 

చదవండి: సూయెజ్‌ దిగ్బంధనం నేర్పుతున్న పాఠాలు

మరిన్ని వార్తలు