చైనా అధ్యక్షుడిపై విమర్శలు, పార్టీ నుంచి గెంటివేత

24 Jul, 2020 16:49 IST|Sakshi

బీజింగ్‌: అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌పై విమర్శలు చేసిన ఓ వ్యాపారవేత్తను చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) బహిష్కరించింది. అధ్యక్షుడిని విమర్శించడం ద్వారా రెన్‌ ఝిగియాంగ్‌ పార్టీ క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించారని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకుంది. ఝిగియాంగ్‌పై అవినీతి, నిధుల మళ్లింపు ఆరోపణలు కూడా ఉన్నాయని సీపీసీ వెల్లడించింది. పార్టీ ప్రతిష్ఠ దృష్ట్యా కూడా బహిష్కరణ చర్యలు తీసుకున్నామని ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా, 69 ఏళ్ల ఝిగియాంగ్‌ చైనాలో మంచి పలుకుబడి కలిగిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార వేత్త. సీపీపీలో సీనియర్‌ నేత. సోషల్‌ మీడియాలో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పాలనపై ఆయన తరచూ విమర్శలు చేస్తుంటారు. 
(చదవండి: మీ జోక్యం అక్కర్లేదు: చైనా)

ఈక్రమంలోనే కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ ఆయన మార్చి నెలలో ఘాటు విమర్శలు చేశారు. దీంతో కొన్ని రోజులపాటు ఆయనను జైల్లో పెట్టారు. ఇక 2016లో సైతం ఆయన ప్రభుత్వ పనితీరు, సీపీసీపై విమర్శలు గుప్పించారు. అధ్యక్షడికి చైనా కమ్యూనిస్టు పార్టీ ఊడిగం చేస్తోందంటూ విమర్శలు చేయడంతో చైనా సోషల్‌ మీడియాలో ఆయనపై కొన్ని రోజులపాటు నిషేధం కూడా విధించారు. ప్రభుత్వం, జిన్‌పింగ్‌పై నిర్భయంగా విమర్శలు చేయడంతో ఆయనను చైనాలో నెటిజన్లు ‘కేనాన్‌’గా పిలుస్తారు‌. ఇక ఝిగియాంగ్‌పై పార్టీ బహిష్కరణ జిన్‌పింగ్‌పై విమర్శలు చేసేవారికి సీపీసీ ఒక హెచ్చరిక
ఇచ్చినట్టయింది.
(ఇలాగైతే చైనాతో కటీఫ్‌!)

మరిన్ని వార్తలు