వైరల్‌: ఈమె మనిషా.. దెయ్యామా?!

20 Apr, 2021 18:31 IST|Sakshi

ఇంటర్నెట్‌ని హడలెత్తిస్తోన్న ఫోటో

జాగ్రెబ్‌(క్రొయేషియా): దెయ్యాలు, భూతాలు అంటే నమ్మకం లేని వారు ఎందరు ఉన్నారో.. వాటి ఉనికిని విశ్వసించే వారు కూడా అంతకంటే ఎక్కువ మందే ఉంటారు లోకంలో. దెయ్యాలకు సంబంధించిన వార్తలు, వీడియోలకు చాలా క్రేజ్‌. చాలా మంది భయపడుతూ మరి వాటిని చూస్తారు. ఇక నెట్టింట్లో దెయ్యాల ఉనికికి సంబంధించిన వీడియోలు కోకొల్లలు. వీటిలో చాలా మటుకు ట్రిక్స్‌ ఉపయోగించి క్రియేట్‌ చేసిన వీడియోలే. ఇప్పుడు ఈ టాపిక్‌ ఎందుకంటే తాజాగా ఓ మహిళ ఫోటో ఇంటర్నెట్‌ని హడలెత్తిస్తుంది. చాలా మంది ఇమె మనిషి కాదు దెయ్యం అంటుండగా.. కొందరు మాత్రం.. కెమరా ట్రిక్‌ అని కొట్టి పారేస్తున్నారు. 

ఇంతకు ఈ ఫోటో కథ ఏంటో తెలియాలంటే ఇది చదవాల్సిందే.. క్రొయేషియాకు చెందిన ఇవాన్ రుబిల్ టూర్ గైడ్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం జాగ్రేబ్ బస్టాప్ వద్ద నిలుచున్న ప్రయాణికులను తన ఫోన్ కెమేరాతో ఫొటో తీశాడు. ఆ ఫొటో చూసేందుకు చాలా సాధారణంగానే ఉంది. దీనిలో ఇద్దరు నన్‌లు, బ్రౌన్‌ కలర్‌ కోటు ధరించిన ఓ మహిళ ఉన్నారు. ఇక ఈ ఫోటోని పరిశీలనగా  చూస్తే.. అందులో బ్రౌన్ కోటు వేసుకున్న మహిళ కాళ్లను చూడగానే ఒక్కసారిగా వెన్నులో వణకు పుడుతుంది. 

ఎందుకంటే.. ఈ ఫోటోలో ఆమె కాళ్లు పారదర్శకంగా ఉన్నాయి. బస్టాప్‌లో ఉన్న తెల్ల గీత సైతం ఆమె కాళ్ల నుంచి వెళ్లినట్లు కనిపిస్తోంది. దాంతో ఇవాన్ ఆ ఫొటోను రెండు మూడుసార్లు పరిశీలనగా చూశాడు. ఈ ఫొటోను అతడి స్నేహితులకు షేర్ చేశాడట. వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు మాత్రం ‘‘అది నీ కెమేరా ట్రిక్ కాబోలు’’ అని కొట్టిపడేశారట. అనంతరం ఆ ఫొటోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్టు చేశాడు ఇవాన్‌. ఇక ఈ ఫోటో చూసిన వాళ్లు రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు. కొందరు ‘‘నీ ఫొటోలో దెయ్యం ఉంది’’ అంటే.. చాలామంది మాత్రం ‘‘నీ కెమేరాలో ఏదో సమస్య ఉంది చెక్ చేసుకో’’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు

ఈ సందర్భంగా ఇవాన్ మాట్లాడుతూ.. ‘‘నా ఫోన్ కెమేరాలో ఏదైనా సమస్య ఉందేమోనని భావించి మిగతా ఫొటోలను కూడా చెక్ చేశాను. కానీ, ఆ ఫొటో మాత్రమే అలా వచ్చింది. బహుశా వారు చెప్పేది కూడా నిజమే కావచ్చు. నా కెమేరాలో సమస్య వల్లే ఆ ఫొటో అలా వచ్చిందేమో’’ అని తెలిపాడు. ఏది ఏమైనా ఈ ఫోటో మరోసారి దెయ్యాల ప్రస్తావను తెరమీదకు తెచ్చింది. చిత్రం ఏమిటంటే ఇవాన్‌కు హాంటెడ్‌ సిటీలంటే ఇష్టమట. అతడు చాలాసార్లు ఆయా ప్రాంతాలను సందర్శించాడు. కానీ, ఎక్కడా అతడికి దెయ్యం జాడ కనిపించలేదట. అందుకే ఆ ఫొటోను చూడగానే అతడు అంత ఆశ్చర్యపోయాడు. ఇక సదరు మహిళ కాళ్లు అంత పారదర్శకంగా కనిపించడానికి కారణం ఏమిటో ఎవరు చెప్పలేకపోతున్నారు. 

చదవండి: ప్రాంక్ కాదు, అక్క‌డ నిజంగానే దెయ్యం!

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు