ప్రభుత్వానికి ఖర్చులు తగ్గిస్తున్న కాకులు.. ఎలాగో తెలుసా?

3 Feb, 2022 13:13 IST|Sakshi

నీళ్లు తాగడానికి ఓ కుండ దగ్గరకు వెళ్లిన కాకికి అందులోని నీళ్లు అందకపోతే రాళ్లు తీసుకొచ్చి కుండలో వేసి నీళ్లు పైకి రాగానే తాగేసిన కథను విని ఉంటారు. మరి అదే కాకికి ఆకలేస్తే..! ఏముంది రోడ్డుపై పడేసిన చెత్తను తీసుకొచ్చి ఓ డబ్బాలో వేస్తే చాలు. అలా చెత్త వేయగానే ఇలా తిండి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు స్వీడన్‌లో కాకులు ఇదే పని మీదున్నాయి. చెత్తను డబ్బాల్లో వేస్తూ తిండి సంపాదిస్తున్నాయి. పక్క కాకులకు కూడా ఈ ట్రిక్‌ను నేర్పిస్తున్నాయి. అసలు కాకులు అలా ఎందుకు చేస్తున్నాయి, చెత్తను డబ్బాలో వేస్తే తిండి వస్తుందని వాటికెలా తెలిసింది, దాని వల్ల ప్రజలకు, సిటీకేంటి లాభం, తెలుసుకుందామా?

చెత్త సమస్యకు చెక్‌ పెట్టేందుకు..
స్వీడన్‌ ప్రజలు వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్తను పడేస్తున్నారు. సిగరెట్‌ తాగి పీకలను రోడ్డుపై విసిరేస్తున్నారు. ఆ దేశ వీధుల్లో పడే చెత్తలో దాదాపు 62 శాతం సిగరెట్‌ పీకలే ఉంటున్నాయని స్వీడన్‌ టైడీ ఫౌండేషన్‌ చెబుతోంది. అక్కడి వీధుల్లో ఏటా దాదాపు 100 కోట్ల వరకు సిగరెట్‌ పీకలను పడేస్తున్నారంటోంది. ఇవే సిగరెట్‌ పీకలు, చెత్త సమస్యతో స్వీడన్‌ లోని సోడెర్టాల్జె మున్సిపా లిటీ కూడా ఇబ్బంది పడుతోంది. రహదారులను పరిశుభ్రం చేసేందుకు ఏటా దాదాపు రూ. 16 కోట్లను ఆ మున్సిపాలిటీ ఖర్చు చేస్తోంది. దీంతో ఆ నగరంలోని స్టార్టప్‌ సంస్థ ‘కోర్విడ్‌ క్లీనింగ్‌’ తెలివిగా కాకులను రంగంలోకి దింపింది. చెత్తను, సిగరెట్‌ పీకలను తీసుకెళ్లి ఓ డబ్బాలో పడేసేలా శిక్షణ ఇచ్చింది. ఆ వెంటనే ఆ డబ్బా నుంచి తిండి వచ్చేలా ఏర్పాటు చేసింది. ఇందుకు ఆ సంస్థ ఓ డబ్బాను రూపొందించింది.

కాకులనే ఎందుకు? 
కోర్విడ్‌ జాతికి చెందిన న్యూ కెలడోనియా కాకులు చాలా తెలివైనవని ఒక పరిశోధనలో వెల్లడైంది. ఏడేళ్లున్న మనిషి ఎలాగైతే ఆలోచిస్తాడో అచ్చం అలా ఆలోచించే సామర్థ్యం వీటి సొంతమని తేలింది. ఇవి ఏదైనా సరే చాలా త్వరగా నేర్చుకుంటాయి. పక్క వాటికి నేర్పిస్తాయి కూడా. ఈ పక్షులకే ఇప్పుడు చెత్త క్లీనింగ్‌పై శిక్షణనిచ్చారు. సిగరెట్‌ పీకలను, చెత్తను ఆహారం అనుకొని తినే అవకాశమే లేదని తేలింది. వీటి గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్నాకే శిక్షణ ఇచ్చారు.    

ఏమైనా లాభముందా? 
మున్సిపాలిటీ సిబ్బందికి ఒక్కో సిగరెట్‌ పీకను తీయడానికి అయ్యే ఖర్చుల్లో నాలుగో వంతు ఖర్చు చేస్తే చాలు కాకులు ఆ పని చేసి పెడుతున్నాయి. అంటే మొత్తంగా పీకలను తీయడానికి అయ్యే ఖర్చులో దాదాపు 75% తగ్గించేస్తున్నాయి. ఇప్పటి వరకు కాకులకే శిక్షణ ఇచ్చామని, మున్ముందు మరిన్ని రకాల పక్షులకు శిక్షణ ఇస్తామని అధికారు లు చెబుతున్నారు. ఇది కేవలం నగరాన్ని పరిశు భ్రంగా ఉంచడానికి మాత్రమే కాదని.. ప్రజలు కూడా వారి పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేలా చేయాలనేదే తమ ఉద్దేశమని చెప్పారు. 

మనుషులు నేర్చుకునేదెప్పుడో!
ఏదేమైనా చెత్తను తొలగించడానికి పక్షులకు కూడా శిక్షణ ఇస్తున్నాం కానీ.. చెత్త వేయొద్దని మనుషులకు చెప్పలేకపోతున్నామని అక్కడి అధికారులు అంటున్నారు. కాకులు చెత్త తీసుకెళ్లడంపై కొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఇప్పుటికైతే చెత్తను తీసుకెళ్లే పనే పక్షులకు అప్పగించారు. ఇకముందు చెత్త వేస్తే చాలు.. వచ్చి వెనక నుంచి తన్నేలా శిక్షణనిస్తారేమో’ అని ఫన్నీగా అంటున్నారు. 
సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు