'సేమ్ జెండర్‌' మ్యారేజెస్‌కు కమ్యూనిస్టు దేశం పచ్చజెండా.. ఎట్టకేలకు న్యాయం జరిగిందన్న అధ్యక్షుడు

27 Sep, 2022 11:30 IST|Sakshi

హవానా: స్వలింగసంపర్క వివాహాలకు చట్టబద్ధత కల్పించిన దేశాల జాబితాలో మరో దేశం చేరింది. గే మ్యారేజెస్‌కు క్యూబా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటికే మహిళల హక్కులకు పెద్దపీట వేస్తున్న ఈ కమ్యూనిస్టు దేశం 'సేమ్ జెండర్' మ్యారేజెస్‌ను అధికారికం చేసింది.

ఈ చట్టం కోసం ఆదివారం పెద్దఎత్తున ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది ప్రభుత్వం. 84లక్ష మంది పాల్గొన్న ఈ ఓటింగ్‌లో దాదాపు 40 లక్షల మంది(66.9శాతం) దీనికి అనుకూలంగా ఓటు వేశారు. 1.95లక్షల మంది(33శాతం) మాత్రం వ్యతిరేకించారు. దీంతో ప్రజల నుంచి భారీ మద్దతు వచ్చినందున గే మ్యారేజెస్‌కు చట్టబద్ధత కల్పిస్తున్నట్లు క్యూబా ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది.

ఈ విషయంపై క్యూబా అధ్యక్షుడు డయాజ్ క్యానెల్ స్పందిస్తూ.. ఎట్టకేలకు న్యాయం జరిగిందని ట్వీట్ చేశారు. కొన్ని తరాల రుణం తీర్చుకున్నట్లయిందని పేర్కొన్నారు. ఎన్నో క్యూబా కుటుంబాలు ఈ చట్టం కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నాయని చెప్పారు. ఈ చట్టంతో క్యూబాలో స్వలింగ సంపర్కుల పెళ్లికి చట్టబద్దత లభిస్తుంది. వీరు పిల్లల్ని కూడా దత్తత తీసుకోవచ్చు. పురుషులు, మహిళలకు సమాన హక్కులు ఉంటాయి.
చదవండి: యువకుడి అసాధారణ బిజినెస్‌.. సినిమాలో హీరోలా..

మరిన్ని వార్తలు