రోజుకు 6 లక్షలు

27 Nov, 2020 05:51 IST|Sakshi

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా సెకండ్‌ వేవ్‌ 

యూరప్‌లో అయిదు రోజుల్లో 10 లక్షల కేసులు

వాషింగ్టన్, లండన్‌: ప్రపంచ దేశాలను కరోనా సెకండ్‌ వేవ్‌ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. గత వారం పది రోజులుగా  సగటున రోజుకి 5 లక్షల 80 వేల కేసులు నమోదవుతున్నాయి. కేవలం 17 రోజుల్లోనే కరోనా కేసులు 5 కోట్ల నుంచి ఆరు కోట్లకి చేరుకున్నాయి. అంతకు ముందు 4 కోట్ల నుంచి 5 కోట్లకి చేరుకోవడానికి 21 రోజులు పడితే ఈ సారి రికార్డు స్థాయిలో రెండు వారాల్లోనే మరో కోటి కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.                                                
                                           
థాంక్స్‌ గివింగ్‌ ఆందోళన
అగ్రరాజ్యం అమెరికా కరోనా మహమ్మారితో చిగురుటాకులా వణికిపోతోంది. గత వారంలోనే అమెరికాలో ఏకంగా 10లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో థాంక్స్‌ గివింగ్‌ వారం కావడంతో అందరికీ సెలవులు ప్రకటించారు. దీంతో ప్రజలెవరూ అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దంటూ ప్రభుత్వం సూచించింది. థాంక్స్‌ గివింగ్‌ వారంలో ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేస్తారు. మార్కెట్లు కిటకిటలాడిపోతాయి. దీంతో కేసులు పెరిగిపోతాయన్న ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు అమెరికాలో కోటి 30 లక్షల వరకు కేసులు నమోదైతే 2 లక్షల 60 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.  

వణుకుతున్న యూరప్‌  
యూరప్‌లో కేవలం అయిదు రోజుల్లో 10 లక్షల కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య కోటి 60 లక్షలు దాటేసింది. 3 లక్షల 65 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అన్ని దేశాలు కఠినమైన ఆంక్షలు విధించినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా నమోదైన కొత్త కేసుల్లో యూరప్‌ నుంచి 44%, కొత్తగా సంభవించిన మరణాల్లో 49% యూరప్‌ నుంచి వస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇక ప్రపంచంలోనే లాటిన్‌ అమెరికాలో అత్యధికంగా మరణాలు నమోదవుతున్నాయి. ప్రపంచ మరణాల్లో 31శాతం అక్కడే సంభవిస్తున్నాయి.  

పాక్‌లో కిటకిటలాడుతున్న ఆస్పత్రులు
పాకిస్తాన్‌నూ సెకండ్‌ వేవ్‌ వణికిస్తోంది. కోవిడ్‌ రోగులతో ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. అక్టోబర్‌ చివరి వారం నుంచి కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా 3 వేల కేసుల వరకు నమోదవుతున్నాయి. వైద్య సదుపాయాలు సరిగ్గా లేకపోవడంతో రోగులకు చికిత్స నందించడం పాక్‌ ప్రభుత్వానికి భారంగా పరిణమిస్తోంది.  

భారత్‌లో 93 లక్షలకి చేరువలో
మన దేశంలో కరోనా కేసుల సంఖ్య 92.66 లక్షలకి చేరుకుంది.. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 86.79 లక్షలకి చేరుకున్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.  కొత్తగా మరో 44,489 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 92,66,705కి చేరుకోగా, 24 గంటల్లో 524 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 1,35, 223కి చేరుకుంది. అయితే యాక్టివ్‌ కేసుల సంఖ్య వరసగా పదహారో రోజు 5 లక్షల లోపు ఉండడం అత్యంత ఊరటనిచ్చే అంశం.

క్రిస్మస్‌ వేడుకలకి సన్నాహాలు  
వచ్చే నెలలో క్రిస్మస్‌ వేడుకలకి ప్రపంచ దేశాలు సిద్ధమవుతూ ఉండడంతో కేసుల సంఖ్య మరింత తీవ్ర రూపం దాల్చవచ్చునన్న ఆందోళనలు నెలకొన్నాయి. సెలవు దినాల్లో ప్రజలెవరూ బయటకి రాకుండా జర్మనీ, స్పెయిన్, ఇటలీలో కఠినమైన ఆంక్షలు విధిస్తున్నాయి. క్రిస్మస్‌ వేడుకలు మూడేసి ఇళ్లవారు కలిసి చేసుకోవచ్చునని యూకే ప్రభుత్వం సూచించింది. డిసెంబర్‌ 23 నుంచి 28 వరకు  ప్రయాణాలపై ఆంక్షలు ఉండవంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా