అఫ్గన్‌ ఆక్రమణ: అమ్యూజ్‌మెంట్‌ పార్కులో తాలిబన్ల ఎంజాయ్‌

17 Aug, 2021 11:28 IST|Sakshi

సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న వీడియో

కాబూల్‌: అఫ్గనిస్తాన్‌ మళ్లీ తాలిబన్ల హస్తగతం కావడంతో అక్కడి జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా మహిళలు వారి చేతుల్లో అనుభవించబోయే ప్రత్యక్ష నరకాన్ని తలుచుకుని రోదిస్తున్నారు. ఓ వైపు తాలిబన్ల రాక్షసపాలనకు భయపడి అక్కడ ఉండలేక దేశాన్ని విడిచిపోయేందుకు జనాలు ఇబ్బడిముబ్బడిగా విమానాశ్రాయాలు, రోడ్ల మీదకు చేరుకున్న దృశ్యాలు కనిపిస్తుండగా.. మరోవైపు ఇందుకు పూర్తిగా భిన్నమైన దృశ్యాలకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. కాబూల్‌ని ఆక్రమించిన తర్వాత తాలిబన్ల గుంపు తీరిగ్గా అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లో ఎంజాయ్‌ చేస్తోన్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోన్నాయి. 

ఆ వివరాలు.. కాబూల్ నగరాన్ని ఆక్రమించుకున్న అనంతరం తాలిబన్లు ఈ సిటీలోని అమ్యూజ్‌మెంట్‌ పార్కుల్లో చేరి ఎంజాయ్ చేయడం ప్రారంభించారు. భుజాలపై రైఫిళ్లను అలానే పెట్టుకుని ఈ పార్కుల్లోని ఎలెక్ట్రిక్ బంపర్ కార్లలో ఎంజాయ్ చేస్తున్న దృశ్యాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే ఇదే పార్కులో పిల్లలు ఆడుకునే చిన్నపాటి బొమ్మ గుర్రాలపై స్వారీ చేస్తూ ఎంజాయ్‌ చేశారు తాలిబన్లు.

వీరిలో కొందరు ఫైటర్లు దేశంలో చిక్కుబడిన అమెరికన్ల తరలింపులో అమెరికా సైనిక దళాలకు సాయపడ్డారట. భాషా సమస్య వచ్చినప్పుడు కొంతమంది ట్రాన్స్ లేటర్లుగా మారి ఆ సమస్యను తీర్చారట. ఇలా ఉండగా కాబూల్‌లోని పార్లమెంట్ భవనంలో తాలిబన్లు తిష్ట వేసిన దృశ్యాల వీడియోలు, మజారే షరీఫ్‌లో మాజీ అఫ్గన్ సైనికాధికారి హిబాతుల్లా అలీ జాయ్ విలాసవంతమైన నివాసంలో వీరు తిరుగాడుతున్న ఫోటోలు.. వీడియోలు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని వార్తలు