వైరల్‌ ఫొటో షూట్‌: నగ్నంగా 200 మంది! ఎందుకోసం అలా చేశారంటే..

19 Oct, 2021 09:05 IST|Sakshi

Spencer Tunick Dead Sea Naked Photo Shoot Viral: వందల మంది.  ఆడా మగా తేడా లేకుండా అంతా నగ్నంగా మారిపోయారు. ఒంటిపై నూలు పోగు లేకుండా కేవలం వైట్‌ పెయింట్‌తో ఎక్కడి నుంచో వస్తున్న ఆదేశాల్ని పాటిస్తూ.. ముందుకు నడుస్తున్నారు. ఆ ఆదేశాలు ఇస్తున్న వ్యక్తి పేరు స్పెన్సర్‌ ట్యూనిక్‌. అమెరికన్‌ ఫొటోగ్రఫీ ఆర్టిస్ట్‌ అయిన ట్యూనిక్‌ పేరు, ఆ ఫొటోలు గత రెండోరోజులుగా సోషల్‌ మీడియాను  కుదిపేస్తోంది. అయితే అలా వాళ్లతో నగ్న ప్రదర్శన చేయించడానికి ఓ ప్రత్యేకమైన కారణం అంటూ ఉంది కూడా.. 

ఇజ్రాయెల్, జోర్డాన్, వెస్ట్‌బ్యాంక్‌ మధ్యనున్న డెడ్‌సీ(మృత సముద్రం) ఏడాదికి మూడున్నర అడుగుల చొప్పున కుచించుకుపోతోంది. గత రెండు దశాబ్దాల్లో 30 శాతం ఎండిపోయిందని వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌(ఎన్విరాన్‌మెంటల్‌ జస్టిస్‌ అట్లాస్‌) తెలిపింది.  ఇది ఇలాగే కొనసాగితే కొంతకాలానికి డెడ్‌ సీ పూర్తిగా కాలగర్భంలో కలసిపోవడం ఖాయం. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా డెడ్‌సీ సమస్యను ప్రపంచ దృష్టికి తీసుకెళ్లాలనే స్పెన్సర్‌ ట్యూనిక్‌ అలా 200 మందితో నగ్నంగా ఫొటోషూట్‌ చేయించాడు.  

అఫ్‌కోర్స్‌.. ఈ ఫొటోషూట్‌పై ఇజ్రాయెల్‌లో పెద్ద ఎత్తున్న అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి కూడా. కానీ, ఆయనకు వివాదాలు-విమర్శలు కొత్తేం కాదు. 1992 నుంచి కెమెరా పట్టిన ట్యూనిక్‌.. పర్యావరణహితం కోసం ఎంతదాకా అయినా తెగిస్తూ వస్తున్నాడు. నగ్నత్వాన్ని.. దానికి ఓ మంచి పనికోసం ఉపయోగించడాన్ని గౌరవంగా భావిస్తున్నారాయన.  ఈ క్రమంలో ఆయన్ని బహిష్కరించాలనే పిలుపు కూడా చట్టసభ్యుల నుంచి వినిపిస్తోంది. 

డెడ్‌సీ గురించి.. 
భూగోళంపై అత్యంత దిగువన, అంటే సముద్రమట్టానికి దాదాపు 1400 అడుగుల దిగువన ఉంది డెడ్‌సీ.  డెడ్‌సీ అంటే ఓ సరస్సు.  ఈ సరస్సు నీటిలో 34 శాతం ఉప్పు ఉండటం వల్ల ఇందులో మనుషులు మునగరు.. తేలుతారు. మామూలు సముద్రాల్లో ఉండే ఉప్పుకన్నా  9.6 శాతం ఈ నీటిలో ఎక్కువ. ఈ  నీటిని నోట్లో పోసుకుంటే ఉప్పులాగా కాకుండా విషంలా ఉంటుంది.   ఈ సరస్సు చుట్టుపక్కల చెట్లు, జంతువులేవీ బతకవు కనుక దీనికి డెడ్‌సీ అని పేరు వచ్చింది. అయితే ఎన్నో ఔషధగుణాలు ఉండడంతో ఇది ప్రపంచ యాత్రికులను ఎంతగానో ఆకర్షిస్తోంది.

ఇందులో జలకాలాడితే శరీరంలోని జబ్బులన్నీ పోతాయన్నది వారి నమ్మకం. ఒడ్డున బురదను ఒంటికి రాసుకుని మర్దనా చేసుకుంటారు. డెడ్‌సీ చేసే బిజినెస్‌ కూడా భారీగానే ఉంటోంది.  కాస్మోటిక్స్‌లో, ఆయుర్వేద ఔషధాల్లో ఈ జలాలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఎరువుల్లో ఉపయోగించే పొటాష్‌ కూడా ఈ జలాల నుంచి తయారుచేస్తున్నారు.  పేరుకు తగ్గట్లుగా ఇప్పుడు అది చావుకు దగ్గరవుతోంది.

 

సమస్య ఏంటంటే..
ఇజ్రాయెల్, జోర్డాన్, పాలస్తీనా దేశాల మూకుమ్మడి చేష్టల వల్లే డెడ్‌సీకి ఈ పరిస్థితి ఎదురైంది. ముఖ్యంగా ఈ సరస్సు తరిగిపోవడానికి ప్రధాన బాధ్యత జోర్డాన్‌ దేశానిదని చెప్పొచ్చు. డెడ్‌సీ సరస్సుకు నీరు వచ్చి చేరేది ఎక్కువగా జోర్డాన్‌ రివర్‌ నుంచే!. అయితే కొన్నేళ్ల క్రితం ఆ దేశ ప్రజల మంచినీటి అవసరాల కోసం జోర్డాన్‌ నది నుంచి పైప్‌లైన్‌ వేసి నీటిని మళ్లించడం వల్ల ఆ నది నుంచి డెడ్‌సీకి నీరొచ్చే మార్గం నిలిచిపోయింది. దానికితోడు మధ్యప్రాచ్యంలో ఉండే వేడి, పొడి వాతావరణం కూడా నీరు ఎక్కువగా ఆవిరై పోవడానికి కారణం అవుతోంది. దీన్ని పునరుద్ధరించేందుకు ఇజ్రాయెల్, జోర్డాన్‌ దేశాల మధ్య 1994లోనే 90 కోట్ల డాలర్లతో ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు పనులు ఎంతదూరం వచ్చి ఆగిపోయాయో ప్రపంచ దేశాలకు తెలియదు. ఇక పాలస్తీనా-ఇజ్రాయెల్‌ మధ్య జగడం కూడా మృత సముద్రం.. మృత్యువు ఒడిలోకి జారడానికి మరో కారణంగా చెప్పొచ్చు.  

చదవండి: అవాక్కయేలా చేద్దాం అనుకుంటే.. అదిరిపోయే ట్విస్ట్‌!

మరిన్ని వార్తలు