Death By Space Debris: రాబోయే పదేళ్లలో కొత్త ముప్పు.. ప్రాణాలు హరించే..

28 Jul, 2022 02:27 IST|Sakshi

వాషింగ్టన్‌: భూమిపై నుంచి అంతరిక్షానికి రాకెట్‌ ప్రయోగాలు నానాటికీ పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ప్రతి సంవత్సరం ఎన్నో కృత్రిమ ఉపగ్రహాలను పంపిస్తున్నాయి. అంతరిక్షాన్ని శోధించడానికి పరికరాలను పంపడమూ ఎక్కువైంది. ఈ రంగంలోకి ప్రైవేట్‌ సంస్థలు రంగ ప్రవేశం చేశాయి. మరి గగనవీధిలోకి పంపించిన ఉపగ్రహాలు, పరికరాలు ఏమవుతున్నాయి. పని కాలం ముగిసిన తర్వాత అవి అక్కడే పేలిపోయి, వ్యర్థాలుగా మారుతున్నాయి. కొన్ని పుడమి మీదకు ప్రచండ వేగంతో దూసుకొస్తుంటాయి. గ్రహ శకలాలూ భూమిపై పడుతుంటాయి. అంతరిక్ష చెత్తగా పిలిచే ఇలాంటి వ్యర్థాల కారణంగా రానున్న రోజుల్లో మానవాళి మనుగడకు ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

కృత్రిమ ఉపగ్రహాల శకలాలు, సంబంధిత అంతరిక్ష చెత్త భూమిపై పడి మనుషులు ప్రాణాలు పోగొట్టుకున్న దుర్ఘటనలు సంభవించినట్లు ఇప్పటికైతే దాఖలాలు లేవు. కానీ, వేలాది సంవత్సరాల క్రితం గ్రహశకలాలు ఢీకొట్టడం వల్లే రాక్షస బల్లులు అంతరించిపోయాయని చరిత్రకారులు, శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అంతరిక్ష చెత్త వల్ల మనుషుల ప్రాణాలు పోవడం అనేది నమ్మశక్యంగా లేనప్పటికీ మరో పదేళ్లలో ఈ ప్రమాదాలు జరిగి అవకాశాలు ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ మేరకు శాస్త్రవేత్తలు చేసిన తాజా అధ్యయనం ఫలితాలు ‘నేచర్‌ ఆస్ట్రానమీ’ జర్నల్‌ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.

దక్షిణ అక్షాంశంలో ప్రమాదం అధికం  
పనిచేయని ఉపగ్రహాలు సైతం వాటి కక్ష్యలో నిరంతరం తిరుగుతూ ఉంటాయి. వాటిలోని ఇంధనం, బ్యాటరీల్లో పేలుడు ఘటనలతో ముక్కలు చెక్కలవుతాయి. అతి సూక్ష్మ శకలాలుగా విడిపోతాయి. వాటిలో కొన్ని భూమ్యాకర్షణ శక్తిని లోనై మనవైపు దూసుకొస్తాయి. భారీ గ్రహశకలాలు భూమిని ఢీకొడితే ఊహించలేనంత నష్టం వాటిల్లుతుంది. సహజ అంతరిక్ష చెత్తగా వ్యవహరించే గ్రహశకలాలు అరుదుగా గానీ భూమివైపునకు దూసుకురావు. సమస్యంతా కృత్రిమ అంతరిక్ష చెత్తతోనే. అంటే ఉపగ్రహాలు, రాకెట్లు. వీటి ముప్పును అంచనా వేయడానికి అధునాతన గణిత శాస్త్ర విధానాలను ఉపయోగించారు. ఉత్తర ఆకాంశంతో పోలిస్తే దక్షిణ అక్షాంశంలోనే అంతరిక్ష చెత్త ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. న్యూయార్క్, బీజింగ్, మాస్కోలతో పోలిస్తే జకార్తా, ఢాకా, లాగోస్‌లో మూడు రెట్లు ఎక్కువ ప్రాణాపాయమని అధ్యయనంలో తేలింది. రాకెట్లు, ఉపగ్రహాల నుంచి ఊడిపడే శకలం భూమిపై పది చదరపు మీటర్ల మేర పరిధిలో ప్రభావం చూపిస్తుంది. అక్కడ ఒకరు లేదా ఇద్దరు మరణించేందుకు 10 శాతం ఆస్కారం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతరిక్ష చెత్త భూమిపైకి రాకుండా నిరోధించవచ్చని అంటున్నారు. అది చాలా ఖరీదైన వ్యవహారమని అభిప్రాయపడుతున్నారు.   

మరిన్ని వార్తలు