నగ్నంగా బీచ్‌లో.. ఊహించని ఘటనతో పరుగో పరుగు

28 Jun, 2021 14:29 IST|Sakshi

ఒక పక్క కొత్త వేరియెంట్ల విజృంభణ. మరోవైపు లాక్‌డౌన్‌ తరహా ఆంక్షల విధింపు. అనవసరంగా బయట అడుగుపెట్టొద్దనే ఆదేశాలు. అయినా కూడా ఆస్ట్రేలియాలో ఆదేశాల్ని పెడచెవిన పెట్టి  నిబంధనల్ని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో ఓ విచిత్రమైన ఘటనలో ఇద్దరికి మొట్టికాయలు వేశారు అధికారులు. 

సౌత్‌వేల్స్‌: సౌత్‌ సిడ్నికీ చెందిన ఇద్దరు వ్యక్తులు.. సన్‌బాత్‌ కోసమని ఆదివారం మధ్యాహ్నాం దగ్గర్లోని బీచ్‌కు చేరుకున్నారు. నగ్నంగా ఒడ్డున కూర్చుని సూర్య కాంతిని ఆస్వాదిస్తున్నారు. ఆ టైంలో ఎటునుంచి వచ్చిందో తెలియదుగానీ.. ఓ దుప్పి వాళ్ల ముందు ప్రత్యక్షమైంది. అంతే.. దానిని చూడగానే వాళ్ల గుండెలు జారిపోయాయి. అక్కడి నుంచి పరుగులు అందుకున్నారు. వాళ్లను తరుముతూ అది వెనకాలే వెళ్లింది. ఆ కంగారులో పక్కనే ఉన్న రాయల్‌ నేషనల్‌ పార్క్‌లోకి దౌడు తీశారు వాళ్లిద్దరూ. ఇక వాళ్ల ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. 

రాత్రంతా గాలించి ఆ వ్యక్తుల్ని (ఒకరి వయసు 30, మరొకరి వయసు 49) ఆచూకీ కనిపెట్టగలిగారు. ఇద్దరూ ఓ చెట్టు మీద దాక్కుని రక్షించమని కేకలు వేస్తున్నారు.  ‘ఇలాంటి మూర్ఖులను ఎలాంటి చట్టాలతో అడ్డుకోవాలో అర్థం కావట్లేదు’ అని సౌత్‌ వేల్స్‌ పోలీస్‌ కమిషన్‌ మిక్‌ ఫుల్లర్‌ వ్యాఖ్యానించాడు. కరోనా ఉల్లంఘనల నేరం కింద ఇద్దరికీ 760 డాలర్ల ఫైన్‌ విధించారు.  సౌత్‌ వేల్స్‌ స్టేట్‌లో కరోనా నిబంధనల్ని కఠినంగా అమలు చేస్తున్నారు. ఆదివారం ఒక్కరోజే సౌత్‌ వేల్స్‌లో 40మందికి జరిమానాలు విధించారు అధికారులు.

చదవండి:  పాత ఎఫైర్‌.. తన పేషీలోని జాబ్‌.. మంత్రి రాసలీలలు 

మరిన్ని వార్తలు