లద్దాఖ్‌కు చేరుకున్న రాజ్‌నాథ్‌

28 Jun, 2021 05:03 IST|Sakshi
ఆదివారం లేహ్‌లో మాజీ సైనికులతో ముచ్చటిస్తున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌

చైనాతో ప్రతిష్టంభన నేపథ్యంలో రక్షణ మంత్రి పర్యటన

న్యూఢిల్లీ: దేశం పట్ల సైనికులు, మాజీ సైనికుల అంకితభావం అందరికీ ఆదర్శప్రాయమైందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కొనియాడారు.  మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం లద్దాఖ్‌కు చేరుకున్న రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవాణేతో కలిసి మాజీ సైనికులను కలుసుకుని వారి సంక్షేమంతోపాటు దేశభద్రతకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ‘మన సైనికబలగాలు, మాజీ సైనికులు దేశం పట్ల చూపే అంకితభావం అందరికీ ఆదర్శప్రాయం. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.

మాజీ సైనికులు ఏవైనా సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకు వచ్చేందుకు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ నంబర్‌ను అందుబాటులోకి తెస్తాం’ అని మంత్రి రాజ్‌నాథ్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం లేహ్‌లో కార్గిల్, లేహ్, లద్దాఖ్‌ అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ సభ్యులతో అభివృద్ధిపై చర్చించారు.సరిహద్దుల్లోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి చైనా తన బలగాలను ఉపసంహరించు కునేందుకు మొరాయిస్తున్న నేపథ్యంలో సైనిక బలగాల సన్నద్ధతను స్వయంగా ఆయన పరిశీలించనున్నారని అధికారవర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా మంత్రి ఎత్తైన పర్వత ప్రాంతాల్లోని వ్యూహాత్మక సైనిక శిబిరాలను సందర్శించి, వాస్తవ పరిస్థితులను అంచనా వేయడంతోపాటు బలగాల స్థైర్యాన్ని పెంచుతారని చెప్పాయి.

మరిన్ని వార్తలు