డెల్టా వేరియంట్‌ ఎంత డేంజరో తెలుసా?

12 Jun, 2021 11:57 IST|Sakshi

 డెల్టా వేరియంట్‌  యూకే హెల్త్‌ నిపుణుల నివేదిక

వ్యాక్సిన్ల ప్రభావాన్ని సైతం గణనీయంగా తగ్గిస్తుంది

లండన్‌: భారత్‌లో గుర్తించిన కరోనా డెల్టా వేరియంట్‌(బీ1. 617.2) ఇతర వేరియంట్లతో పోలిస్తే 60 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని, వ్యాక్సిన్ల ప్రభావాన్ని సైతం గణనీయంగా తగ్గిస్తుందని యూకే హెల్త్‌ నిపుణుల నివేదిక వెల్లడించింది. యూకేలో ఈ వేరియంట్‌ వేగంగా పెరుగుతోందని, ఇతర వేరియంట్ల కన్నా తొందరగా వ్యాపిస్తోందని తెలిపింది.ఢి ల్లీలో కేసులు ఉధృతికి ఈ వేరియంటే కారణంగా వీరి అధ్యయనం తేల్చింది. ఇమ్యూనిటే ఎలివేషన్‌ లక్షణాలతో ఉన్న ఈ డెల్టా వేరియంట్‌ ఏప్రిల్‌లో 60 శాతం కేసులకు కారణమైందని తెలిపింది. డెల్టా వేరియంట్ అమెరికా,యూకెతో సహా కనీసం 60 దేశాలలో ఉందని కోవిడ్ -19 జెనోమిక్స్ యుకే కన్సార్టియం  ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్,  చైర్ షరోన్ పీకాక్  ది వాల్ స్ట్రీట్ జర్నల్  టెక్ హెల్త్ ఈవెంట్లో  పేర్కొన్నారు.

ఆల్ఫా వేరియంట్, బీ1.117 కంటే 50 శాతం ఇది  ఎక్కువ వ్యాప్తిచెందుతుందని గుర్తించామని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, సీఎస్‌ఐఆర్‌, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్‌ ఇంటిగ్రేటివ్ బయాలజీ నిపుణులు వెల్లడించారు. ఆల్ఫా వేరియంట్‌తో పోలిస్తే డెల్టా వేరియంట్‌ వ్యాక్సిన్‌ ప్రభావాన్ని బాగా తగ్గిస్తున్నదని, ముఖ్యంగా ఒక డోసు తర్వాత ఇది ఎక్కువగా కనిపిస్తోందని నివేదిక పేర్కొంది. రెండు డోసుల తర్వాత డెల్టా వేరియంట్‌పై వ్యాక్సిన్‌ ప్రభావం బాగానే ఉంటోందని, కానీ కాలానుగుణంగా ప్రభావం తగ్గుదల ఆల్ఫా కన్నా ఎక్కువగా ఉందని వివరించింది. ప్రస్తుతం యూకేలో కేసుల పెరుగుదలకు ఈ వేరియంటే కారణమని తెలిపింది. దేశంలో  వ్యాక్సినేషన్‌ వల్ల కరోనా ఉధృతి చాలా వరకు అదుపులో ఉందని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సినేషనే ఉత్తమమార్గమని యూకే హెల్త్‌ ఏజెన్సీ పేర్కొంది. 

చదవండి : టీకా తీసుకున్న 45 నిమిషాలకే మృతి
American Embassy: టీకా తప్పనిసరి కాదు

మరిన్ని వార్తలు