డెల్టాప్లస్‌.. ఆటలమ్మ కంటే వేగం

31 Jul, 2021 03:41 IST|Sakshi

న్యూయార్క్‌: చికెన్‌పాక్స్‌(ఆటలమ్మ) ఎంత వేగంగా వ్యాపించగలదో, కరోనా డెల్టా వేరియంట్‌ అంతే వేగంగా వ్యాపించగలదని, మిగిలిన వేరియంట్ల కన్నా ఎక్కువ అనారోగ్యం కలిగించగలదని యూఎస్‌ సీడీసీ(సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌) హెచ్చరించినట్లు అమెరికా మీడియా వర్గాలు తెలిపాయి. వ్యాక్సిన్‌ తీసుకోనివారిలో వ్యాపించినంత వేగంగానే, టీకా తీసుకున్నవారికి కూడా అంతేవేగంగా డెల్టా సోకవచ్చని సీడీసీ తెలిపింది. టీకా తీసుకోని వారి ముక్కు, గొంతులో ఎంత వైరల్‌ లోడు ఉంటుందో, టీకా తీసుకున్న వారిలో నూ అంతే లోడుంటుందని సీడీసీ డైరెక్టర్‌ రొచెల్‌ వాలెన్‌స్కై చెప్పారు. అలాగే ఆల్ఫా వేరియంట్‌ బాధితుల్లో ఉండే వైరల్‌ లోడు కన్నా 10 రెట్లు అధిక లోడు డెల్టా వేరియంట్‌ సోకినవారిలో గమనించినట్లు సీడీసీ తెలిపింది.

మెర్స్, సార్స్, ఎబోలా, జలుబు, స్మాల్‌పాక్స్, చికెన్‌పాక్స్‌ వైరస్‌ల కన్నా డెల్టా వేరియంట్‌ వేగంగా సోకుతుందని తెలిపింది. అమెరికాలో  టీకా తీసుకున్న వారిలో సైతం డెల్టా సోకినట్లు్ల సీడీసీ పేర్కొంది. వివిధ రాష్ట్రాల  గణాంకాలను విశ్లేషించి సీడీసీ ఈ పత్రాన్ని రూపొందించింది. ప్రతి చోటా ప్రతి ఒక్కరూ మరలా మాస్కులు ధరించడం మంచిదని రొచెల్‌ సూచించారు. ప్రభుత్వం, ప్రజలు తీవ్రమైన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. టీకా తీసుకున్నవారు సైతం డెల్టా వ్యాప్తికి కారకులు కావడం ఆందోళనకరమైన విషయమని మరో సైంటిస్టు వాల్టర్‌ ఓరెన్‌స్టైన్‌ చెప్పారు. అయితే డెల్టా సోకినా సరే టీకా తీసుకున్నవారు సురక్షితంగా ఉన్నట్లేనన్నారు. టీకా వల్ల వ్యాధి తీవ్రత 90 శాతం వరకు తగ్గుతుందని, అందువల్ల వీరు తీవ్ర అనారోగ్యం పాలయ్యేందుకు, లేదా తీవ్ర వ్యాప్తికి కారణమయ్యేందుకు ఛాన్సులు తక్కువన్నారు.

మరిన్ని వార్తలు