దడ పుట్టిస్తున్న ‘డెల్టా’.. 85 దేశాల్లోకి ఎంట్రీ! 

25 Jun, 2021 03:15 IST|Sakshi

మిగతా వేరియంట్ల కన్నా అత్యధిక వ్యాప్తి

డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక

ఐరాస: ప్రపంచ దేశాలకు దడ పుట్టిస్తున్న కరోనా డెల్టా వేరియంట్‌ను 85 దేశాల్లో గుర్తించారని గురువారం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించింది.మరిన్ని దేశాలకు విస్తరించే ప్రమాదముందని హెచ్చరించింది. విస్తృతంగా వ్యాప్తి చెందే ప్రధాన వేరియంట్‌గా మారనుందని ఆందోళన వ్యక్తం చేసింది. వేరియంట్ల వారీగా ఆల్ఫా 170 దేశాల్లో, బీటా 119 దేశాల్లో, గామా 71 దేశాల్లో, డెల్టా 85 దేశాల్లో గుర్తించారని జూన్‌ 22న విడుదల చేసిన, గత వారం రోజుల గణాంకాలతో కూడిన నివేదికలో వెల్లడించింది. ఈ నాలుగు ఆందోళనకారక వేరియంట్ల (వేరియంట్స్‌ ఆఫ్‌ కన్సర్న్‌) మ్యుటేషన్లను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది.

ఆల్ఫా సహా మిగతా వేరియంట్ల కన్నా డెల్టా అతి వేగంగా వ్యాప్తి చెందుతోందంది. జూన్‌ 14 –20 మధ్య భారత్‌లో అత్యధికంగా 4,41,976 కేసులు, 16,329 మరణాలు నమోదయ్యాయని తెలిపింది. అయితే, ఇవి గతవారంతో పోలిస్తే 30% తక్కువని తెలిపింది. డెల్టా వేరియంట్‌ సోకినవారికి ఆక్సిజన్‌ అవసరం, ఐసీయూలో చేరే పరిస్థితి అధికంగా ఉందని, మరణాలు కూడా అధికంగానే ఉన్నాయని సింగపూర్‌లో విడుదలైన ఒక నివేదిక వెల్లడించిందని తెలిపింది. ఆల్ఫా కన్నా డెల్టా వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తోందని జపాన్‌లో విడుదలైన ఒక నివేదిక పేర్కొందని వెల్లడించింది. డెల్టా వేరియంట్‌పై ఫైజర్‌ బయోఎన్‌టెక్‌–కొమిర్నటీ, ఆస్ట్రాజెనెకా–వాక్జ్‌జెవ్రియా టీకాలు ప్రభావవంతంగా పనిచేశాయని ఆ రెండు నివేదికలు వెల్లడించాయని పేర్కొంది.  

మైసూరులో ఒకరికి డెల్టా ప్లస్‌ 
మైసూరు: మైసూరులో ముగ్గురికి డెల్టా వేరియంట్‌ కరోనా వైరస్, ఒకరికి డెల్టా ప్లస్‌ వేరియంట్‌ సోకినట్లు అధికారులు తెలిపారు.  మైసూరులో 19 ఏళ్ల యువకుడిలో రాష్ట్రంలో తొలిసారి డెల్టా వైరస్‌ను గుర్తించారు. అలాగే మరో ఇద్దరిలోనూ డెల్టా వైరస్, ఒకరిలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ను గుర్తించారు. మే 13న బెంగళూరులోని నిమ్హాన్స్‌ ల్యాబ్‌కు ఈ అనుమానిత కరోనా రోగుల శాంపిల్స్‌నుపంపించగా అందులో  ముగ్గురికి బీ1.617.2 (డెల్టా), మరొకరిలో బీ1.617.2.1 (డెల్టా ప్లస్‌) వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొంది, ఈ నలుగురూ కోలుకున్నారని అ«ధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తలు