డెల్టాతో ఆస్పత్రిపాలయ్యే ప్రమాదం అధికం!

29 Aug, 2021 06:32 IST|Sakshi

పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లండ్‌ అధ్యయనం హెచ్చరిక

లండన్‌: ఆల్ఫా వేరియంట్‌ సోకిన వారితో పోలిస్తే డెల్టా వేరియంట్‌ కరోనా సోకినవారు ఆస్పత్రి పాలయ్యే ముప్పు రెండు రెట్లు అధికమని పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లండ్‌(పీహెచ్‌ఈ) అధ్యయనం హెచ్చరించింది. పీహెచ్‌ఈ, కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ సంయుక్తంగా ఈ అధ్యయనం చేపట్టాయి. అధ్యయన వివరాలను లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురించారు. ఆయా వేరియంట్లో ఆస్పత్రి పాలయ్యే ముప్పుపై ఇలాంటి అధ్యయనం జరపడం ఇదే తొలిసారి.  గత మార్చి నుంచి మే వరకు ఇంగ్లాండ్‌లో కరోనా సోకిన 43,338 మందిని అధ్యయనంలో భాగంగా పరిశీలించారు.

వీరిలో  75 శాతం మంది వ్యాక్సిన్‌ తీసుకోనివారే ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఆల్ఫా వేరియంట్‌తో పోలిస్తే డెల్టా సోకిన రోగులు తీవ్ర లక్షణాలతో  ఇబ్బంది పడతారని గతంలో వెల్లడైన అంశాలను తాజా అధ్యయనం మరోమారు నిర్ధారించింది. టీకా తీసుకోని వారిలో డెల్టా వేరియంట్‌ ఎక్కువ ప్రభావం చూపుతోందని పరిశోధకులు తెలిపారు. వ్యాక్సిన్‌ తీసుకోనివారు వ్యాధి బారిన ఎక్కువగా పడుతున్నారని, అన్ని వేరియంట్ల నుంచి టీకా మంచి రక్షణ ఇస్తుందని వివరించారు. టీకా తీసుకోనివారు, పాక్షికంగా టీకా తీసుకున్నవారే ఎక్కువ శాతం ఆసుపత్రిలో చేరుతున్నట్లు పీహెచ్‌ఈకి చెందిన డాక్టర్‌ గవిన్‌ డబ్రెరా తెలిపారు. అందువల్ల నిర్లక్ష్యం చేయకుండా వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకోవాలని ప్రజలను కోరారు.

మరిన్ని వార్తలు