Deltacron Variant : కరోనా కొత్త రూపాంతరం దడ! ... ఇప్పటి వరకు 25 కేసులు నమోదు!

17 Feb, 2022 13:46 IST|Sakshi

Deltacron Cases Found In UK: కరోనా వైరస్‌ కొత్త రూపాంతరం గురించి ప్రపంచ  ఆరోగ్య నిపుణులు ఆందోళనకు గురవుతున్నారు. ఇది డెల్టా, ఒమిక్రాన్‌ వేరియంట్ల లక్షణాలను ప్రదర్శిస్తున్నందున డెల్టాక్రాన్‌గా నిపుణలు వ్యవహరించారు. అంతేకాదు డెల్టాక్రాన్‌గా పిలుస్తున్న ఈ హైబ్రిడ్ వేరియంట్‌ని  యూకేలో తొలిసారిగా గుర్తించారు. అయితే ఈ వేరియంట్‌ ఎంతగా వ్యాప్తి చెందుతుంది, ఎంతవరకు ప్రమాదకరమైనది అనే విషయాలను అధికారికంగా ఇప్పటివరకు యూకే నిపుణులు వెల్లడించలేదు.

అయితే సెకండ్‌వేవ్‌లో డెల్టా వేగంగా వ్యాపించి ఎంతలా ప్రాణాంతకంగా మారిందో తెలిసిందే. మూడోవేవ్‌లో ఒమిక్రాన్‌ అంత ప్రభావంతంగా వ్యాప్తి చెందకపోయినప్పటికి మరింత ప్రమాదకారి మాత్రం కాలేదు. అలాగే మరణాల సంఖ్య, కేసుల సంఖ్య తక్కువే. ఈ మేరకు ఈ డెల్టాక్రాన్ వేరియంట్‌ను గత ఏడాది చివర్లో సైప్రస్‌లో లియోనిడోస్ కోస్ట్రికిస్ అనే పరిశోధకుడు మొదటిసారిగా కనుగొన్నారు.

యూనివర్శిటీ ఆఫ్ సైప్రస్‌లో పనిచేస్తున్న లియోనిడోస్ కోస్ట్రికిస్ తన బృందం ఈ డెల్టాక్రాన్‌కి సంబంధించి సుమారు 25 కేసులను గుర్తించినట్లు పేర్కొన్నారు. అంతేకాదు 25 డెల్టాక్రాన్ కేసుల సీక్వెన్సులు జనవరి 7, 2022న వైరస్‌లో మార్పులను ట్రాక్ చేసే అంతర్జాతీయ డేటాబేస్ అయిన GISAIDకి పంపించారు కూడా. కానీ కొంతమంది నిపుణులు మాత్రం ఇది "ల్యాబ్ ఎర్రర్‌గా" తోసిపుచ్చారు.

ఈ క్రమంలో ఇంపీరియల్ కాలేజ్ లండన్ బార్‌క్లే లాబొరేటరీలో పరిశోధనా సహచరుడు థామస్ పీకాక్ కూడా డెల్టాక్రాన్ అంత ప్రభావవంతమైనది కాదని స్పష్టంగా తెలుస్తుందని అన్నాడు. కానీ కోస్ట్రికిస్ తన వాదనను సమర్థించటమే కాక కరోనా వైరస్‌ కొత్త రూపాంతరం అయిన ఈ హైబ్రిడ్‌ వేరియంట్‌ డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్‌ల కంటే వేగంగా వ్యాపిస్తుందంటూ హెచ్చరిస్తున్నాడు. మరోవైపు ప్రపంచ ఆరోగ్యసంస్థ ఒమిక్రాన్‌ వేరియంట్‌ చాలా దేశాల్లో వేగంగా సంక్రమించే అత్యంత ప్రమాదకర వేరియంట్‌గా ఉందని పేర్కొనడం గమనార్హం.

(చదవండి: కుక్క గర్భవతి అనుకుని ఆసుపత్రికి తీసుకెళ్లాడు... ఆశ్చర్యపోయిన వైద్యులు)

మరిన్ని వార్తలు