-

ట్రంప్‌ అభిశంసన దిశగా..!

14 Jan, 2021 04:25 IST|Sakshi
టెక్సాస్‌లోని అలామోలో మెక్సికో సరిహద్దు గోడ వద్ద ప్రసంగించి వెళ్తున్న అధ్యక్షుడు ట్రంప్‌

ప్రతినిధుల సభలో తీర్మానంపై చర్చ

పలువురు రిపబ్లికన్లు మద్దతిస్తున్నారన్న డెమొక్రాట్లు

వాషింగ్టన్‌: గడువుకు ముందే దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను పదవీచ్యుతుడిని చేసేందుకు అమెరికా సిద్ధమవుతోంది. దేశ ప్రజాస్వామ్య సౌధం క్యాపిటల్‌ భవనంపై దాడికి కారణమయ్యారన్న ఆరోపణలపై అధ్యక్షుడు ట్రంప్‌పై ప్రతినిధుల సభలో బుధవారం  అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. జనవరి 6న క్యాపిటల్‌ భవనంపై దాడికి అనుచరులను రెచ్చగొట్టారన్న ప్రధాన ఆరోపణతో ఈ అభిశంసన తీర్మానాన్ని రూపొందించారు. డెమొక్రాట్లు మెజారిటీగా ఉన్న ప్రతినిధుల సభలో ఈ తీర్మానం ఆమోదం పొందితే.. వెంటనే దీనిని సెనెట్‌కు పంపిస్తారు.

డెమొక్రాట్లతో పాటు పలువురు రిపబ్లికన్‌ సభ్యులు కూడా ఈ అభిశంసనకు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో పదవి నుంచి దిగిపోనున్న ట్రంప్‌ను అభిశంసిస్తూ రూపొందించిన ఈ తీర్మానంపై ప్రతినిధుల సభలో బుధవారం అర్ధరాత్రి(భారత కాలమానం) దాటిన తరువాత కూడా చర్చ కొనసాగింది. అభిశంసన తీర్మానం అమోదం పొందుతుందన్న విశ్వాసాన్ని డెమొక్రాటిక్‌ సభ్యులు వ్యక్తం చేశారు. ‘అధ్యక్షుడిగా ట్రంప్‌ శ్వేత సౌధంలో ఉన్నంతకాలం మన దేశం, మన స్వేచ్ఛ ప్రమాదంలో ఉన్నట్లే.

క్యాపిటల్‌ భవనంపై దాడికి బాధ్యత వహించాల్సింది ట్రంపే. ఆయనే ఈ దాడికి కుట్ర చేశారు.అనుచరులను రెచ్చగొట్టారు. అందువల్ల ట్రంప్‌ను అభిశంసించే ఈ తీర్మానానికి మద్దతు పలకవలసిందిగా సహచర సభ్యులను కోరుతున్నా’ అని ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టిన డెమొక్రాట్‌ సభ్యడు జేమ్స్‌ మెక్‌ గవర్న్‌ సహచర ఎంపీలను కోరారు. క్యాపిటల్‌ భవనంపై దాడికి సంబంధించి ‘తిరుగుబాటు చేసేందుకు రెచ్చగొట్టారు’ అనే ప్రధాన ఆరోపణతో అభిశంసన తీర్మానాన్ని రూపొందించారు.

‘దాడితో ధ్వంసమైన ఈ భవనాన్ని మరమ్మత్తు చేయవచ్చు. కానీ ప్రజాస్వామ్య సౌధంపై జరిగిన ఆ దాడికి ట్రంప్‌ను బాధ్యుడిని చేయనట్లయితే, ఈ దేశానికి జరిగిన నష్టాన్ని పూడ్చలేం’ అని జేమ్స్‌ పేర్కొన్నారు. ‘దేశ ప్రజాస్వామ్య పునాదులను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ‘అమెరికాలో ఇలాంటివి(క్యాపిటల్‌ భవనంపై దాడి) ఎట్టి పరిస్థితుల్లో కుదరవన్న గట్టి సందేశం ఇప్పుడు ఇవ్వనట్లయితే.. ఇవి మళ్లీ మళ్లీ జరిగే ప్రమాదముంది’ అని ఎంపీ చెల్లీ పింగ్రీ హెచ్చరించారు. ట్రంప్‌ పై అభిశంసన నిర్ణయం సరైంది కాదని రిపబ్లికన్‌ సభ్యుడు స్టీవ్‌ చాబొట్‌ అభిప్రాయపడ్డారు. ‘విభజిత దేశాన్ని కలిపే ప్రయత్నం చేయకుండా, మరింత విడదీసే ప్రయత్నం చేస్తున్నార’ని డెమొక్రాట్లపై విమర్శలు గుప్పించారు.

రాజకీయ రచ్చను పక్కనబెట్టి, దేశం ఎదుర్కొంటున్న సమస్యలను కలసికట్టుగా పరిష్కరించాల్సిన సమయం ఇదని సూచించారు. అంతకుముందు, 25వ రాజ్యాంగ సవరణ ద్వారా లభించిన అధికారంతో అధ్యక్షుడిగా ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలని ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ను కోరుతూ ప్రతినిధుల సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 223 ఓట్లు, వ్యతిరేకంగా 205 ఓట్లు వచ్చాయి. రిపబ్లికన్లలో ఒకరు తీర్మానానికి అనుకూలంగా ఓటేయగా, ఐదుగురు ఓటింగ్‌లో పాల్గొనలేదు. అయితే, 25వ రాజ్యాంగ సవరణ అధికారాన్ని వినియోగించుకుని ట్రంప్‌ను పదవి నుంచి దించాలన్న ఆలోచన తనకు లేదని స్పష్టం చేస్తూ ఈ ఓటింగ్‌ కన్నా ముందే ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీకి  మైక్‌ పెన్స్‌ ఒక లేఖ రాశారు.  

అనుకూలంగా ఓటేస్తా
అభిశంసన తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తానని భారతీయ అమెరికన్‌ ఎంపీ డాక్టర్‌ అమీ బెరా స్పష్టం చేశారు. క్యాపిటల్‌ భవనంపై దాడికి కుట్ర పన్నినందుకు గానూ  అమెరికా చరిత్రలో చెత్తకుండీలో చేరే స్థాయికి ట్రంప్‌ చేరారని మండిపడ్డారు. అమెరికా చరిత్రలోనే జనవరి 6 చీకటి రోజన్నారు. దేశ ప్రజాస్వామ్య సౌధంపై ఆ రోజు జరిగిన దాడికి కుట్రదారు, వ్యూహకర్త ట్రంపేనని విరుచుకుపడ్డారు. ఇందుకు ఆయన కొన్నాళ్లుగా ప్రణాళికలు వేశారన్నారు. ట్రంప్‌ దుశ్చర్యలను వివరించేందుకు మాటలు లేవన్నారు.

ట్రంప్‌ని తొలగించలేం: పెన్స్‌
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25వ సవరణ ద్వారా గద్దె దింపేయాలని వస్తున్న డిమాండ్లను ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ తోసిపుచ్చారు. ఆర్టికల్‌ 25 ద్వారా ట్రంప్‌ని పదవీచ్యుతుడ్ని చేయలేమని ప్రతినిధుల స్పీకర్‌ నాన్సీ పెలోసికి లేఖ రాశారు. ‘‘మన రాజ్యాంగం ప్రకారం 25వ రాజ్యాంగ సవరణ అంటే అధ్యక్షుడికి శిక్ష విధించడం కాదు. అది ఎలాంటప్పుడు ఉపయోగించాలంటే భావి తరాలకు మార్గదర్శకంగా ఉండాలి. అధ్యక్షుడు అసమర్థుడైనప్పుడు, పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆర్టికల్‌ని ప్రయోగించాలి’’అని మైక్‌ పెన్స్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. క్యాపిటల్‌ భవనంపై దాడి తర్వాత ట్రంప్‌ని గద్దె దింపేయాలంటూ డిమాండ్లు అధికమయ్యాయి. స్పీకర్‌ నాన్సీ ఈ డిమాండ్‌ను తీవ్రంగా వినిపించడంతో ఉపాధ్యక్షుడు ఆమెకు లేఖలో ఈ వివరణ ఇచ్చారు.

అప్రమత్తతలో భాగంగా క్యాపిటల్‌లో మొహరించిన నేషనల్‌ గార్డ్‌ బలగాలు విశ్రాంతి తీసుకుంటున్న దృశ్యం

మరిన్ని వార్తలు