ఆ పోలీసు అధికారి దోషి

22 Apr, 2021 04:33 IST|Sakshi

నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్య కేసులో అమెరికా కోర్టు తీర్పు

40 ఏళ్లు కారాగార శిక్ష పడే అవకాశం 

ఈ తీర్పు గొప్ప ముందడుగు: బైడెన్‌

ఊపిరి పీల్చుకున్నామన్న కుటుంబ సభ్యులు

వాషింగ్టన్‌: అమెరికా సహా ప్రపంచ దేశాల్లో సంచలనం సృష్టించిన ఆఫ్రికన్‌ అమెరికాన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్య కేసులో మాజీ పోలీసు అధికారి డెరెక్‌ చౌవిన్‌ను దోషిగా తేలుస్తూ స్థానిక కోర్టు తీర్పు చెప్పింది. 12 మంది జ్యూరీ సభ్యులున్న కోర్టు ఈ ఘటనను ఉద్దేశపూర్వకంగా చేయని సెకండ్‌ డిగ్రీ మర్డర్, థర్డ్‌ డిగ్రీ మర్డర్‌ అని మంగళవారం వెలువరించిన తీర్పులో పేర్కొంది. చౌవిన్‌ బెయిల్‌ని రద్దు చేసింది. మూడు వారాల పాటు 45 మంది సాక్షుల్ని విచారించిన కోర్టు సోమవారం 10 గంటలకు పైగా తుది విచారణ జరిపింది. అయితే శిక్షను న్యాయస్థానం వాయిదా వేసింది.

న్యాయమూర్తి పీటర్‌ కాహిల్‌ 8 వారాల్లో శిక్ష ఖరారు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. కాగా అమెరికా చట్టాల ప్రకారం చౌవిన్‌కు 40 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి.  తీర్పు వెలువరించిన సమయంలో డెరెక్‌ చౌవిన్‌కు ముఖానికి సర్జికల్‌ మాస్కు ధరించి ఉండడంతో అతని ముఖంలో భావాలేవీ బయటకు రాలేదు. మరోవైపు ఫ్లాయిడ్‌ మృతితో జాతి వివక్షకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమించిన వారు, ఫ్లాయిడ్‌ మద్దతు దారులు న్యాయస్థానం తీర్పు చెప్పినప్పుడు కోర్టు హాలు బయటే వేచి ఉన్నారు. తీర్పు వెలువడగానే పెద్ద పెట్టున హర్షాతిరేకాలు చేశారు. అతనికి ఉరిశిక్ష వేయాలంటూ నినదించారు.  

ఈ తీర్పు ఓ ముందడుగు: బైడెన్‌
జాతి వివక్షకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో ఈ తీర్పు అతి పెద్ద ముందడుగు అవుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. తీర్పు వచ్చిన తర్వాత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో కలిసి వైట్‌ హౌస్‌నుంచి ఆయన మాట్లాడారు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలకి కాంగ్రెస్‌ సభ్యులందరూ ఇంకా కృషి చేయాలన్నారు. ‘‘ఈ తీర్పు చాలదు. మనం ఇక్కడితో ఆగిపోకూడదు. అయితే న్యాయవ్యవస్థలో ఇదో పెద్ద ముందడుగు’’అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఫ్లాయిడ్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడిన బైడెన్‌ ఎంతో కొంత న్యాయం జరిగిందన్నారు. ఈ తీర్పు తో తాను ఊరట పొందానని అన్నారు. ఐ కాంట్‌ బ్రీత్‌ అన్న జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఆఖరి మాటలు అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ ఇది కేవలం నల్లజాతీయుల సమస్య కాదని, ప్రతీ అమెరికన్‌ సమస్యని అన్నారు. అందరికీ న్యాయం అని తాము కంటున్న కలల్ని జాతి వివక్ష దూరం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.  

ఊపిరి పీల్చుకున్నాం : ఫ్లాయిడ్‌ సోదరుడు
పోలీసు అధికారి డెరెక్‌ చౌవిన్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చడంతో తామంతా ఊపిరిపీల్చుకున్నామని ఫ్లాయిడ్‌ సోదరుడు ఫిలోనైస్‌ అన్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన అనుకూలంగా తీర్పు వచ్చినా జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని చెప్పారు.

ఊపిరి ఆడట్లేదు... కాలు తీయండి
నల్లజాతీయుడైన జార్జ్‌ ఫ్లాయిడ్‌ మిన్నియాపాలిస్‌లోని ఒక దుకాణంలో నకిలీ 20 డాలర్ల నోటుతో సిగరెట్లు కొనుగోలు చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. ఆ దుకాణంలో పని చేసే ఉద్యోగి ఫిర్యాదు మేరకు పోలీసు అధికారిగా ఉన్న శ్వేతజాతీయుడు డెరెక్‌ చౌవిన్‌ 2020, మే 25 రాత్రి ఫ్లాయిడ్‌ను అరెస్ట్‌ చేయడానికి వచ్చినప్పుడు అత్యంత కర్కశంగా వ్యవహరించాడు. 46 ఏళ్ల వయసున్న ఫ్లాయిడ్‌ను రోడ్డుమీదకి ఈడ్చుకొచ్చాడు. తన మోకాలితో ఫ్లాయిడ్‌ మెడపై గట్టిగా నొక్కి పెట్టి ఉంచాడు. ఫ్లాయిడ్‌ ఊపిరి ఆడడం లేదంటూ ఎంత మొరపెట్టుకున్నా చౌవిన్‌ కర్కశ హృదయం కరగలేదు. తొమ్మిది నిమిషాలు పైగా అలా తొక్కి పెట్టి ఉంచాడు. దీంతో ఫ్లాయిడ్‌  గిలగిల కొట్టుకుంటూ ప్రాణాలు వదిలాడు. దీనికి సంబంధించిన వీడియో బయటకి రావడంతో ప్రజలు ఆగ్రహోద్రిక్తులయ్యారు. ‘‘ఐ కాంట్‌ బ్రీత్‌. ఐ కాంట్‌ బ్రీత్‌’’అన్న ఫ్లాయిడ్‌ చివరి మాటలు విన్న వారి హృదయాలు కరిగి నీరయ్యాయి.

మరిన్ని వార్తలు