Military Robots In World: మిలటరీలో మరమనిషి

19 Mar, 2022 04:19 IST|Sakshi

ప్రపంచంలో టాప్‌ 10 సైనిక రోబోలు

మనిషిని దేవుడు సృష్టిస్తే, ఆయనకు పోటీగా మరమనిషిని మనిషి సృష్టించుకున్నాడు. అంతటితో ఆగక వాటిని మృత్యురూపాలుగా మారుస్తున్నాడు. వీటి వాడకంతో సంప్రదాయ యుద్ధ రూపురేఖలు మార్చేశాడు. ఇలాగే  కొనసాగితే భవిష్యత్‌లో సృష్టికర్తనే మింగే భస్మాసుర రోబోలు అవతరించడానికి అట్టేకాలం పట్టదంటున్నారు నిపుణులు.  

మానవ జీవనం మరింత సౌకర్యవంతంగా చేయాలన్న సంకల్పంతో మరమనుషుల రూపకల్పన జరిగింది. కాలక్రమేణా వీటిని మారణహోమం సృష్టించే మిషన్లుగా వాడడం ఆరంభమైంది. సైనిక రంగంలో రోబోల వాడకం నైతికం కాదన్న వాదనలున్నా, వీటి వాడకం మాత్రం పెరిగిపోతూనే ఉంది. యుద్ధరంగంలోకి రోబోటిక్‌ టెక్నాలజీని ప్రవేశపెట్టడం ప్రపంచ యుద్ధ నమూనాలను మార్చివేస్తోంది.

ప్రస్తుతం మిలటరీలో ఉన్న రోబోలు అటు పోరాటంతో పాటు ఇటు రెస్క్యూ (కాపాడడం) ఆపరేషన్లలో, పేలుడు పదార్థాలను కనిపెట్టి నిర్వీర్యం చేయడంలో, గూఢాచర్యంలో, రవాణాలో ఎంతో ఉపయోగపడుతున్నాయి. వీటి రాక సాంప్రదాయక యుద్ధ విధానాలను ఒక్కపెట్టున మార్చేసింది. ఆధునిక రోబో సాంకేతికత అందుబాటులో ఉన్న మిలటరీ అత్యంత బలంగా మారుతోంది. దీన్ని గుర్తించిన ప్రభుత్వాలు నైతికతను పక్కనపెట్టి మరీ, తమ తమ మిలటరీకి మరమనిషి సాయం అందించేందుకు కోట్ల డాలర్లు కుమ్మరిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో టాప్‌ 10 మిలటరీ రోబోల వివరాలు ఇలా ఉన్నాయి.

మార్స్‌ (ఎంఏఏఆర్‌ఎస్‌)  
► మాడ్యులార్‌ అడ్వాన్స్‌డ్‌ ఆర్మ్‌డ్‌ రోబోటిక్‌ సిస్టమ్‌కు సంక్షిప్త నామమే మార్స్‌.  
► ఇది మానవ రహిత రోబో. మిలటరీ ఆవసరాల కోసమే తయారు చేశారు.  
► దీంట్లో శాటిలైట్‌ ట్రాకింగ్‌ వ్యవస్థను, కెమెరాలను, ఫైర్‌ డిటెక్షన్‌ వ్యవస్థను అమర్చారు.  
► గ్రెనేడ్‌ లాంచర్‌ లాంటి భయంకర జనహనన ఆయుధాలను దీనికి అనుసంధానిస్తారు.  
► ఈ ఆయుధాలను రిమోట్‌తో నిర్వహించి విధ్వంసం సృష్టిస్తారు.  
► ధర సుమారు 3 లక్షల డాలర్లు. వేగం        గంటకు 11 కిలోమీటర్లు.  

సఫిర్‌ (ఎస్‌ఏఎఫ్‌ఎఫ్‌ఐఆర్‌)  
► చూడ్డానికి మనిషిలాగా రెండు కాళ్లతో ఉంటుంది.  
► డామేజ్‌ కంట్రోల్‌లో మనిషి చేయలేని పనులు చేసేందుకు దీన్ని రూపొందించారు.  
► ఇది కూడా మానవ రహిత రోబోనే.  
►  దూరంలో ఉన్న శత్రు నౌకలను పసిగట్టగలదు. నావికాదళంలో వాడుతున్నారు.  
► ధర సుమారు 1.5– 2.25 లక్షల డాలర్లు.  

గ్లాడియేటర్‌
► గ్లాడియేటర్‌ టాక్టికల్‌ అన్‌మాన్‌డ్‌ గ్రౌండ్‌ వెహికల్‌ను సంక్షిప్తంగా గ్లాడియేటర్‌ అంటారు.  
► గూఢచర్యం, నిఘా, నిర్దేశిత లక్ష్యాలను గుర్తించడం, అడ్డంకుల ఛేదనలో ఉపయోగిస్తారు.  
► దీంతో పాటు అణు, రసాయన ఆయుధాల ప్రయోగాన్ని గుర్తించగలదు.  
► అవసరమైతే నేరుగా కాల్పులు జరపగలదు.  
► ధర దాదాపు 4 లక్షల డాలర్లు.  

బిగ్‌డాగ్‌  
► పేరుకు తగ్గట్లు పెద్ద కుక్క సైజులో ఉంటుంది.  
► బోస్టన్‌ డైనమిక్స్‌ దీన్ని రూపొందించింది. 100 పౌండ్ల బరువును మోయగలదు.  
► ఎలాంటి ఉపరితలాలపైనైనా సులభంగా ప్రయాణం చేస్తుంది.  
► దీన్ని మిలటరీ లాజిస్టిక్స్‌లో వాడుతున్నారు.  
► సులభమైన కదలికల కోసం పలు రకాల సెన్సార్లు ఇందులో ఉంటాయి.  
► ధర దాదాపు 74 వేల డాలర్లు.  

 

డోగో  
► ఎనిమిది మైక్రో వీడియో కెమెరాలున్న ఈ రోబో 360 డిగ్రీల కోణంలో చూస్తుంది.  
► ఇందులో ఉన్న తుపాకీ గురితప్పకుండా పేల్చేందుకు మరో రెండు బోరోసైట్‌ కెమెరాలుంటాయి.  
► రేంజర్‌ రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా నియంత్రిస్తారు. జనరల్‌ రోబోటిక్స్‌ తయారు చేస్తోంది.  
► ఈ రోబోను భారతీయ ఎన్‌ఎస్‌జీ వాడుతోంది.  
► ధర సుమారు లక్ష డాలర్లు.

పెట్‌మాన్‌
► ప్రొటెక్షన్‌ ఎన్సెంబుల్‌ టెస్ట్‌ మానిక్విన్‌ సంక్షిప్త నామమే పెట్‌మాన్‌.  
► ఇది చూడ్డానికి మనిషిలాగా ఉండే హ్యూమనాయిడ్‌ రోబో.  
► మానవ సైనికుల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి రూపొందించారు.  
► ఇది మనిషిలాగా నడవడం, పాకడం, పరిగెత్తడంతో పాటు చెమట కూడా కారుస్తుంది.  
► భవిష్యత్‌లో రెస్క్యూ ఆపరేషన్స్‌లో              వాడబోతున్నారు.  
► దీని రూపకల్పనకు దాదాపు 2.6 కోట్ల డాలర్లు ఖర్చైందని బోస్టన్‌ డైనమిక్స్‌ తెలిపింది.  

అట్లాస్‌
► ఎమర్జెన్సీ సేవల కోసం రూపొందించారు.  
► ప్రమాదకరమైన వాల్వులను మూసివేయడం, తెరుచుకోని బలమైన తలుపులను తెరవడం, మనిషి వెళ్లలేని వాతావరణ పరిస్థితుల్లోకి వెళ్లి రావడం చేయగలదు.  
► చూడటానికి మరుగుజ్జులాగా కనిపిస్తుంది.  
► గాల్లోకి దూకడం, వేగంగా పరిగెత్తడం చేయగలదు.  
► ధర సుమారు 75 వేల డాలర్లు.  

గార్డ్‌బోట్‌  
► రక్షణ మిషన్లలో పాలుపంచుకుంటూనే పరిస్థితులను వీడియో తీసి లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయగలగడం దీని ప్రత్యేకత.  
► గుండ్రంగా బంతిలాగా ఉండే ఈ రోబో ఉభయచర రోబో.
► నేలపై, నీళ్లలో ప్రయాణించగలదు.  
► బురద, మంచును లెక్క చేయకుండా దొర్లుకుంటూ పోగలదు.  
► నిఘా కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది.  
► ధర సుమారు లక్ష డాలర్లు.   

పీడీ100 బ్లాక్‌ హార్నెట్‌  
► ఫ్లిర్‌ సిస్టమ్స్‌ తయారీ. ఎక్కువగా గూఢచర్యంలో ఉపయోగపడతుంది.  
► వాడుకలో ఉన్న అతిచిన్న డ్రోన్‌ రోబో. కీటకం సైజులో కనిపిస్తుంది.  
► భారత్‌ సహా పలు దేశాల మిలటరీలు చాలా రోజులుగా వాడుతున్నాయి.  
► దీన్ని అపరేట్‌ చేసే విధానాన్ని కేవలం 20 నిమిషాల్లో నేర్చుకోవచ్చు.  
► అరగంట చార్జింగ్‌తో అరగంట పాటు గాల్లో   తిరగగలదు.  
► గరిష్ఠ వేగం గంటకు 21 కిలోమీటర్లు. ధర దాదాపు 1.95లక్షల డాలర్లు.

ఎల్‌ఎస్‌3 
► లెగ్గడ్‌ స్క్వాడ్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ అంటారు.  
► నాలుగు కాళ్లుండే ఈ రోబో సైనికులకు సామాన్లు మోసే గుర్రంలాగా ఉపయోగపడుతుంది.  
► ఎలాంటి ఆర్డర్లు లేకుండానే నాయకుడిని ఫాలో కావడం దీని ప్రత్యేకత.  
► చిన్న పాటి వాయిస్‌ కమాండ్స్‌ను ఆర్థం    చేసుకుంటుంది.  
► 400 పౌండ్ల బరువును మోయగలదు.           
► బిగ్‌డాగ్‌ రోబోతో పోటీ పడుతుంది.  
► ధర దాదాపు లక్ష డాలర్లు.  

ఎంతవరకు కరెక్ట్‌?
మిలటరీలో రోబోలను ప్రవేశపెట్టడం వల్ల ఉపయోగాలున్నాయనేవారికి సమానంగా వీటి వాడకాన్ని వ్యతిరేకించేవారు కూడా ఉన్నారు. సైనిక రోబోలతో మానవ సైనికుల ప్రాణాలను రక్షించవచ్చు. మనిషిలాగా వీటికి అలసట రాదు. కనురెప్ప వాల్చకుండా కాపలా కాస్తాయి. వానకు, ఎండకు బెదరవు. మానవ సంబంధ బలహీనతలకు లొంగవు. ముఖ్యంగా యుద్ధమంటే ఏ దశలో కూడా భయం చెందవు. వీటి గురి తప్పదు. వీటితో సమయం ఆదా అవుతుంది.

మనిషి చేయలేని పనులను కూడా చేయగలవు. అందుకే వీటిని వాడడం మంచిదేనంటారు సమర్ధకులు. అయితే ఈ వాదనను మానవ హక్కుల కార్యకర్తలు, ఎన్‌జీఓలు వ్యతిరేకిస్తుంటాయి. కిల్లర్‌ రోబోల వాడకం నైతిక విలువలకు దూరమని వీరి వాదన. ఎదుటి పక్షం సైనికులు కూడా మనుషులేనని ఇవి గుర్తించవు. వారిని దయాదాక్షిణ్యం లేకుండా ఈ రోబోలు క్రూరంగా మట్టుబెడతాయి. వీటి ఖరీదు చాలా అధికం.

అందువల్ల ధనిక దేశాలు మాత్రమే భరించగలవు. ఇది ఆయా దేశాలకు మిగిలిన బలహీన దేశాలపై పైచేయినిస్తుంది. యుద్ధం మధ్యలో సాంకేతిక లోపాలు తలెత్తితే ఒక్కమారుగా పరిస్థితి తలకిందులవుతుంది. అన్నిటికి మించి మితిమీరిన సాంకేతికతతో ఈ రోబోలు స్వతంత్రంగా మారితే జరిగే పరిణామాలు భయానకంగా ఉంటాయని కిల్లర్‌ రోబోల వ్యతిరేకులు హెచ్చరిస్తున్నారు. ఎవరివాదన ఎలాఉన్నా ప్రస్తుతానికి ప్రభుత్వాలు మాత్రం వీటి వాడకాన్ని ప్రోత్సహిస్తూనే ఉన్నాయి.   

– నేషనల్‌ డెస్క్, సాక్షి.

మరిన్ని వార్తలు