సామాన్యునికి సెయింట్‌హుడ్‌

16 May, 2022 06:22 IST|Sakshi
సెయింట్‌ హుడ్‌ ప్రకటించిన తర్వాత వాటికన్‌ సిటీలో పోప్‌ ప్రార్థనలు

తమిళనాడుకు చెందిన దైవసహాయానికి మహిమాన్విత హోదా ప్రకటించిన పోప్‌ ఫ్రాన్సిస్‌

వాటికన్‌ సిటీ: మూడు శతాబ్దాల క్రితం క్రైస్తవాన్ని స్వీకరించి, చిత్రహింసలకు గురైన తమిళనాడుకు చెందిన సాధారణ పౌరుడు దేవసహాయం పిళ్లైకి సెయింట్‌హుడ్‌ (మహిమాన్విత హోదా) లభించింది. వాటికన్‌ నగరంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆయనకు మహిమాన్విత హోదా ప్రకటించారు. భారత్‌కు చెందిన ఒక సాధారణ పౌరుడికి కేథలిక్కు మతంలో అత్యున్నత గౌరవం దక్కడం ఇదే మొదటిసాది. దేవసహాయంతో పాటు పలు దేశాలకు చెందిన మరో తొమ్మిది మందికి సెయింట్‌ హోదా ఇచ్చారు. వారిలో నలుగురు మహిళలున్నారు. 1712 ఏప్రిల్‌ 23న కేరళలోని ట్రావెంకోర్‌ రాజ్యంలో హిందూ నాయర్‌ కుటుంబంలో దేవసహాయం జన్మించారు.

ట్రావెంకోర్‌ రాజు మార్తాండ వర్మ సంస్థానంలో అధికారిగా పని చేశారు.  క్రైస్తవం పట్ల ఆకర్షితుడై ఆ మతాన్ని స్వీకరించి ప్రబోధాలు చేయసాగారు. కోపోద్రిక్తుడైన రాజు దేవసహాయాన్ని ఊరూరా తిప్పుతూ చిత్రహింసలు పెట్టారు. అయినా ప్రజల సమానత్వంపైనే ప్రసంగాలు చేయడంతో 1752 జనవరి 14న కన్యాకుమారిలో కాల్చిచంపారు. దేవసహాయాన్ని చిత్రహింసలకు గురి చేసిన అన్ని ప్రాంతాల్లోనూ అద్భుతమైన మహిమలు జరిగాయని భారత్‌కు చెందిన కేథలిక్‌ బిషప్స్‌ సమాఖ్య పోప్‌ ఫ్రాన్సిస్‌ దృష్టికి తీసుకెళ్లింది. ఆ మహిమలను 2014లో పోప్‌ గుర్తించినట్టు వెల్లడించారు.  
 

మరిన్ని వార్తలు