పుస్తకంగా 12 ఏళ్ల బాలిక వలస గాథ

24 Jun, 2022 04:50 IST|Sakshi

యుద్ధంతో శిథిలావస్థకు చేరిన ఉక్రెయిన్‌ నుంచి ఇప్పటికే 70 లక్షలకు పైగా పౌరులు వలస బాట పట్టడం తెలిసిందే. అలా కుటుంబంతో పాటు ఖర్కీవ్‌ నుంచి డబ్లిన్‌ వలస వెళ్లిన యెవా స్కలెట్‌స్కా అనే 12 ఏళ్ల బాలిక తన భయానక అనుభవాలను గ్రంథస్థం చేయనుంది. వాటిని ‘యూ డోంట్‌ నో వాట్‌ వార్‌ ఈజ్‌: ద డైరీ ఆఫ్‌ అ యంగ్‌ గాళ్‌ ఫ్రం ఉక్రెయిన్‌’ పేరిట పుస్తకంగా ప్రచురించేందుకు హారీపోటర్‌ సిరీస్‌ ప్రచురణకర్త బ్లూమ్స్‌బరీ ముందుకొచ్చింది. అక్టోబర్‌ కల్లా పుస్తకాన్ని విడుదల చేస్తామని ప్రకటించింది. యెవా ఖర్కీవ్‌లో తన నానమ్మతో కలిసి ఉండేది. ఫిబ్రవరి 24న భారీ బాంబుల మోతతో మేల్కొన్నది మొదలు ఆమె జీవితం మారిపోయింది.

బాంబులు, క్షిపణుల దాడి నుంచి తప్పించుకునేందుకు వారు షెల్టర్లలో తలదాచుకున్నారు. పరిస్థితి విషమిస్తుండటంతో వారిద్దరూ వలస బాట పట్టారు. అక్కడ ఇంగ్లండ్‌ జర్నలిస్టుల బృందాన్ని యెవా కలిసింది. తన అనుభవాలతో ఏ రోజుకా రోజు ఆమె రాసుకున్న డైరీ చూసి ఆ రాతల్లో లోతు, వయసుకు మించిన పరిపక్వతకు వాళ్లు ఆశ్చర్యపోయారు. ఇదంతా ఇప్పుడు పుస్తక రూపంలో రానుంది. యెవా గాథ మమ్మల్ని ఎంతగానో కదిలించిందని పుస్తక ఇంగ్లండ్, కామన్వెల్త్‌ దేశాల ప్రచురణ హక్కులు కొనుగోలు చేసిన ఇలస్ట్రేటెడ్‌ పబ్లిషింగ్‌ ఎడిటర్‌ సలీ బీట్స్‌ అన్నారు. ‘యుద్ధ బీభత్సం ఆమె చిన్నారి కళ్లు ఎలా చూశాయో అలాగే పుస్తక రూపు సంతరించుకోనుంది. అందరూ చదివి తీరాల్సిన పుస్తకమిది’అని అభిప్రాయపడ్డారు. పుస్తక ప్రచురణ హక్కులు 12 భాషల్లో అమ్ముడయ్యాయట. 

మరిన్ని వార్తలు