కణకణమండే నిప్పుల కొలిమి, భగభగా మండుతున్న నగరాలు

4 Jul, 2021 03:25 IST|Sakshi

నగరాలన్నీ ఎందుకు భగభగలాడుతున్నాయి?

దేశాలు కుతకుతలాడుతున్నాయి. వందల మంది జనం పిట్టల్లా రాలిపోతున్నారు. మన దేశంలో ఢిల్లీ, హరియాణాతోపాటు పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీనంతటికీ కారణం ‘హీట్‌ డోమ్‌’లు ఏర్పడటమే. ఉన్నట్టుండి ఈ హీట్‌ డోమ్‌లు ఏమిటి? ఎందుకు ఇంతగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి? ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంది? భవిష్యత్తు అంచనాలేమిటన్న వివరాలు తెలుసుకుందామా?     – సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

అంటార్కిటికాలోనూ పెరుగుతున్న వేడి 
మైనస్‌ ఉష్ణోగ్రతలతో, నిరంతరం మంచుతో కప్పి ఉండే అంటార్కిటికాలోనూ ఈసారి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఉత్తర అమెరికా తరహాలోనే అంటార్కిటికా ప్రాంతంలోనూ హీట్‌ డోమ్‌ వంటి పరిస్థితులు ఏర్పడ్డాయని.. జూలై 1న ఇక్కడ ఏకంగా 18.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైందని ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించింది.

ఏమిటీ హీట్‌ డోమ్‌?  
ఏదైనా ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగి.. దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వాతావరణ పీడనం ఎక్కువగా ఉన్నప్పుడు, ఆ వేడి ఎటూ విస్తరించలేక అక్కడే కేంద్రీకృతం అవుతుంది. అదే సమయంలో ఎండ కొనసాగుతూ ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగిపోతాయి. దీనినే హీట్‌ డోమ్‌ అంటారు. వాతావరణంలో ఆకస్మిక మార్పుల వల్ల ఇలా హీట్‌ డోమ్‌ ఏర్పడుతుంది. ఆయా ప్రాంతాల్లో కొద్ది రోజుల నుంచి ఒక్కోసారి రెండు, మూడు వారాల వరకు కూడా ఇవి కొనసాగుతాయి. కొద్దిరోజులుగా ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల హీట్‌డోమ్‌ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 

వాతావరణంలో కొద్ది కిలోమీటర్ల ఎత్తున (స్ట్రాటోస్ఫియర్‌ పొరలో).. భూమి చుట్టూ తిరిగే గాలి ప్రవాహాలు (పవనాలు) ఉంటాయి. భూమ్మీద ఉష్ణోగ్రతలు, ఆయా ప్రాంతాల్లో వేర్వేరు పీడనాలను ఈ పవనాలు సమం చేస్తూ ఉంటాయి. అయితే ఒక్కోసారి ఈ పవనాలు ఏదైనా ఓ ప్రాంతంలో ఆగిపోతాయి. అలా ఆగిపోయిన చోట.. భూఉపరితలానికి ఎగువన వాతావరణ పీడనం పెరిగిపోతుంది. కింద ఉన్న గాలిపై ఒత్తిడి పెరిగి హీట్‌ డోమ్‌ ఏర్పడుతుంది. వాతావరణం ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ మేఘాలు కూడా ఏర్పడవు. ఫలితంగా సూర్యరశ్మి నేరుగా పడి.. హీట్‌డోమ్‌ ఉన్న ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగిపోతాయి. 

1. వేడెక్కిన గాలి పైకి వెళ్తుంది
2. అధిక పీడనం ఆ గాలిని కిందికి తోస్తుంది
3. ఈ పరిస్థితి వల్ల మేఘాలు దూరంగా చెల్లాచెదురవుతాయి
4. గాలి ఒత్తిడి పెరిగి, ఎండ నేరుగా పడి ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి

ఉత్తర భారతం గరంగరం 


మన దేశంలో మార్చి నుంచి జూన్‌ వరకు అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు నమోదవుతాయి. కొన్ని సందర్భాల్లో జూలైలోనూ కొనసాగుతాయి. ఢిల్లీ, ఇతర ఉత్తర భారత రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉంటుంది. ఈసారి అలా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలో గురు, శుక్రవారాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణంతో పోలిస్తే ఇది ఏడు డిగ్రీలు ఎక్కువ. ఢిల్లీ, హరియాణా, పరిసర ప్రాంతాల్లో హీట్‌ డోమ్‌ ఏర్పడటంతోనే.. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. 

ఇరవై ఏళ్లలో మరింతగా మంటలు! 
భారత దేశంలో మరో ఇరవై ఏళ్లలో ఎండల తీవ్రత భారీగా పెరుగుతుందని.. వడగాడ్పులూ దానికి తోడవుతాయని ‘ది ఎకనమిస్ట్‌’మేగజైన్‌ వెల్లడించింది. కొన్నేళ్లుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, ప్రస్తుత పరిస్థితి, వాతావరణ మార్పులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఓ నివేదికను విడుదల చేసింది. 2041 నాటికి దేశంలో ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుతుందని పేర్కొంది. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 49.3 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ భారత రాష్ట్రాల్లో 50 డిగ్రీలకుపైగా నమోదు కావొచ్చని పేర్కొంది. చెన్నై పరిస్థితి దారుణమవుతుందని, ఎండల తీవ్రతకు వేల మంది చనిపోవచ్చని అంచనా వేసింది. హైదరాబాద్‌లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.

అమెరికా, కెనడా ఆగమాగం
అమెరికాలోని వాషింగ్టన్, ఒరెగాన్‌ రాష్ట్రాలు, కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా ప్రాంతం కొద్దిరోజులుగా నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. తీవ్రమైన వడగాడ్పులు వీస్తున్నాయి. కెనడా చరిత్రలోనే అత్యధికంగా 49.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటికే వందల మంది చనిపోయారు. వేడికి కార్చిచ్చు చెలరేగి ఇక్కడి లిట్టన్‌ ప్రాంతం 90 శాతం దహనమైపోయింది. మరోవైపు రష్యా, బ్రిటన్, స్పెయిన్, ఫ్రాన్స్, గ్రీస్, ఇతర యూరప్‌ దేశాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. అక్కడి ప్రభుత్వాలు ప్రజల కోసం ప్రత్యేకంగా కూలింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేశాయి.  

ఎండల కారణంగా ఏసీలు, ఇతర ఉపకరణా లు, నీటి వినియోగం పెరిగిపోయింది. దీనితో బిల్లులు పెరిగి ఇబ్బంది పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలను ఆదుకునేందుకు ఆర్థిక సాయం చేయాలని అమెరికాలోని న్యూయార్క్‌ పాలకవర్గం నిర్ణయించింది. 
గ్రీస్‌లోని ఏథెన్స్, ఇతర పట్టణాల్లో ఎండ తీవ్రత, దగ్గర్లోని కూలింగ్‌ సెంటర్లను సూచించేందుకు యాప్స్‌ వినియోగిస్తున్నారు. 
ఇజ్రాయెల్‌ బహిరంగ ప్రదేశాలు, వాక్‌ వే లలో నీడ కల్పించాలని నిర్ణయించింది. ఇందుకోసం డిజైన్లు పంపాలని పోటీలు నిర్వహిస్తోంది. 

అంటార్కిటికాలోనూ పెరుగుతున్న వేడి 


మైనస్‌ ఉష్ణోగ్రతలతో, నిరంతరం మంచుతో కప్పి ఉండే అంటార్కిటికాలోనూ ఈసారి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఉత్తర అమెరికా తరహాలోనే అంటార్కిటికా ప్రాంతంలోనూ హీట్‌ డోమ్‌ వంటి పరిస్థితులు ఏర్పడ్డాయని.. జూలై 1న ఇక్కడ ఏకంగా 18.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైందని ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించింది. 

మరిన్ని వార్తలు