నర్సుల దినోత్సవం ఎలా మొదలైందో తెలుసా?

12 May, 2021 12:02 IST|Sakshi

 వారి సేవలు ఎనలేనివి

 కరోనా సమయంలో కుటుంబాలకు దూరంగా విధులు

నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం 

సాక్షి, హైదరాబాద్‌: ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటారు. అనారోగ్యం బారిన పడి ఆస్పత్రుల్లో చేరిన వారికి సేవలు చేసే చేతులు ఏవైనా ఉంటే అవి సేవామయులైన నర్సుల చేతులే. మానవ సేవే మాధవ సేవ అంటారు. అలా మానవ సేవ ద్వారానే తమ జీవితాన్ని సార్థకం చేసుకుంటున్న వారు నర్సులు. అయిన వారు కూడా ముట్టుకోవటానికి ఇబ్బంది పడినా, ఏ మాత్రం సంబంధం లేని నర్సులు సేవలు అందిస్తున్నారు. కరోనా అనగానే అల్లంత దూరం పారిపోయే కుటుంబ సభ్యులున్న నేటి రోజుల్లో కరోనా రక్కసి చేతిలో విలవిలలాడుతున్న వారికి నర్సులు అందిస్తున్న సేవలు ఎనలేనివి. 

పల్లె, పట్టణం తేడా లేకుండా అంతటా ఆయా ఆస్ప త్రులు, పీహెచ్‌సీల పరిధిలో పనిచేసే నర్సులు కరోనా బాధితులను గుర్తించడం నుంచి వారికి వైద్య సేవలు అందించి వారు కోలుకునేదాకా అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఇంటింటి సర్వే ద్వారా వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించి వారికి మందులు అందిస్తున్నారు. వీరంతా కరోనా పడగ నీడలో ఎప్పుడు వైరస్‌ బారిన పడతామో తెలియని పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్నారు. ఇప్పటికే పలువురు కరోనాతో ఇంటి దగ్గర ఉండి చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్‌ బారిన పడిన వేలాది మందికి సేవలందించడం ద్వారా నర్సులు ప్రజల అభిమానం చూరగొంటున్నారు. అయితే మరి ఈ రోజే నర్సుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా...

1820 మే 12న నర్సు వృత్తి గౌరవానికి ప్రతీక అయిన ఫ్లొరెన్స్ నైటింగేల్ పుట్టిన రోజు. 1854లో క్రిమియన్‌ యుద్ధం సందర్భంగా 38 మంది నర్సుల బృందం యుద్ధంలో గాయపడిన సైనికులకు విశేషమైన సేవలు అందించింది. ఇందులో ఫ్లొరెన్స్‌ నైటింగేల్‌ ఆ నర్సుల బృందానికి నాయకురాలిగా, మార్గదర్శకురాలిగా సేవలందించటంలో ఆదర్శంగా నిలించింది. నిరంతరం ఆ క్షతగాత్రులకు సేవలందించేందుకు దీపం పట్టుకొని శిబిరాల్లో తిరిగేది. దీంతో ఆమెను లేడీ విత్ ది ల్యాంప్ అని పిలిచేవారు. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ (ఐసిఎన్) – 1965 నుంచి ఈ రోజును జరుపుకుంటున్నారు. ఆమె చేసిన త్యాగపూరితమైన కృషి ఫలితంగా నేడు నర్సు వృత్తి కొనసాగటమే కాదు, వైద్యరంగానికి వన్నెతెచ్చింది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా అంతర్జాతీయ నర్సు దినోత్సవం జరుపుకుంటారు. 

మరిన్ని వార్తలు