Viral Video: యాజమాని దుశ్చర్య.. మూర్ఖుడి వెంట మూగజీవి పరుగులు

27 Jul, 2021 13:26 IST|Sakshi

ప్రేమ, ద్వేషం, స్వార్థం, మోసం.. ఇవన్నీ భూమ్మీద తెలివైన ప్రాణిగా పేరున్న మనిషికి మాత్రమే సొంతం. కానీ, మూగ జీవాలు అలా కాదు. ఇంత తిండి పెడితే చచ్చేదాకా విశ్వాసం చూపెడుతుంటాయి. అలాంటిది ఓ ఫ్రెండ్లీ యానిమల్‌ను వదిలించుకునే ప్రయత్నం చేశాడు ఒక మూర్ఖుడు. మరి జంతు ప్రేమికులు ఊరుకుంటారా?.. 

ఆస్టీన్‌: టెక్సాస్‌లోని ఎల్‌ పాసో సిటీకి చెందిన లూయిస్‌ అంటోనియో కాంపోస్‌(68) కుటుంబం కొన్నేళ్లుగా ఓ హస్కీని పెంచుకుంటున్నాడు. అయితే దానిని అనవసరంగా మేపుతున్నాననే ఉద్దేశానికి ఈమధ్య వచ్చాడతను. తన డ్రైవర్‌ సాయంతో దానిని దూరంగా తీసుకెళ్లాడు.  ఆ పెంపుడు హస్కీ మెడకు ఉన్న బెల్ట్‌ను తొలగించగా.. వెంటనే కారులోకి వచ్చేయ్‌మని లూయిస్‌ తన డ్రైవర్‌కి సైగ చేశాడు. పాపం.. యజమాని అలా వదిలి వెళ్తుండడంతో ఆ మూగ జీవి భయపడిపోయింది. ఆ కారు వెంట చాలా దూరం పరుగులు తీసింది. అయితే అక్కడే ఉన్న ఓ అజ్ఞాత వ్యక్తి ఆ మొత్తాన్ని వీడియో తీశాడు. యానిమల్‌ షెల్టర్‌ వాళ్లకు సమాచారం అందించాడు. వాళ్లు వచ్చి ఆ శునకాన్ని రక్షించడం.. 24 గంటలు గడవక ముందే ఓ మంచి కుటుంబం దానిని దత్తత తీసుకోవడం జరిగిపోయాయి.

ఇక ఈ వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా సర్క్యూలేట్‌ అయ్యింది. అది చూసి లూయిస్‌ను, అతని డ్రైవర్‌ను తిట్టని వాళ్లంటూ లేరు.  అతన్ని శిక్షించాలని పోలీసులను ట్యాగ్‌ చేశారు. దీంతో వీడియో ఆధారంగా కారు నెంబర్‌ ట్రేస్‌ చేశారు ఎల్‌ పాసో పోలీసులు. లూయిస్‌ను మూగజీవాల్ని హింసించిన నేరం కింద అరెస్ట్‌ చేశారు. ఐదు వేల డాలర్ల ఫైన్‌తో పాటు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష కూడా విధించింది కోర్టు. పరారీలో ఉన్న డ్రైవర్‌ కోసం గాలిస్తున్నారు ఎల్‌ పాసో పోలీసులు.

మరిన్ని వార్తలు