పక్షికి తల్లిగా మారిన కుక్క.. తల్లి కాకుండానే పాలివ్వాలని..

17 Jun, 2021 13:18 IST|Sakshi
పెగ్గీ, మోలీ

లండన్‌: ఓ కుక్క పక్షిని తన బిడ్డలా అనుకుంటోంది. తల్లికాకపోయినా ఆ పక్షి బిడ్డకు పాలు ఇవ్వటానికి ప్రయత్నిస్తోంది. ఇక పక్షి పరిస్థితి కూడా అంతే.. అది అచ్చం కుక్కలాగే ప్రవర్తిస్తోంది. అంతేకాదు కుక్కలాగా మొరగటం మొదలుపెట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వింత సంఘటన ఆస్ట్రేలియాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌కు చెందిన జూలియట్‌, రీస్‌లు గత సెప్టెంబర్‌ నెలలో చావుకు దగ్గరగా ఉన్న ఓ అనాథ మ్యాగ్పీ(ఓ పక్షి)ని చేరదీశారు. దానికి మోలీ అని పేరుపెట్టారు. అనారోగ్యంతో ఉన్న మోలీ.. జూలియట్‌, రీస్‌ల పెంపుడు కుక్క పెగ్గీ సహకారంతో త్వరగానే కోలుకుంది. పెగ్గీ చూపిన ప్రేమ.. 24 గంటలు ఒకదానితో ఒకటి కలిసి ఉండటంతో మోలీ పూర్తిగా మారిపోయింది.

కుక్కలా ప్రవర్తించటం.. మొరగటం చేస్తోంది. మొదట్లో అది పెగ్గీ అరుపులని భావించారు. కానీ, మోలీ ఆ అరుపులు చేస్తోందని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. అది అచ్చం పెగ్గీలాగా అరుస్తుండటంతో పడిపడి నవ్వుకునేవారు. ఇంటి ఆవరణలో వేరే కుక్కల అరుపులు వినిపిస్తే చాలు.. మోలీ కూడా అరవటం చేస్తోంది. కేవలం మోలీలోనే కాదు.. పెగ్గీలోనూ కొన్ని మార్పులు వచ్చాయి. మోలీ పరిచయానికి ముందు పెగ్గీకి పక్షులంటే భయం. కానీ, మోలీ పరిచయం తర్వాత అంతా మారిపోయింది. దీనిపై జూలియట్‌ మాట్లాడుతూ.. ‘‘ మోలీ ఆరోగ్యం కుదుట పడిన తర్వాత అది ఇంట్లోంచి బయటకు వెళ్లిపోతుందేమో అనుకున్నాం. ఇంటి కిటికీలు, డోర్లు అన్నీ తెరిచిపెట్టేవాళ్లం. కానీ, మోలీ ఇంట్లోంచి బయటకు వెళ్లిపోవటం తనకు ఏమాత్రం ఇష్టంలేనట్లు ఇంట్లోనే పెగ్గీతో చక్కర్లు కొట్టేది.

ఆ రెండు జంతువులకు ఓ ప్రత్యేకమైన భాష ఉంది. ఆ భాషలోనే అవి మాట్లాడుకుంటాయి. నేను ఇలాంటి జంతువుల జంటను ఇది వరకు ఎప్పుడూ చూడలేదు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే. పెగ్గీ.. మోలీని తన బిడ్డలా భావిస్తోంది. అందుకే.. తల్లి కాకపోయినా పిల్లలకు పాలు ఇచ్చినట్లు మోలీకి కూడా పాలు ఇవ్వటానికి చూస్తోంది. ఈ కారణంతో పెగ్గీ శరీరంలో పాలు ఉత్పత్తి అవుతున్నాయని ఓ వెటర్నరీ డాక్టర్‌ దగ్గరకు వెళ్లినపుడు తెలిసింది. మోలీ కూడా కుక్క పిల్లలు పాలు తాగుతున్నట్లు ప్రవర్తించేది. అందుకే పెగ్గీకి బట్టలు వేయటం మొదలుపెట్టాం. ఈ రెండు జంతువులు మా జీవితంలోకి ఎంతో ఆనందాన్ని తెచ్చాయి’’ అని పేర్కొంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు