నోబెల్‌ శాంతి నామినేషన్స్‌లో ట్రంప్ పేరు‌!

1 Feb, 2021 12:59 IST|Sakshi

 గ్రెటా థన్‌బెర్గా, డబ్య్లూహెచ్‌ఓ కూడా

స్టాక్‌హోమ్: అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్‌ శాంతి అవార్డు నామినేషన్‌ల ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. ఈ ఏడాది అక్టోబర్‌లో బహుకరించే ఈ శాంతి పురస్కారం రేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నోబెల్‌ అవార్డు నామినేషన్‌లో ట్రంప్‌ పేరు వినిపించడం ఆసక్తిని రేపుతోంది. ఆయనతో పాటు ఈ అవార్డు నామినేషన్‌లో స్వీడన్‌కు చెందిన 18 ఏళ్ల బాలిక,  పర్యావరణ వేత్త గ్రెటా థన్‌బర్గ్‌, రష్యా అసమ్మతి నేత అలెక్సీ నావల్సీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)లు కూడా ఉన్నాయి. కాగా బాల పర్యావరణ వేత్తగా గ్రెటా పలు కార్యక్రమాలు చేపుడుతున్న సంగతి తెలిసిందే.

చిన్న వయసులోనే పర్యావరణానికి సంబంధించిన కార్యక్రమాలు చేపడుతూ... అంతర్జాతీయ సదస్సుల్లో పర్యావరణ సంరక్షణపై ప్రసంగించడమే గాక పర్యావరణ అంశాలపై ధైర్యంగా ఆమె గళం విప్పుతోంది. చిన్న వయసులోనే పర్యావరణంపై ఆమెకు ఉన్న అవగాహన, ఇతరులను కూడా పర్యావరణపై అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ సదస్సుల్లో ఆమె ప్రసంగం ప్రపంచ దేశాలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఆమె ఎన్నో అంతర్జాతీయ అవార్డులకు అందుకుంది. (చదవండి: అప్పుల ఊబిలో డొనాల్డ్‌ ట్రంప్‌..?)

అలాగే రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ కూడా రష్యాలో శాంతియుత ప్రజాస్వాయ్యం కోసం ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ చర్యలను వ్యతిరేకించే నావల్నీపై ఇటీవల విషయ ప్రయోగం కూడా జరిగింది. దీంతో అయిదు నెలల పాటు ఆయన జర్మనీలో చికిత్స తీసుకుని ప్రాణాలతో బయటపడ్డారు. ఈ నేపథ్యంలో ఇటీవల తిరిగి రష్యా వచ్చిన నావల్నీని అరెస్టు చేయడంతో రష్యాలో నిరసనలు వెల్లువెత్తాయి. అయితే వీరితో పాటు ఈసారి నామినేషన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేరు కూడా ఉండటం విశేషం. అంతేగాక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)తో పాటు ప్రపంచం మొత్తానికి కరోనా వ్యాక్సిన్ అందించాలనే ఉద్దేశ్యంతో ఈ సంస్థ ప్రారంభించిన కోవ్యాక్స్ ప్రోగ్రామ్‌ కూడా ఈ అవార్టు నామినీల జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నోబెల్‌ కమిటీ మాత్రం నామినీల పేర్లను అధికారికంగా ప్రకటించలేదు. (చదవండి: గ్రెటా థంబర్గ్ : ల‌క్ష డాల‌ర్ల భారీ విరాళం)

మరిన్ని వార్తలు