నేనే గెలిచా.. కాదు నేను!

2 Oct, 2020 04:13 IST|Sakshi

అమెరికా తొలి ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌లో పైచేయిపై ట్రంప్, బైడెన్‌ ప్రకటన

వాషింగ్టన్‌: అధ్యక్ష ఎన్నికలకు ముందు జరిగిన తొలి ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌లో తానే విజయం సాధించానని ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ అభివర్ణించుకున్నారు. చర్చలో బైడెన్‌ ప్రమాదకరమైన ఎజెండాను తాను బయటపెట్టానని చెప్పుకున్నారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ డిబేట్‌ ఆద్యంతం వాడివేడిగా జరిగిన సంగతి తెలిసిందే!. డిబేట్‌లో తమ అభ్యర్ధే గెలిచినట్లు డెమొక్రాట్లు  ప్రకటించుకున్నారు.

ఇన్నాళ్లు మీడియా చేయలేని పని తాను చేశానని, బైడెన్‌ 47 ఏళ్ల రాజకీయ అనైతికతను బయటపెట్టానని ట్రంప్‌ చెప్పారు. దేశాన్ని నడిపేందుకు బైడెన్‌ అత్యంత బలహీనమైన వ్యక్తన్నారు. తన ధాటికి తట్టుకోలేక మిగిలిన డిబేట్లను రద్దు చేసుకోవాలని బైడెన్‌కు డెమొక్రాట్లు సూచిస్తున్నారన్నారు. బైడెన్‌ది వామపక్ష ఎజెండా అని, అతను అధ్యక్షుడైతే వ్యవస్థలు నిర్వీర్యం చేస్తాడని విమర్శించారు. మిగిలిన రెండు డిబేట్ల కోసం తాను ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు.  

డిబేట్లలో మార్పులు!
యూఎస్‌ ప్రెసిడెన్షియల్‌ డిబేట్లలో మార్పులు తీసుకురావాలని భావిస్తున్నట్లు కమిషన్‌ ఆన్‌ ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌ తెలిపింది. తాజాగా జరిగిన తొలి డిబేట్‌లో డెమొక్రాటిక్‌ అభ్యర్థి బైడెన్‌ను మాట్లాడకుండా ట్రంప్‌ పలుమార్లు అడ్డంపడ్డారు.

అనుమాన బీజాలు నాటే యత్నం
ఎన్నికల్లో ఓటమి తథ్యమని తెలిసుకొన్న ట్రంప్‌ ప్రజల్లో ఎన్నికల చట్టబద్ధతపై అనుమాన బీజాలు నాటేందుకు యత్నిస్తున్నారని జోబైడెన్‌ ఆరోపించారు. తాను ఓడిపోతే ఆ ఎన్నిక చట్టబద్ధం కాదని ట్రంప్‌ భావిస్తున్నారని, ఇదే అనుమానాన్ని ప్రజల్లో కలిగిస్తున్నారని విమర్శించారు. ఇప్పటివరకు ఏఒక్క  అధ్యక్షుడు ఇలా చేయలేదన్నారు. మంగళవారం జరిగిన ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌లో ట్రంప్, బైడెన్‌ హోరాహోరీగా మాటలయుద్ధం చేసుకున్నారు. రెండో డిబేట్‌ ఈ నెల 15న జరుగుతుంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా