నేను రెడీ.. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డొనాల్డ్‌ ట్రంప్‌.. అధికారిక ప్రకటన

16 Nov, 2022 08:55 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా వ్యాపార దిగ్గజం, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. 2024 అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నట్లు బుధవారం ఆయన అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు.. వైట్ హౌస్ బిడ్ కోసం 76 ఏళ్ల వయసున్న ట్రంప్‌ పత్రాలను సైతం దాఖలు చేసినట్లు తెలుస్తోంది. తద్వారా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న తొలి ప్రధాన అభ్యర్థిగా ఆయన నిలిచినట్లయ్యింది.

అమెరికా పునరాగమనం ఇప్పుడిప్పుడే మొదలవుతుంది అంటూ ఆయన తన మద్దతుదారులను ఉద్దేశించి టెలివిజన్‌ స్పీచ్‌ ద్వారా ప్రకటించారు. అమెరికాను మళ్లీ గొప్పగా మార్చడానికి.. ఈ రాత్రి యునైటెడ్ స్టేట్స్ అధ్యక్ష పదవికి నా అభ్యర్థిత్వాన్ని నేను ప్రకటిస్తున్నా అని తెలిపారాయన. ఆపై తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌  ట్రూత్ సోషల్లో ‘‘ఈ రోజు మన దేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన రోజులలో ఒకటిగా మారుతుందని ఆశిస్తున్నా’’ అంటూ పోస్ట్‌ చేశారు.

బిజినెస్‌ టైకూన్‌, రియాలిటీ టీవీ స్టార్‌ అయిన డొనాల్డ్‌ ట్రంప్‌.. 2016 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి ప్రపంచాన్ని నివ్వెరపరిచారు. అయితే 2020 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. అయితే ఆయనకు ఫాలోయింగ్‌ మాత్రం ఈనాటికీ తగ్గలేదు. 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. 

డొనాల్డ్ ట్రంప్ ఫర్ ప్రెసిడెంట్ 2024 పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేసి.. అందుకు సంబంధించిన పత్రాలను మంగళవారమే ఆయన US ఫెడరల్ ఎలక్షన్ కమిషన్‌ వద్ద సమర్పించినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు