ఎలాన్‌ మస్క్‌ రూటే సపరేటు.. 22 నెలల తర్వాత ట్రంప్‌ ఖాతాకు గ్రీన్‌సిగ్నల్‌

20 Nov, 2022 09:39 IST|Sakshi

ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్‌ మస్క్‌.. ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత పలు సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో ఆసక్తికర పరిణామం జరిగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్విట్టర్‌ ఖాతా పునురుద్ధరణ విషయంలో ఎలాన్‌ మస్క్‌ ఓటింగ్‌ నిర్వహించారు. ఈ ఓటింగ్‌ అనంతరం.. ట్రంప్‌ ట్విట్టర్‌ ఖాతాపై బ్యాన్‌ను తొలగించినట్టు స్పష్టం చేశారు. 

వివరాల ప్రకారం.. ట్విట్టర్‌లోకి డొనాల్డ్‌ ట్రంప్‌ రీ ఎంట్రీ ఇచ్చారు. జీవితకాల నిషేధానికి గురైన ట్రంప్‌ ఖాతాను ఎట్టకేలకు ట్విట్టర్‌ పునరుద్ధరించింది. అయితే, 2021 జనవరిలో జరిగిన క్యాపిటల్‌ హిల్‌ దాడి తర్వాత ట్రంప్‌ అకౌంట్‌ను మైక్రోబ్లాగింగ్‌ వెబ్‌సైట్‌ బ్యాన్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో, ఆయన ఖాతా పునరుద్ధరణపై ఎలాన్‌ మస్క్‌ నిర్వహించిన ఓటింగ్‌లో 51.8 శాతం మంది ట్రంప్‌కు అనుకూలంగా ఓటువేశారు. 

అయితే.. ట్రంప్‌ ట్విట్టర్‌ అకౌంట్‌పై మస్క్‌ పోల్‌ నిర్వహించారు. ట్విట్టర్‌ వేదికగా ఎలాన్‌ మస్క్‌.. ట్రంప్‌ అకౌంట్‌కు Yes OR No చెప్పాలని సోషల్‌ మీడియాలో శనివారం పోల్‌ పెట్టారు. 24 గంటల పాటు పోల్ కొనసాగగా.. పోలింగ్‌లో ట్రంప్‌కు అనుకూలంగా 51.8 శాతం, వ్యతిరేకంగా 48.2 శాతం మంది ఓటింగ్‌ చేశారు. ట్రంప్‌ ట్విట్టర్‌ ఖాతా పునరుద్ధించాలనే ఎక్కువ మంది కోరుకోవడంతో అకౌంట్‌పై బ్యాన్‌ను ఎత్తివేశారు. 

ఈ నేపథ్యంలో ట్రంప్‌ ట్విట్టర్‌పై బ్యాన్‌ ఎత్తివేస్తున్నట్టు ఎలాన్‌ మస్క​్‌ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రజల స్వరమే.. దేవుడి స్వరమంటూ మస్క్‌ కామెంట్స్‌ చేయడం విశేషం. ఇక, 22 నెలల తర్వాత ట్రంప్‌ అకౌంట్‌ ట్విట్టర్‌లో మళ్లీ ప్రత్యక్షమైంది. దీంతో, ట్రంప్‌ మద్దతుదారులు ఆనందంలో కామెంట్స్‌ చేస్తున్నారు. 


 

మరిన్ని వార్తలు