అభిశంసన: ట్రంప్‌ కన్నా ముందు ఎవరంటే

14 Jan, 2021 13:15 IST|Sakshi

వాషింగ్టన్‌: గత వారం కాపిటల్ భవనంలోకి చొరబాట్లను ప్రేరేపించినందుకు గాను అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను ప్రతినిధుల సభ అభిశంసించింది. దాంతో రెండు సార్లు అభిశంసనకు గురైన ఏకైక అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ చరిత్ర సృష్టించారు. ఇక ట్రంప్‌ అధ్యక్ష పదవి ముగియడానికి మరి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రస్తుతం ఆయన డెమొక్రాట్‌ నియంత్రణలో ఉన్న సెనేట్ తీసుకువచ్చిన అభిశంసన చర్య విచారణ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ట్రంప్‌ను తొలగించడానికి 232 మద్దతిచ్చారు.

కాపిటల్‌ భవనంపై దాడి ఘటనలో ఐదుగురు మరణించడమే కాక అమెరికాలో ప్రజాస్వామ్య స్థానాన్ని దిగ్భ్రాంతికి గురి చేసినందుకు గాను ట్రంప్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 10 మంది రిపబ్లికన్లు అధ్యక్షుడు ట్రంప్‌ను పదవి నుంచి తొలగించడానికి డెమొక్రాట్లలో చేరారు. ఇక ట్రంప్‌ కన్నా ముందు అమెరికా చరిత్రలో మరో ముగ్గురు అధ్యక్షులు కూడా అభిశంసనకు గురయ్యారు. వారు బిల్ క్లింటన్, ఆండ్రూ జాన్సన్, రిచర్డ్‌ నిక్సన్‌. వీరిలో బిల్‌ క్లింటన్‌ని, ఆండ్రూ జాన్సన్‌ని సెనెట్‌ నిర్దోషులుగా తేల్చగా.. రిచర్డ్‌ నిక్సన్‌ ఓటింగ్‌కు ముదే రాజీనామా చేశారు.  

1867లో ఆండ్రూ జాన్సన్‌పై తొలిసారిగా అభిశంసన తీర్మానం
అమెరికా అధ్యక్షుడిగా ఉంటూ తొలిసారిగా అభిశంసన తీర్మానం ఎదుర్కొన్న వారిలో 17వ అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ ఉన్నారు. 1865లో ఆయన అభిశంసన తీర్మానం ఎదుర్కొన్నారు. ఇక ఒక్క ఓటు తేడాతో ఆయన గట్టెక్కారు. అబ్రహాం లింకన్ హత్యకు గురైన తర్వాత అప్పటి వరకు వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న ఆండ్రూ జాన్సన్ అధ్యక్షుడయ్యారు. ఆయనపై 1867 పదవీకాల చట్టాన్ని ఉల్లంఘించిన ప్రాథమిక అభియోగంపై సభ 11 అభిశంసన పత్రాలను ఆమోదించింది. ఇక 1868లో ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఒక్క ఓటుతో ఆండ్రూ జాన్సన్ గట్టెక్కారు. (చదవండి: అభిశంసనకు గురైన డొనాల్డ్ ట్రంప్)

1999లో బిల్‌ క్లింటన్‌పై అభిశంసన తీర్మానం 
ఇక అభిశంసన తీర్మానం ఎదుర్కొన్న రెండవ అధ్యక్షుడిగా బిల్‌ క్లింటన్‌ నిలిచారు. మోనికా లెవెన్‌స్కీ స్కాండల్‌లో బిల్ క్లింటన్ అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. మోనికా లెవెన్‌స్కీతో అక్రమ సంబంధం ఉందని రుజువులతో సహా దొరికినప్పటికీ.. న్యాయస్థానం ముందు తనతో ఎలాంటి సంబంధం లేదని అబద్ధం చెప్పాలంటూ బిల్‌క్లింటన్ ఆమెపై ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అభిశంసన తీర్మానానికి ముందు జరిగే ప్రక్రియలో 228 మందిలో 206 మంది క్లింటన్‌పై విచారణ జరిపాలంటూ కోరారు. 1999లో విచారణ తర్వాత సెనేట్‌లో బిల్ క్లింటన్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టగా... మూడింట రెండోవంతు మెజార్టీ రాలేదు. దాంతో క్లింటన్ అధ్యక్షుడిగా కొనసాగారు. (చదవండి: అందుకే మోనికాతో ఎఫైర్‌: బిల్‌ క్లింటన్‌)

ఓటింగ్‌కు ముందే రాజీనామా చేసిన రిచర్డ్ నిక్సన్
రిచర్డ్ నిక్సన్ అమెరికాకు 37వ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1969 నుంచి 1974వరకు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన హయాంలో వాటర్ గేట్ స్కాండల్ వెలుగుచూసింది. డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ కార్యాలయంలో ఏకంగా సోదాలు జరిగాయి. దాంతో అధ్యక్షుడిగా ఉన్న రిచర్డ్ నిక్సన్‌‌కు చెడ్డపేరు వచ్చింది. ఇక పెద్ద ఎత్తున ఆయనపై ఆరోపణలు రావడంతో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని డిసైడ్ అయ్యారు. ఇక విచారణలో భాగంగా టెలిఫోన్ టేపులను ఇవ్వాలని కోరగా.. నిక్సన్ నిరాకరించారు. 1974 జూలైలో రిచర్డ్ నిక్సన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, న్యాయసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఇంపీచ్‌మెంట్‌పై ఓటింగ్ జరగక ముందే నిక్సన్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

మరిన్ని వార్తలు