బైడెన్‌కు ట్రంప్ వార్నింగ్.. ఊహించని ఎదురుదెబ్బలు తప్పవు..

4 Sep, 2022 13:34 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై తీవ్ర విమర్శలు చేశారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. శనివారం పెన్సిల్వేనియాలో రిపబ్లికన్ల ర్యాలీలో మాట్లాడుతూ బైడెనే మన శత్రువు అని వ్యాఖ్యానించారు. ఆగస్టు 8న ఫ్లోరిడాలోని తన నివాసంలో ఎఫ్‌బీఐ సోదాలు జరిగిన తర్వాత ట్రంప్ తొలిసారి ప్రజలు ముందుకు వచ్చి ఈ విషయంపై స్పందించారు. ఈ ఘటనను న్యాయానికి అపహాస్యంగా, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు.

తనను లక్ష‍్యంగా చేసుకున్నందుకు బైడెన్ సర్కార్‌కు ఊహించని ఎదురుదెబ్బలు తగులుతాయని ట్రంప్ హెచ్చరించారు. ఇదివరకు ఎన్నడూ చూడని పరిస్థితులను ఎదుర్కొంటారని పేర్కొన్నారు. అమెరికా చరిత్రలో బైడెన్‍లా ఏ అధ్యక్షుడూ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని ధ్వజమెత్తారు.

ఇటీవల తనను విమర్శిస్తూ బైడెన్ చేసిన ప్రసంగంపైనా ట్రంప్ మండిపడ్డారు.  బైడెన్ భాష ప్రజాస్యామ్య పునాదులను బెదిరించేలా అతివాదాన్ని ప్రతిబింబిస్తుందని ధ్వజమెత్తారు. అమెరికా అధ్యక్షులెవరూ ఇప్పటివరకు ఇలాంటి అత్యంత దుర్మార్గపు, విద్వేషపూరిత, విభజన ప్రసంగం చేయలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.  ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రిపబ్లికన్లు ప్రయత్నిస్తున్నారని, రాడికల్ లెఫ్టే ప్రజాస్వామ్యానికి అసలు ముప్పు అని చెప్పారు.

అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఆయన మద్దతుదారులు కుట్రలు పన్నుతున్నారని అధ్యక్షుడు జో బైడెన్‌ ఇటీవల ఆరోపించారు. అధికారం దక్కించుకోవడానికి దుర్బుద్ధితో రాజకీయ హింసను ఎగదోస్తున్న వారికి గట్టిగా బుద్ధి చెప్పాలని, తగిన గుణపాఠం నేర్పాలని అమెరికా ప్రజలకు పిలుపునిచ్చారు. ‘తీవ్రవాదులను’ కచ్చితంగా ఎదిరించాలని చెప్పారు. ఫిలడెల్ఫియాలోని ప్రఖ్యాత ఇండిపెండెన్స్‌ హాల్‌లో బైడెన్‌ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
చదవండి: భారతీయులకు గుడ్ న్యూస్.. ఇంటర్వ్యూ లేకుండానే అమెరికా వీసా!

మరిన్ని వార్తలు