Donald Trump: ట్రంప్ ఈజ్ బ్యాక్.. రెండేళ్ల తర్వాత ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం ఖాతాల పునరుద్ధరణ..

11 Feb, 2023 15:58 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం ఖాతాలను రెండేళ్ల తర్వాత పునరుద్ధరించింది మెటా. ఆయన వల్ల ఎలాంటి ముప్పు లేదని నిర్ధరించుకున్న తర్వాత ఈమేరకు నిర్ణయం తీసుకుంది. డొనాల్డ్ ట్రంప్ చివరిసారిగా 2021 జనవరి 6న సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగించారు. క్యాపిటల్ హిల్స్‌ భవనంలో హింస చెలరేగేలా తన ఫాలోవర్లను ప్రేరేపించినందుకు మెటా ఆయన ఖాతాలను నిరవధికంగా బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఖాతాలను తిరిగి పునరుద్ధరిస్తామని ఈ ఏడాది జనవరిలోనే మెటా ప్రకటించింది.

ట్రంప్‌కు ఇన్‌స్టాగ్రాంలో 23 మంది మిలియన్ల ఫాలోవర్లు, ఫేస్‌బుక్‌లో 34 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండేవారు. ఎన్నికల సమయంలో ప్రచారానికి కూడా సామాజిక మాధ్యమాల వేదికగానే ఆయన భారీగా ఫండ్స్ సమకూర్చుకున్నారు. వచ్చే ఏడాది అంటే 2024లో మళ్లీ అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం ఖాతాలను పునరుద్ధరించడం ఊరటినిచ్చే అంశమే. అయితే ఖాతాలు పునురుద్ధరించిన తర్వాత ట్రంప్ ఇంకా ఒక్క పోస్టు కూడా పెట్టలేదు. 

తన సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం విధించిన తర్వాత ట్రంప్ తన సొంత సంస్థల ద్వారా 'ట్రుత్ సోషల్‌' అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫాంను ప్రారంభించారు. ఇతర సామాజిక మాధ్యమాలు తనకు అవసరం లేదని చెప్పారు. దీంతో గతేడాది నవంబర్‌లోనే ట్విట్టర్ తన ఖాతాను పునరుద్ధరించినప్పటికీ అందులో యాక్టివ్‌గా ఉండటం లేదు. మరి ఇప్పుడు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం ఖాతాలనైనా తిరిగి వినియోగిస్తారో లేదో చూడాలి.
చదవండి: కిమ్ సైన్యంలో 'జాంబీలు'.. ఫొటో వైరల్..!

మరిన్ని వార్తలు