-

ఫౌచీ ఒక ఇడియట్‌: ట్రంప్

21 Oct, 2020 03:52 IST|Sakshi

కరోనాపై ఫౌచీ మాటలు విని అమెరికన్లు అలసిపోయారు

అవి పాటించి ఉంటే 5 లక్షల మంది బలయ్యేవారు

తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్‌ ఆంటోని ఫౌచీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఫౌచీ, ఇతర ఆరోగ్య నిపుణులపై నోరు పారేసుకున్నారు. కరోనా గురించి వారు చెప్పిన మాటలు విని విని అమెరికన్లు అందరూ అలసిపోయారని అన్నారు. కరోనా అంశంలో ఫౌచీ చెప్పిన సూచనలు తమ ప్రభుత్వం పాటించి ఉంటే 5 లక్షల మందికి పైగానే ప్రాణాలు కోల్పోయేవారని అన్నారు. నవంబర్‌ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో కరోనా కట్టడి అనేది ప్రధాన అంశంగా మారింది. ప్రభుత్వంలోని ఆరోగ్య నిపుణులు కరోనాని ఎదుర్కోవడంలో తీవ్రంగా విఫలమయ్యారంటూ డెమొక్రాట్లు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో లాస్‌వేగాస్‌లోని ఎన్నికల ప్రచారంలో ఆంటోని ఫౌచీ, ఇతర నిపుణులపై నోరు పారేసుకున్నారు. ‘కోవిడ్‌ సంక్షోభంతో అమెరికన్లు అలసిపోయారు. జరిగిందేదో జరిగింది మమ్మల్ని ఒంటరిగా వదిలేయండని వారు వేడుకుంటున్నారు. ఫౌచీ ఒక ఇడియట్‌’ అని ట్రంప్‌ దుయ్యబట్టారు. ఆయన మన మధ్య 350 ఏళ్లుగా ఉంటున్నారని, కరోనాని ఎదుర్కోవడంలో ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. 1984 నుంచి ఫౌచీ అమెరికా అంటువ్యాధి నిపుణుడిగా వ్యవహరిస్తున్నారు. ఫౌచీపై మాటల తూటాలు విసిరిన ట్రంప్‌ అవి తనకెక్కడ నెగెటివ్‌గా మారతాయేమోనని భావించారు. ఫౌచీని ఏమైనా అంటే అవి తనకే ఎదురు తిరుగుతాయన్న ట్రంప్‌.. ఫౌచీ మంచి వ్యక్తి అంటూ తిట్టిన నోటితోనే ప్రశంసల వర్షం కురిపించారు. 

డిబేట్‌లో కొత్త రూల్స్‌ 
అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగే చర్చా కార్యక్రమంలో కొత్త నిబంధనలు ఏర్పాటయ్యాయి. ఈ నిబంధనల్లో భాగంగా చర్చలో పాల్గొనే అభ్యర్థులు ఒకరికొకరు వాదనలో అడ్డుపడకుండా ఉండేందుకు వారివారి మైక్రోఫోనులను రెండు నిమిషాలు మ్యూట్‌ చేయడం జరుగుతుందని ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌ కమీషన్‌ తెలిపింది. ఈ రెండు నిమిషాలు ప్రత్యర్థి మైకు మ్యూట్‌లో ఉంచుతారు. దీంతో ప్రతి అభ్యర్థి తాను చెప్పదలచిన విషయాన్ని  అడ్డులేకుండా చెప్పే వీలుంటుంది. ఆపై సదరు విషయానికి సంబంధించి డిబేట్‌ కొనసాగుతుంది. రెండు పారీ్టలు ఇందుకు అంగీకరించాయని కమిషన్‌ తెలిపింది.  

మరిన్ని వార్తలు