హెచ్‌ 1బీ వీసా లాటరీ విధానానికి చెల్లు చీటీ

14 Jan, 2021 05:11 IST|Sakshi

వేతనాలు, నైపుణ్యాల ఆధారంగా హెచ్‌ 1బీ వీసాల జారీ

అమెరికా కొత్త నిబంధనలు

వాషింగ్టన్‌: హెచ్‌1 బీ వీసా ఎంపికకు ఇప్పటివరకు వాడుతున్న లాటరీ విధానాన్ని తొలగిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు. అధిక వేతనాలు, అత్యున్నత నైపుణ్యాల ఆధారంగా ఇక హెచ్‌ 1 బీ వీసాలను జారీ చేయనున్నట్లు మంగళవారం అమెరికా లేబర్‌  డిపార్ట్‌మెంట్‌ (డీఓఎల్‌) ప్రకటించింది. తాజా మార్పులతో హెచ్‌ 1 బీ వీసాతో, ఉద్యోగ ఆధారిత గ్రీన్‌ కార్డ్‌తో యూఎస్‌లో ఉద్యోగాలు చేస్తున్నవారి వేతనాలు కూడా గణనీయంగా పెరుగుతాయని పేర్కొంది. విదేశాల నుంచి చవకగా లభించే ఉద్యోగుల వల్ల అమెరికన్‌ ఉద్యోగులు ఎదుర్కొనే ముప్పును తొలగించే లక్ష్యంతో ఈ మార్పులు చేశారు. తాజా నిబంధనలు ఈ సంవత్సరం మార్చి 9 నుంచి అమల్లోకి రానున్నాయి.

తాజా నిర్ణయం ప్రధానంగా భారతీయ టెక్కీలపై, అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపనుంది. తాజా నిబంధనల ప్రకారం.. సంబంధిత రంగంలో ఉద్యోగికి లభిస్తున్న సగటు వేతనం కన్నా ఎక్కువ వేతనం అందించేందుకు సిద్ధమైన కంపెనీల దరఖాస్తులకు ప్రాధాన్యత ఇస్తారు. అమెరికా ఏటా జారీ చేసే 85 వేల హెచ్‌1బీ వీసాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఆక్యుపేషనల్‌ ఎంప్లాయిమెంట్‌ స్టాటిస్టిక్స్‌ (ఓఈఎస్‌) డేటా ఆధారంగా వివిధ ఉద్యోగ విభాగాల్లో వేతనాలను, నాలుగు స్థాయిలుగా (4 లెవెల్స్‌) విభజించి, డీఓఎల్‌ నియంత్రిస్తుంది. తాజా మార్పుల ప్రకారం.. ఈ స్థాయుల్లో కనీస వేతన స్థాయి భారీగా పెరగనుంది. అలాగే, భారత్‌ సహా విదేశీ కంపెనీలు తమ ఉద్యోగులకు హెచ్‌1బీ వీసా పొందేందుకు భారీగా వేతనాలను ఇవ్వాల్సి ఉంటుంది.  

రెండేళ్ల అనుభవం ఉన్నవారిపైనా ప్రభావం
అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న విదేశీ విద్యార్థులపై, అలాగే, కాలేజీ అనంతరం ఒకటి, రెండేళ్ల అనుభవం ఉన్నవారిపై కూడా ఈ మార్పులు భారీగా ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. అమెరికాలోని వివిధ యూనివర్సిటీల్లో ప్రస్తుతం సుమారు 2 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఎన్‌రోల్‌ చేసుకుని ఉన్నారు. వేతనాల ఆధారంగా హెచ్‌1బీ వీసాలను జారీ చేసే విధానంలో.. అధిక వేతనం పొందుతున్న ఉద్యోగులు, సీనియర్లకు ప్రాధాన్యత లభించడం వల్ల విద్యార్థులు, తక్కువ అనుభవం ఉన్నవారు ఆ మేరకు నష్టపోనున్నారు. విదేశీ విద్యార్థులు ప్రధానంగా లెవెల్‌ 1 పరిధిలోకి వస్తారు. అయితే, తాజా నిబంధనలు విద్యార్థులపై ప్రభావం చూపబోవని యూఎస్‌సీఐఎస్‌ (యునైటెడ్‌ స్టేట్స్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌) పేర్కొంది.

వారి ఓపీటీ (ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌) సమయాన్ని అధిక వేతనం పొందగల స్థాయికి వెళ్లేలా అనుభవం పొందేందుకు వినియోగించుకునే అవకాశముందని వివరించింది. అయితే, కేవలం ‘స్టెమ్‌’ విద్యార్థులకు మాత్రమే మూడేళ్ల ఓపీటీ ఉంటుంది. మిగతా విభాగాల విదేశీ విద్యార్థులు కేవలం ఒక సంవత్సరం ఓపీటీకే అర్హులు. మరోవైపు, మాస్టర్స్‌ డిగ్రీ ఉన్న, ఓపీటీ ద్వారా కొంత అనుభవం పొందిన విద్యార్థులు లెవెల్‌ 2 ఉద్యోగాలకు అర్హత సాధిస్తారు. కానీ, ఈ లెవెల్‌ హెచ్‌1బీ వీసా దరఖాస్తుల్లో పోటీ అత్యంత తీవ్రంగా ఉండటంతో వారికి వీసా లభించడం దాదాపు అసాధ్యమేనని నిపుణులు పేర్కొంటున్నారు. దాదాపు 50% పైగా దరఖాస్తులు ఈ లెవెల్‌ నుంచే వస్తాయన్నారు. ఈ ప్రతిపాదనలపై గతంలో జరిపిన అభిప్రాయ సేకరణలో పలు విశ్వవిద్యాలయాలు ఈ మార్పులపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. విద్యాభ్యాసం అనంతరం ఉద్యోగం లభించే విషయంలో నెలకొనే అనిశ్చితి వల్ల విదేశీ విద్యార్థులు అమెరికాను ఉన్నత విద్యకు ఎంపిక చేసుకోకపోవచ్చని పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు