2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..

23 Oct, 2022 17:58 IST|Sakshi

వాషింగ్టన్‌: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మరోసారి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈసారి చారిత్రక విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. శనివారం రాత్రి టెక్సాస్‌లో జరిగిన ఓ సమావేశంలో వేల మంది రిపబ్లికన్లను ఉద్దేశిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే ఇప్పటికీ 2020లో ఓటమిని మాత్రం ట్రంప్ అంగీకరించలేదు. 2016తో పాటు 2020లోనూ తానే విజయం సాధించానని, గతంలో కంటే మిలియన్ ఓట్లు ఎక్కువ సాధించి రికార్డు సృష్టించినట్లు పేర్కొన్నారు. ఈసారి కూడా భారీ మెజార్టీతో గెలుస్తాని ధీమా వ్యక్తం చేశారు. రిపబ్లికన్లంతా మరింత పట్టుదలతో ఉండాలని సూచించారు.

2022 జనవరి 6న క్యాపిటల్ హిల్‌ హింసాత్మక ఘటనకు సంబంధించి హౌస్ సెలక్ట్ కమిటీ ట్రంప్‌కు సమన్లు పంపిన మరునాడే ఆయన ఎన్నికల్లో పోటీపై మాట్లాడటం గమనార్హం. బైడెన్ విజయాన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్ మద్దతుదారులు ఆరోజు క్యాపిటల్ భవనంతో విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే.

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ ఘన విజయం సాధించినప్పటికీ.. ట్రంప్‌ మాత్రం తానే గెలిచానని చెప్పుకుంటున్నారు. బెడైన్ మోసానికి పాల్పడి ఎన్నికల్లో గెలిచారని ఆరోపించారు. ఫలితాలు వచ్చి మూడేళ్లు గడిచినా ఇంకా తన వాదననే సమర్థించుకుంటున్నారు.
చదవండి: బ్రిటన్ ప్రధాని పోటీలో ఉన్నా.. అధికారికంగా ప్రకటించిన రిషి సునాక్‌..

మరిన్ని వార్తలు