జూనియర్‌ ట్రంప్‌కి కరోనా..

21 Nov, 2020 09:35 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుటుంబాన్ని కరోనా వైరస్‌ వదలడం లేదు. అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్‌ దంపతులు కోవిడ్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రంప్‌ పెద్ద కుమారుడు జూనియర్‌ ట్రంప్‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన తన క్యాబిన్‌లోనే హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘జూనియర్‌ ట్రంప్‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఎలాంటి లక్షణాలు బయటపడలేదు. ప్రస్తుతం ఆయన కోవిడ్‌-19 మెడికల్‌ గైడ్‌లైన్స్‌ని పాటిస్తూ హోం క్వారంటైన్‌లో ఉన్నారు’ అని తెలిపాడు. జూనియర్‌ ట్రంప్‌ కరోనా బారిన పడటంతో ట్రంప్‌ దంపతులతో పాటు వారి చిన్న కుమారుడు బారన్‌, ఇతర సిబ్బందికి పరీక్షలు నిర్వహించనున్నారు. అంతకుముందు శుక్రవారం, వైట్ హౌస్ సహాయకుడు, ట్రంప్‌ వ్యక్తిగత న్యాయవాది రూడీ గియులియాని కుమారుడు ఆండ్రూ గియులియాని తాను కరోనా బారిన పడినట్లు ప్రకటించాడు. (జూనియర్‌ ట్రంప్‌ గర్ల్‌ఫ్రెండ్‌కు కరోనా..)

ఇక నవంబర్ 3 జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్‌ చేతిలో ఓడిపోయినట్లు ట్రంప్‌తో పాటు జూనియర్‌ ట్రంప్‌ కూడా అంగీకరించడం లేదు. ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇక కరోనా విషయంలో తండ్రికొడుకులిద్దరూ నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. కరోనా గురించి పెద్దగా భయపడాల్సిన పని లేదు అన్నారు. (కోవిడ్‌ కష్టాలు విని బైడెన్‌ భావోద్వేగం)

ఇక అమెరికాలో ఇప్ప‌టివ‌ర‌కు 1,22,68,678 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇందులో 2,60,235 మంది మ‌ర‌ణించ‌గా, 73,12,279 మంది బాధితులు కోలుకున్నారు. మ‌రో 46,96,164 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, ప్ర‌పంచవ్యాప్తంగా 5,78,89,287 కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 4,00,93,744 మంది కోలుకోగా, 1,64,18,785 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మ‌రో 13,76,758 మంది చ‌నిపోయారు.

మరిన్ని వార్తలు