డెమోక్రాటిక్‌ అభ్యర్థులపై నోరు పారేసుకున్న ట్రంప్‌

15 Aug, 2020 20:44 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా ఉపాధ్యక్ష పదవికి డెమోక్రాట్‌ అభ్యర్థిగా జో బిడెన్,‌ కమలా హ్యారిస్‌ను ప్రకటించిన నాటి నుంచి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు నోరు ఊరుకోవడం లేదు. ఆమె గురించి ఏదో ఓ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి ఆమెపై తన ఆక్రోశాన్ని వెల్లడించారు ట్రంప్‌. జో బిడెన్‌, కమలా హ్యారిస్‌లు గెలిస్తే.. పోలీస్‌ స్టేషన్లను రద్దు చేసే చట్టాలను ఆమోదిస్తారని ఆరోపించారు. సిటీ ఆఫ్ న్యూయార్క్ పోలీస్ బెనెవోలెంట్ అసోసియేషన్ సభ్యులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కమలా హ్యారిస్‌.. జో బిడెన్‌ కన్నా అధ్వానంగా ప్రవర్తిస్తుందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాక కమలా హ్యారిస్‌ కన్నా తనకే ఎక్కువ మంది భారతీయులు తెలుసన్నారు ట్రంప్‌. (టిక్‌టాక్‌ బ్యాన్ : ట్రంప్ ఊరట)

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘జో బిడెన్‌ అధ్యక్షుడైతే.. అతను వెంటనే అమెరికాలోని ప్రతి పోలీసు విభాగాన్ని తగ్గించే చట్టాన్ని ఆమోదిస్తాడు. ఆమె(కమలా హ్యారిస్‌) బిడెన్‌ కంటే మరి అధ్వానంగా ప్రవర్తిస్తారు. ఆమె కంటే ఎక్కువ మంది భారతీయులు నా వైపున ఉన్నారు’ అంటూ వ్యాఖ్యానించారు ట్రంప్‌. దీనికన్నా ముందు ట్రంప్‌ కమలా హ్యారిస్‌ అమెరికాలో జన్మించలేదని.. ఆమెకు ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యే అర్హత లేదని ఆరోపించారు. అంతేకాక ఓ నల్లజాతి మహిళ అమెరికన్ల అవసరాలు తీర్చలేదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 

>
మరిన్ని వార్తలు