అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్‌ కార్డ్‌

9 Sep, 2020 17:47 IST|Sakshi

ట్రంప్‌ను నామినేట్‌ చేసిన నార్వే ఎంపీ

న్యూయార్క్‌ : 2021 సంవత్సరానికి ప్రతిష్టాత్మక నోబెల్‌ శాంతి పురస్కారానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను నార్వే ఎంపీ టిబ్రింగ్‌ జడ్డే నామినేట్‌ చేశారు. ప్రపంచవ్యాప్తంగా పలు వివాదాల పరిష్కారానికి ట్రంప్‌ చొరవ చూపారని జడ్డే ప్రశంసించారు. ఇజ్రాయల్‌-యూఏఈ మధ్య ట్రంప్‌ కుదిర్చిన శాంతి ఒప్పందం చారిత్రాత్మకమైనదని కొనియాడారు.  మధ్యప్రాచ్యంలో సైనిక దళాల తగ్గింపుతో పాటు శాంతి సాధనకు ట్రంప్‌ విశేషంగా కృషిచేశారని అన్నారు. యూఏఈ-ఇజ్రాయల్‌ మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ట్రంప్‌ యంత్రాంగం కీలక పాత్ర పోషించిందని జడ్డే అన్నారు.

ఇక ఆగస్ట్‌ 13న స్వయంగా అధ్యక్షుడు ప్రకటించిన ఈ ఒప్పందం ట్రంప్‌ విదేశాంగ విధానం సాధించిన కీలక విజయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా సెప్టెంబర్‌ 15న వైట్‌హౌస్‌లో యూఏఈ-ఇజ్రాయల్‌ ఒప్పందంపై ఇజ్రాయల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు, ఎమిరేట్స​ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్‌ జయేద్‌ అల్‌ నహ్యాన్‌ల సమక్షంలో సంతకాలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. నలుగురు అమెరికా అధ్యక్షులు ఇప్పటివరకూ నోబెల్‌ శాంతి బహుమతి అందుకున్నారు. అమెరికా అధ్యక్షులు రూజ్‌వెల్ట్‌, వుడ్రూ విల్సన్‌, జిమ్మీ కార్టర్‌, బరాక్‌ ఒబామాలకు నోబెల్‌ శాంతి బహుమతి లభించింది. 2021 విజేత ఎవరనేది వచ్చే ఏడాది అక్టోబర్‌ తర్వాత ప్రకటిస్తారు. చదవండి : హారిస్‌ ప్రెసిడెంట్‌ అయితే.. అమెరికాకే అవమానం

మరిన్ని వార్తలు