అధికార మార్పిడికి అడ్డంకులు

21 Nov, 2020 05:00 IST|Sakshi

ససేమిరా అంటున్న ట్రంప్‌

ఓటమి ఒప్పుకోవాలని ఒత్తిళ్లు

మొండివాడు రాజుకంటే బలవంతుడు ఈ సామెత డొనాల్డ్‌ ట్రంప్‌కి అతికినట్టుగా సరిపోతుంది ట్రంప్‌ పట్టిన పట్టు వీడడం లేదు. అధికార మార్పిడికి అంగీకరించడం లేదు తానే గెలిచానని పూటకో ప్రకటన చేస్తున్నారు ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ కోర్టు తలుపులు తట్టారు అధికారాల అప్పగింత సజావుగా సాగకపోతే అమెరికాపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఇప్పుడిదే చర్చ జరుగుతోంది.

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, తానే గెలిచానంటూ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదే పదే చేస్తున్న ప్రకటనలతో అధికార బదలాయింపు ప్రక్రియపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. అ«ధికార మార్పిడికి అంగీకరించకుండా మొండిగా వ్యవహరిస్తున్న ట్రంప్‌ ఎన్నికలు భద్రంగా, పారదర్శకంగా జరిగాయని పేర్కొన్న ఎన్నికల అధికారి క్రిస్టోఫర్‌ క్రెబ్స్‌ను సస్పెండ్‌ చేశారు. కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ కాలం గడిపేస్తున్నారు. అధ్యక్షుడి ఎన్నికను  జనరల్‌ సర్వీసెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (జీఎస్‌ఏ) అధికారికంగా గుర్తించాలి.

అప్పుడే అధికారాల బదలాయింపు ప్రారంభమవుతుంది. ట్రంప్‌ ఓటమి అంగీకరించకపోవడంతో ఆ విభాగం చీఫ్‌ఎమిలి మర్ఫీ అధికార మార్పిడికి సంబంధించిన పత్రాలపై సంతకాలు చేయలేదు. దీంతో ఈ ప్రక్రియ మరింత జటిలంగా మారింది. అమెరికాలో ఫలితాలు వెలువడ్డాక కాబోయే అధ్యక్షుడి దగ్గరకు ప్రస్తుత అధ్యక్షుడు స్వయంగా వెళ్లి అభినందించి వస్తారు. అప్పట్నుంచే అధికార మార్పిడి మొదలవుతుంది.

ట్రంప్‌ ఏం చేస్తారు ?
ఎన్నికల్లో బైడెనే గెలిచినప్పటికీ వచ్చే ఏడాది జనవరి 20 వరకు ట్రంపే అధ్యక్షుడిగా కొనసాగుతారు. అందుకే ఆయన ఎవరి మాటా వినడం లేదు. కరోనా విజృంభణతో దేశ ఆర్థిక, ఆరోగ్య వ్యవస్థలు కునారిల్లాయి. పలు ఉగ్ర సంస్థలు అమెరికాపై గురి పెట్టి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ట్రంప్‌  అధికార మార్పిడికి సహకరించాలని రిపబ్లికన్‌ పార్టీలోనూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ట్రంప్‌ ఇంకా కాలయాపన చేస్తే కరోనా మరణాలు పెరిగిపోతాయని బైడెన్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  పన్ను ఎగవేత, పరువు నష్టం కేసులు ఉండడంతో ట్రంప్‌ దిగిరాక తప్పదని డెమొక్రట్లు ధీమాగా ఉన్నారు.  

యంత్రాంగం కసరత్తు సంక్లిష్టం
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన వారు పాలనా యంత్రాంగంపై పట్టు సాధిం చడం సంక్లిష్టంగా సాగే ప్రక్రియ. అందుకు రాజ్యాంగం వారికి రెండు 3 నెలలు గడువు ఇచ్చింది. ప్రభుత్వంలో 100కి పైగా ఆపరేటింగ్‌ ఏజెన్సీలు, వాటికి సబ్‌ ఏజెన్సీలు ఉన్నాయి. వాటి పనితీరుని కొత్త అధ్యక్షుడు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రెసిడెన్షియల్‌ ట్రాన్సిషన్‌ యాక్ట్‌ ప్రకారం కాబోయే అధ్యక్షుడి బృందానికి, కార్యాలయానికి అవసరమైన స్థలం కేటాయించాలి. 4 వేల రాజకీయ పదవుల్ని భర్తీ చేయాలి. వాటిలో 1,200 పదవులకు సెనేట్‌ ఆమోద ముద్ర పడాలి. ప్రభుత్వ యంత్రాంగం కూర్పుకి కావల్సిన కోటి డాలర్ల నిధులు ఇవ్వాలి. ఇవన్నీ జరగకుంటే జాతీయ భద్రతకి, ప్రజా జీవనానికి పెను సవాళ్లు ఎదురవుతాయని సెంటర్‌ ఫర్‌ ప్రెసిడెన్షియల్‌ ట్రాన్సిషన్‌  డైరెక్టర్‌ మాక్స్‌ అభిప్రాయపడ్డారు.

 అధికార మార్పిడిలో జాప్యంతోనే 9/11 దాడులు ?
అమెరికాపై 2001, సెప్టెంబర్‌ 11 దాడులకి ప్రధాన కారణం అధికార బదలాయింపులో జాప్యమేనని దాడులపై ఏర్పాటైన కమిషన్‌  గట్టిగా చెప్పింది. 2000 ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ అభ్యర్థి అల్‌ గొరె, రిపబ్లికన్‌ అభ్యర్థి జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఫ్లోరిడా ఫలితంపై వివాదం నెలకొనడంతో  అధికార మార్పిడి ప్రక్రియ ఆలస్యమైంది.  జాతీయ భద్రతకు సంబంధించి ముఖ్యమైన అధికారుల్ని నియమించడంలో బుష్‌ ప్రభుత్వానికి తగినంత సమయంలో లేకపోవడం వల్లే 2001, సెప్టెంబర్‌ 11న దాడులు జరిగాయని కమిషన్‌ విశ్లేషించింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా