ట్రంప్‌ ఐటీ 750 డాలర్లు!

29 Sep, 2020 04:00 IST|Sakshi

తక్కువ ఆదాయపన్ను చెల్లించారంటూ న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 2016, 2017 సంవత్సరాల్లో ఏటా కేవలం 750 డాలర్ల ఆదాయపన్ను చెల్లించారని న్యూయార్క్‌టైమ్స్‌ ఒక కథనంలో వెల్లడించింది. అదే 2017లో ఆయన, ఆయన కంపెనీలు భారత్‌లో పన్ను రూపేణా 1,45,400 డాలర్లు చెల్లించారని తెలిపింది. అదే సంవత్సరంలో పనామాలో 15,598 డాలర్లు, ఫిలిప్పీన్స్‌లో 1,56,824 డాలర్ల పన్నును చెల్లించినట్లు వివరించింది. కానీ స్వదేశానికి వచ్చేసరికి గత 15 సంవత్సరాల్లో పదేళ్లు ఎలాంటి పన్ను చెల్లించలేదని పేర్కొంది. ఆయా సంవత్సరాల్లో తనకు లాభాల కన్నా నష్టాలే ఎక్కువని ట్రంప్‌ చూపినట్లు తెలిపింది.

గత ఇరవై సంవత్సరాల టాక్స్‌ రిటర్న్‌ డేటాను విశ్లేషించి ఈ విషయం రాబట్టినట్లు తెలిపింది. త్వరలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో పన్ను ఆరోపణలు రావడం ట్రంప్‌నకు ఇబ్బందేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇవన్నీ అవాస్తవ కథనాలని ట్రంప్‌ కొట్టి పారేశారు. తాను పన్నులు చెల్లించానని, ప్రస్తుతం తన టాక్స్‌ రిటర్న్స్‌ ఆడిటింగ్‌లో ఉన్నాయని, పూర్తయ్యాక చెక్‌ చేసుకోవచ్చని తెలిపారు. న్యూయార్క్‌టైమ్స్‌ అనవసరంగా తనపై బురదజల్లుతోందన్నారు. పలు రాష్ట్రాల్లో తాను ఎంతో సొమ్మును పన్నుల రూపంలో చెల్లించానన్నారు. తనకున్న పలు కంపెనీలన్నింటి వివరాలతో కలిపి తన ట్యాక్స్‌ ఫైలింగ్స్‌ 108 పేజీలుంటుందని చెప్పారు.

మంగళవారం మాటల పోరు
నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల కోలాహలం ఈ నెల 29 నుంచి మరింత ఊపందుకోనుంది. మంగళవారం రోజు ప్రధాన పార్టీల అభ్యర్ధులు ట్రంప్, జోబైడెన్‌ ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌లో పాల్గొననున్నారు. ఎన్నికలకు ముందు ఇలాంటి ప్రధానడిబేట్లు 3 జరుగుతాయి. ‘సూపర్‌ బౌల్‌ ఆఫ్‌ అమెరికన్‌ డెమొక్రసీ’ పేరిట జరిగే ఈ కార్యక్రమంలో ఇరువురు వివిధ అంశాలపై తమపై సంధించే ప్రశ్నలకు సమాధానాలిస్తారు. అక్టోబర్‌ 7న ఉపాధ్యక్ష అభ్యర్ధులు మైక్‌ పెన్స్, కమలాహారిస్‌లు డిబేట్‌లో పాల్గొంటారు.

మరిన్ని వార్తలు