పన్నులు ఎగవేస్తున్న డొనాల్డ్‌ ట్రంప్‌!

28 Sep, 2020 14:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గత పదేళ్ల కాలంలో కేవలం రెండే రెండు ఏళ్లకు ఆదాయం పన్ను చెల్లించారని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. తనకు ఆదాయం కన్నా నష్టాలే ఎక్కువ వచ్చినందున ఆదాయం పన్ను చెల్లించాల్సిన అవసరం లేదంటూ ఆయన ఆ శాఖకు వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఈ విషయాలను న్యూయార్క్‌ టైమ్స్‌ ఆదివారం నాటి సంచికలో వెల్లడించింది. (టిక్‌టాక్ బ్యాన్ : ట్రంప్‌నకు ఎదురుదెబ్బ)

డొనాల్డ్‌ ట్రంప్‌ గత 15 ఏళ్ల కాలంలో పదేళ్లపాటు ఆదాయం పన్ను చెల్లించకుండా తప్పించుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ఎన్నికైన 2016 సంవత్సరంలో కేవలం 750 డాలర్లు,  ఆ మరుసటి సంవత్సరం, అంటే 2017 సంవత్సరానికి మరో 750 డాలర్లు ఆదాయం పన్ను చెల్లించారు. తనకు ఆదాయానికి మించిన నష్టాలు వచ్చినందున తాను ఆదాయం పన్ను చెల్లించాల్సిన అవసరం లేదంటూ అమెరికా ప్రభుత్వ రెవెన్యూ శాఖకు ట్రంప్‌ వివరణ ఇచ్చారు. అయితే ఆయన తన ఆస్తుల వివరాలనుగానీ, నష్టాల వివరాలనుగానీ వెల్లడించలేదు. ఆయన ఆస్తులపై అమెరికా రెవెన్యూ శాఖ ఎలాంటి దర్యాప్తునకు ఆదేశించలేదు. (ట్రంప్‌ వైపు ఇండియన్‌ అమెరికన్లు మొగ్గు)

అమెరికా చట్టాల ప్రకారం అమెరికా అధ్యక్షులు తమ వ్యక్తిగత ఆదాయం వివరాలను ప్రజాముఖంగా వెల్లడించాల్సిన అవసరం లేదు. అయితే 1970 రిచర్డ్‌ నిక్సన్, ఇప్పుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మాత్రమే ఆస్తుల వివరాలను వెల్లడించలేదు. మిగతా అధ్యక్షులందరు వెల్లిడిస్తూ వచ్చారు. తాను కిమిషనర్‌ ఆధ్వర్యంలో ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీస్‌ ఆడిట్‌ పరిధిలో ఉన్నందున తాను ఆదాయం పన్ను రిటర్న్స్‌ను ప్రజలకు వెల్లడించలేనని కూడా ట్రంప్‌ చెప్పుకున్నారు. కోట్ల డాలర్ల ఆస్తి కలిగిన డొనాల్డ్‌ ట్రంప్‌ నష్టాల పేరిట ఆదాయ పన్నును తప్పించుకోవడమే కాకుండా గతంలో కట్టిన పన్ను నుంచి కొంత మొత్తాలను వెనక్కి తీసుకుంటున్నారంటూ న్యూయార్క్‌ టైమ్స్‌లో వచ్చిన వార్తను ట్రంప్‌ ఖండించారు. తాను కేంద్ర ప్రభుత్వానికే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా పన్నులు చెల్లిస్తున్నానని, పన్ను భారం తగ్గించుకునేందుకు సిబ్బందిని ఎక్కువగా నియమించుకుంటున్నానని ఆయన వివరించారు.  (ట్రంప్‌కు షాకిచ్చిన రిపబ్లికన్లు)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు