73 మందికి ట్రంప్‌ క్షమాభిక్ష

21 Jan, 2021 05:46 IST|Sakshi

మాజీ వ్యూహకర్త స్టీవ్‌ బ్యానెన్‌కి విముక్తి

మరో 70 మందికి శిక్ష తగ్గింపు

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడిగా పదవి వీడడానికి కొన్ని గంటల ముందు డొనాల్డ్‌ ట్రంప్‌ తాను అనుకున్న పనులన్నీ పూర్తి చేశారు. అందరూ ఊహిస్తున్నట్టుగానే భారీగా కసరత్తు చేసి వైట్‌హౌస్‌ మాజీ వ్యూహకర్త స్టీవ్‌ బ్యానెన్‌తో పాటు 73 మందికి క్షమాభిక్ష ప్రసాదించారు. మరో 70 మందికి శిక్షల్ని తగ్గించారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ గెలుపు కోసం కృషి చేసిన వారిలో స్టీవ్‌ బ్యానెన్‌ అత్యంత ముఖ్యుడు. అయితే తాను మాత్రం స్వీయ క్షమాభిక్షకి దూరంగా ఉన్నారు. తనని తాను క్షమించుకుంటే తప్పుల్ని ఒప్పుకున్నట్టవుతుందని భావించిన ట్రంప్‌ ఆ సాహసం చేయలేదని సమాచారం. కానీ కాంగ్రెస్‌ మాజీ సభ్యులు, రాప్‌ సింగర్లు, ఇతర సన్నిహితులు, తన కుటుంబానికి సన్నిహితులైన ఎందరికో క్షమాభిక్ష పెట్టారు.

రష్యాతో గూఢచర్యం కేసులో దోషులుగా తేలిన వారిని కూడా ట్రంప్‌ క్షమించారు. మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం కోసం సేకరించిన నిధుల్లో అవకతవకలకు సంబంధించిన కేసులో జైల్లో ఉంటూ ఇంకా ఎక్కువ కాలం కాకుండానే స్టీవ్‌ బ్యానెన్‌కు విముక్తి కల్పించారు. సాధారణంగా అమెరికా అధ్యక్షులు సుదీర్ఘకాలం జైలు శిక్ష అనుభవిస్తున్న వారికి క్షమాభిక్ష ఇస్తుంటారు. కానీ దానికి భిన్నంగా ట్రంప్‌ ఈ క్షమాభిక్షలపై ప్రత్యేకంగా కసరత్తు చేశారు. బ్యానెన్‌తో పాటు మలేషియా వెల్త్‌ ఫండ్‌ కేసు నుంచి విముక్తి కల్పించడానికి ట్రంప్‌ ప్రభుత్వాన్ని లాబీయింగ్‌ చేసిన కేసులో దోషిగా తేలిన ఎల్లియట్‌ బ్రాయిడా, తన అల్లుడు జేర్డ్‌ కుష్నర్‌ స్నేహితుడు, సైబర్‌ వేధింపుల కేసులో దోషి అయిన కెన్‌ కుర్సన్‌లను క్షమించారు. ఇలా ట్రంప్‌ అధ్యక్షుడిగా చివరి రోజు రికార్డు స్థాయిలో క్షమాభిక్షలు, శిక్ష తగ్గించడం వంటివి చేశారు.

వెనెజులా వలసదారుల అప్పగింత నిలిపివేత
ట్రంప్‌ ఆఖరినిమిషంలో వెనెజులా వలసదారులకి అండగా నిలిచారు. వేలాదిమంది వలసదారుల్ని వారి దేశానికి పంపకుండా అడ్డుకున్నారు. ట్రంప్‌కు అత్యంత విశ్వసనీయులుగా ఉన్న వారి అప్పగింతను మరో 18 నెలల పాటు పొడిగిస్తూ కార్యనిర్వాహక ఉత్వర్వులపై సంతకం చేశారు. దీంతో లక్షా 45 వేల మందికి పైగా వెనెజులా వలసదారులు అమెరికాలో ఉండే అవకాశం లభించింది. వెనెజులా సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నందున వారిని పంపడం లేదని ట్రంప్‌ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు