అభిశంసనపై వాదనలకు ట్రంప్‌ లాయర్ల బృందం ?

2 Feb, 2021 02:01 IST|Sakshi

వాషింగ్టన్‌: ఈ నెల 8వ తేదీ నుంచి సెనేట్‌లో ప్రారంభం కానున్న తన అభిశంసన విచారణకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేశారు. జనవరి 6వ తేదీన క్యాపిటల్‌ భవనంపై జరిగిన దాడికి ట్రంపే కారణమనీ, అధికారాన్ని ఆయన దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో డెమోక్రాట్లు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి ట్రంప్‌ సొంత రిపబ్లికన్‌ పార్టీకి చెందిన 10 మంది సభ్యులు మద్దతు ఇచ్చారు. దీంతో ఈ నెల 8వ తేదీన అభిశంసనపై విచారణకు మార్గం సుగమ మైంది. ట్రంప్‌ తరఫున ప్రముఖ లాయర్లు డేవిడ్‌ ష్కోయెన్, బ్రూస్‌ ఎల్‌ కాస్టర్‌ వాదనలు వినిపించనున్నారు. డెమోక్రాట్లు మూడింట రెండొంతుల మద్దతు సాధిస్తే అభిశంసన ఆమోదం పొందుతుంది. ఫలితంగా ట్రంప్‌ మరోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టే అవకాశం కోల్పోతారు. అయితే, సెనేట్‌లో రిపబ్లికన్లు, డెమోక్రాట్లకు చెరో 50 మంది సభ్యుల బలం ఉంది. తీర్మానం ఆమోదం పొందాలంటే డెమోక్రాట్లకు మరో 17 మంది మద్దతు అవసరం. అమెరికా చర్రితలో రెండుసార్లు అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు